ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత
ఉత్తర తెలంగాణకు బిజినెస్ హబ్‌గా ప్రసిద్ధి
దశాబ్దాలుగా ల్యాండ్ మార్క్‌లు పదిలం
వరంగల్, ఆగస్టు 23 : చారిత్రక నగరం ఓరుగల్లులోని కొన్ని ప్రాంతాలు ఒక్కో వ్యాపారానికి కేరాఫ్‌గా నిలిచాయి. దశాబ్దాలుగా ఆయా ప్రాంతాలు బిజినెస్‌కు ల్యాండ్‌మార్క్‌గా ప్రసిద్ధి చెందాయి. కేవలం వరంగల్‌కే గాక ఉత్తర తెలంగాణకే ఆ బజార్లు ట్రేడ్ సెంటర్లుగా విరాజిల్లుతూ ప్రత్యేకత సంతరించుకున్నాయి. రోజురోజుకూ విస్తరిస్తున్న నగరంలో అంతర్జాతీయ బ్రాండెడ్ షోరూంలు వెలుస్తున్నాయి. ప్రతి రోజూ ఆయా జిల్లాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు నడుస్తాయి. హైదరాబాద్ తరహాలో నగరంలోని అనేక ప్రాంతాలు ట్రేడ్ కేరాఫ్‌గా వెలుగొందుతున్నాయి. ఇలా దశాబ్దాల కాలంగా ఆయా ప్రాంతాలు ఒకే రకమైన వ్యాపారాలకు నిలయాలుగా మారాయి. వందలాది దుకాణాలు ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల ఆ ఏరియాలు నిత్యం రద్దీగా కనిపిస్తుంటాయి. నగరంలోని బిజినెస్ సెంటర్లుగా ఎలా మారాయో..? ఏయే ప్రాంతం ఏ వ్యాపారానికే ప్రత్యేకమో తెలుసుకుందాం.
బీట్‌బజార్.. హోల్‌సేల్ కిరాణాకు అడ్డా
వరంగల్ పాతబీట్ బజార్ హోల్‌సేల్ కిరాణా వ్యాపారానికి అడ్డాగా ఉంది. వందలాది హోల్‌సేల్ వ్యాపారాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడినుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎగుమతి చేస్తుంటారు. నగరంలోని ఇతర ప్రాంతాల కిరాణా వ్యాపారులు ప్రతిరోజూ బీట్‌బజార్‌కు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఇలా దశాబ్దాల కాలంగా బీట్‌బజార్ అంటేనే కిరాణా హోల్‌సేల్ వ్యాపారానికి సెంటర్ అనే పేరుంది. వాటితో పాటు కొబ్బరికాయలు, మంచినూనె, ఉల్లిగడ్డల హోల్‌సేల్ వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.
ఫార్మసీ హబ్‌గా పిన్నవారివీధి..
వరంగల్‌లోని పిన్నవారివీధి ఫార్మసీ హబ్‌గా పిలుస్తారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి వివిధ కంపెనీల మందులు ఇక్కడినుంచే కొనుగోలు చేస్తుంటారు. వందలాది మెడికల్ ఏజెన్సీలు ఈ వీధిలోనే ఉన్నాయి. వరంగల్ జిల్లాలో మెడికల్ ఏజెన్సీలు కేవలం పిన్నవారివీధిలోనే ఉన్నాయి. అందుకే దీనికి ఫార్మసీ హబ్ అని పేరుంది. చాలాకాలంగా ఈ ప్రాంతం మందుల వ్యాపారానికి ప్రసిద్ధి.
స్టేషన్‌రోడ్డు @ ఫర్టిలైజర్
వరంగల్ స్టేషన్‌రోడ్డు ఫర్టిలైజర్ షాపులకు అడ్డాగా ఉంది. దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో ఎరువులు, విత్తన వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి ప్రతి రైతూ స్టేషన్రోడ్డుకు వస్తుంటారు. హెడ్ ఫోస్టాపీస్ నుంచి వరంగల్ రైల్వేస్టేషన్ వరకు రోడ్డుకు ఇరువైపులా వందలాది ఫర్టిలైజర్స్ దుకాణాలు ఉంటాయి. ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా రైతులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. వరంగల్‌లో స్టేషన్రోడ్డును ఫర్టిలైజర్స్ షాపులకు కేరాఫ్ అడ్రస్‌గా చెబుతారు.
గిర్మాజీపేట.. ప్రింటర్స్ జంక్షన్
వరంగల్‌లోని గిర్మాజీపేట(రాధికా థియేటర్ లేన్)కు ప్రింటర్స్ జంక్షన్‌గా పేరుంది. ఎన్నో ఏళ్లుగా ఆ ప్రాంతంలో ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్‌లు నడుస్తున్నాయి. శుభలేఖలు, ఇతరత్రా కార్డులు ప్రింట్ చేయించేందుకు ఉమ్మడి జిల్లా నుంచి ఇక్కడికే వస్తుంటారు. నగరంలోని ప్రతి వ్యాపారి ప్రింటింగ్ కోసం ప్రింటర్స్ స్ట్రీట్‌కు రావాల్సిందే. సుమారు 200 ప్రింటింగ్, బైండింగ్, స్క్రీన్ ప్రింటింగ్ ప్రెస్‌లు ఇక్కడ ఉంటాయి. నగరంలో ప్రింటింగ్ ప్రెస్‌లకు గిర్మాజీపేట ప్రింటర్స్ స్ట్రీట్ ల్యాండ్ మార్క్‌గా మారింది.
హంటర్‌రోడ్.. మార్బుల్ బజార్
హంటర్ రోడ్డు మార్బుల్ బజార్‌గా మారింది. కొత్త ఇల్లు కట్టుకునే వారు హంటర్ రోడ్డులోని ఈ ప్రాంతానికి వెళ్లాల్సిందే. మార్బుల్, గ్రానెట్ వ్యాపారాలకు నెలవుగా ఉంది. వందలాది మార్బుల్, ఇంటీరియర్ వస్తువుల వ్యాపారాలు ఇక్కడ జరుగుతుంటాయి. హైదరాబాద్ ఎల్బీనగర్ తరహాలో హంటర్‌రోడ్ మార్బుల్ బజార్లో దుకాణాలు వెలిశాయి. రోడ్డుకు ఇరువైపులా మార్బుల్ షాపులతో ఈ బజార్ కళకళలాడుతోంది.