12.50 లక్షల మీటర్లకు ఆర్డర్
మడికొండ టెక్స్టైల్ పార్కులో చీరల తయారీ
కరోనా నేపథ్యంలో ఉపాధి కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి భరోసా
వరంగల్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందిపడుతున్న నేత కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల తయారీతో భరోసానిస్తోంది. ఈసారి వరంగల్ మహా నగరంలోని మడికొండ టెక్స్టైల్ పార్కులో 12.50 లక్షల మీటర్ల వస్ర్తాన్ని తయారు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. దీంతో ప్రత్యక్షంగా వెయ్యిమందికి పరోక్షంగా మరో నాలుగు వేలమందికి ఉపాధి లభిస్తున్నది. తొలిసారి రెండు లక్షల చీరల తయారీకి అవకాశం రావడంతో ఇక్కడి కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
తొలి పవర్లూమ్ పార్కు..
వరంగల్ మహానగరం పరిధిలోని మడికొండలోని 60 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసింది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో యూనిట్ల స్థాపన కోసం స్థలాలు కేటాయించింది. 364 మందితో కాకతీయ టెక్స్టైల్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటైంది. దేశంలోనే మొదటి పవర్లూమ్ టెక్స్టైల్ పార్కుగా ఇది నిలిచింది. ఉపాధి కోసం సూరత్, భీవండి, షోలాపూర్ ప్రాంతాలకు వెళ్లిన వారు తెలంగాణ ప్రభుత్వం చేయూతతో తిరిగి వచ్చి ఇక్కడ యూనిట్లు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 160 యూనిట్లు ఏర్పాటయ్యాయి. వంద యూనిట్లలో బతుకమ్మ చీరలు తయారవుతున్నాయి. ఒక్కో యూనిట్లో రూ. కోటి నుంచి రూ.1.40 కోట్లతో మిషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి యూనిట్లో 16 మిషన్లను ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంది. తొలి దశలో నాలుగు డాబీ, నాలుగు జకార్డు రకం మిషన్లను ఏర్పాటు చేశారు. డాబీ మిషన్లపై బతుకమ్మ చీరలు తయారువుతున్నాయి. ఒక్కో మిషన్‌పై ఏకకాలంలో రెండు చీరలు తయారుచేయడం ఇక్కడి ప్రత్యేకత. టెక్స్‌లైట్ పార్కులోనే కోములు(దారం ఉండలు)తో వర్ఫింగ్ చేస్తున్నారు. వీటితో చీరలను తయారుచేస్తున్నారు. మాస్టర్, ఆపరేటర్, హెల్పర్, వర్కర్, వాచ్మెన్ వంటి పనులతో ఇక్కడి వారికి ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో వచ్చే ఏడాది వరకు అన్ని యూనిట్లలో చీరలను ఉత్పత్తి చేసేలా పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ కోటా, కాకతీయ టెక్స్టైల్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ వాటా కలిపి రూ.10 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ వంటి పనులు పూర్తవుతున్నాయి. అంతర్గత రోడ్ల అభి వృద్ధి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బతుకమ్మతో భరోసా
దేశంలోనే తొలి పవర్లూమ్ టెక్స్టైల్ పార్కు మాది. పని మొదలైన యూనిట్లకు కరోనాతో ఇబ్బందులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చింది. 12.50 లక్షల మీటర్లకు అవకాశం కల్పించింది. ఇప్పుడు అన్ని మిషన్లు నడుస్తున్నయి. ఈ ఉత్సాహంతో పార్కులోని అన్ని యూనిట్లు నడిచేలా వేగంగా పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాకు ఎంతో చేస్తున్నారు. కరంటు సబ్సిడీ పూర్తయితే మాకు ఏ ఇబ్బందులూ ఉండవు.
పని దొరికింది
బతుకమ్మ చీరల ఆర్డర్‌తో రోజంతా నాలుగు మిషన్లు నడుస్తున్నయి. సర్కారు మాకు గొప్ప సా యం చేసింది. ప్రభుత్వం చెప్పిన పని ని సకాలంలో చేసేలా ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వం ఆదుకుంటుంద నే నమ్మకమే మమ్మల్ని నడిపిస్తాంది.