సర్కారు భూములకు జియోట్యాగింగ్
ప్రయోగాత్మకంగా మండలానికో గ్రామంలో అమలు
రికార్డుల ప్రకారం స్థలాల గుర్తింపు
గూగుల్ ద్వారా హద్దులు గుర్తిస్తున్న సర్వేయర్లు
వెలుగు చూస్తున్న భూ కబ్జాలు
సంబంధిత వ్యక్తులకు నోటీసుల జారీ
వరంగల్, ఆగస్టు 20 (నమస్తేతెలంగాణ) : సర్కారు భూములను సంరక్షించేందుకు, కబ్జాలో ఉన్నవాటి చెర విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రామాల్లో రికార్డుల మేరకు స్థలాలను గుర్తించి జియోట్యాగింగ్ చేయాలని అధికారయంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు రంగంలోకి దిగి ప్రభుత్వ భూముల గుర్తింపులో తలమునకలై హద్దులు ఖరారు చేసి ట్యాగింగ్ చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. ఊర్లలో కబ్జాలో ఉన్న బంచరాయి, పొరంబోకు, శిఖం, గుట్టల భూములను స్వాధీనం చేసుకునేందుకు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. రెవెన్యూ రికార్డులు, మ్యాప్, సర్వే నంబర్ల ఆధారంగా హద్దులు పెడుతుండడంతో కబ్జాదారులు కంగుతింటున్నారు.
ప్రభుత్వ భూముల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్యాక్రాంతం కాకుండా వాటిని జియోట్యాగింగ్ చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు రంగంలోకి దిగారు. రికార్డుల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నారు. హద్దులు ఖరారు చేసి, వాటిని జియోట్యాగింగ్ చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, ఈ కార్యక్రమం చేపడుతున్నా రు. విలువ పెరుగుతుండడంతో కబ్జాదారులు ప్రభు త్వ భూములపై కన్నేస్తున్నారు. ఆక్రమించి వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. దీంతో విలువైన ప్రభుత్వ భూములు కరిగిపోతున్నాయి. ప్రభు త్వ భూములను ప్రజల అవసరాలకు వినియోగించేందుకు అధికారులు ప్రయత్నించిన సమయంలో పెద్దమొత్తంలో అన్యాక్రాంతమైనట్లు బయటపడింది. కబ్జాదారులు చివరకు గుట్టలను సైతం వదిలిపెట్టకుండా ఆక్రమించడం వెలుగులోకి వచ్చింది. ఈ ఆక్రమణల వల్ల పల్లె, పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటు, డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలకు స్థలాలు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్న స్థలం వద్దకు వెళ్తే అందులో ఆక్రమణదారులు పాగా వేయటం చూసి అధికారులు నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూము లు, ఆక్రమణలను గుర్తించేందుకు రెవెన్యూ రికార్డుల ప్రకారం జియోట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
అక్టోబర్ వరకు గడువు
జిల్లాలో ప్రభుత్వ భూములను జియోట్యాగింగ్ చేసేందుకు కలెక్టర్ ఎం హరిత ఈ నెల 13న తహసీల్దార్లు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, సర్వేయర్లతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. రికార్డుల ప్రకారం కేటగిరీల వారీగా ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని జియోట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. అక్టోబర్ వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ప్రభుత్వ భూముల జియోట్యాగింగ్‌పై ప్రతి వారం మండలాల వారీగా మానిటరింగ్ చేస్తానని చెప్పారు. ఈ మేరకు తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, సర్వేయర్లు మండలం వారీగా సమావేశమై యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. మొదట పైలట్ ప్రాజెక్టుగా ప్రతి మండలంలో ఒక రెవెన్యూ గ్రామాన్ని ఎంపిక చేసుకుని ప్రభుత్వ భూముల జియోట్యాగింగ్ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో ఎదురయ్యే సమస్యలను గుర్తిం చి, ఇతర రెవెన్యూ గ్రామాల్లో సజావుగా ప్రభుత్వ భూముల జియోట్యాగింగ్ పూర్తి చేసేలా ముందుకు వెళ్తున్నారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో మూడునాలుగు రోజుల క్రితం ప్రభుత్వ భూముల జియోట్యాగింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. వర్దన్నపేట మండలంలోని దివిటిపల్లి, రాయపర్తి మండలంలోని గన్నారం రెవెన్యూ గ్రామంలో కొనసాగుతోంది.
ప్రభుత్వ భూముల హద్దులు ఫిక్స్
ప్రస్తుతం ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాలను సర్వేయర్లు, వీఆర్ఏలు సందర్శిస్తున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ భూములను గూగుల్ ద్వారా గుర్తిస్తున్నారు. అక్షాంశ, రేఖాంశాలతో వాటి హద్దులు ఫిక్స్ చేస్తున్నారు. ఆక్రమణకు గురైనప్పటికీ తమ వద్ద ఉన్న రెవెన్యూ రికార్డులు, మ్యాప్, సర్వే నంబర్ల ఆధారంగా ప్రభుత్వ భూముల హద్దులను ఖరారు చేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించిన, అసైన్డ్ భూములను కూడా గూగుల్ ద్వారా కొనుగొంటున్నారు. అసైన్డ్ భూములను వదిలేసి, మిగతా ఉండాల్సిన ప్రభుత్వ భూముల హద్దులను ఫిక్స్ చేస్తున్నారు. ప్రభుత్వ, పొరంబోకు, బంచరాయి, శిఖం, సీలింగ్, ఆలయ, రెవెన్యూ తదితర రకాల భూములన్నింటిని ఇలాగే గుర్తించి, హద్దులతో జియోట్యాగింగ్ చేస్తున్నారు. అన్యాక్రాంతమైన కొన్ని ప్రభుత్వ భూముల్లో కబ్జాదారులు నిర్మానాలు సైతం చేపట్టారు. గ్రామాల్లోని బంచరాయి, పొరంబోకు, శిఖం, గుట్టల భూములను ఆక్రమించుకున్న వారు దర్జాగా సాగు చేసుకుంటున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ప్రస్తుతం వాటిని స్వాధీనం చేసుకోకుండా ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తహసీల్దార్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఈ జియోట్యాగింగ్ ద్వారా గుర్తించిన ప్రభుత్వ భూములను ప్రజల అవసరాలకు వినియోగించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా జియోట్యాగింగ్‌తో హద్దులను ఖరారు చేయడం వల్ల ఇక ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉండదు. ఈ భూములను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు కార్యాలయాల నుంచి కంప్యూటర్ ద్వారా పర్యవేక్షించవచ్చు. ఈ ప్రక్రియతో జిల్లాలోని ప్రభుత్వ భూముల ఆక్రమణదారుల్లో గుబులు పుడుతోంది.