మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Dec 03, 2020 , 01:08:07

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

  • కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర
  • అన్నదాతల బాగు కోసం సంక్షేమ పథకాలు
  • జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి
  • పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

శాయంపేట, డిసెంబర్‌ 2: రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని తహార్‌పూర్‌లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. దళారుల నుంచి రైతులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని, అన్నదాతలు వినియోగించుకోవాలని కోరారు. గ్రేడ్‌-ఏ రకం ధాన్యానికి రూ. 1888, సాధారణ రకానికి రూ. 1868 మద్దతు చెల్లిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని రైతులను రాజులుగా చూడాలన్నదే సీఎం ధ్యేయమని, ఇందుకోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నట్లు వివరించారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులకు ధీమా కల్పిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి పెట్టుబడి సాయం అందిస్తూ సాగును ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. ప్రతి రైతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, డీసీవో పరమేశ్వర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ నాగనారాయణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుసుమ శరత్‌బాబు, వైస్‌ చైర్మన్‌ దూదిపాల తిరుపతిరెడ్డి, సీఈవో గుర్రం రాజమోహన్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, ఎంపీటీసీ గొట్టిముక్కుల స్వాతి, ఏవో గంగాజమున, సర్పంచ్‌ అరికిల్ల ప్రసాద్‌ పాల్గొన్నారు. అలాగే, మండలంలోని నేరేడుపల్లి, కాట్రపల్లి గ్రామాల్లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆకుతోట రాజేశ్‌ పాల్గొన్నారు.

ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలి

నర్సంపేట రూరల్‌: రైతులు ధాన్యాన్ని కల్లాల్లోనే ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని డీఆర్డీఏ ఏపీడీ శ్రీనివాస్‌ కోరారు. మండలంలోని మహేశ్వరంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ మోతె కళావతితో కలిసి ఆయన ప్రారంభించారు. తేమ శాతం 17లోపు ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మాడ్గుల కవిత, ఐకేపీ ఏపీఎం కుందేళ్ల మహేందర్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ మోతె జయపాల్‌రెడ్డి, సొసైటీ డైరెక్టర్‌ జనార్దన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే, నర్సంపేట పట్టణంలోని ద్వారకపేట, పసునూర్‌కాల్వ సమీపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ గుంటి రజిని-కిషన్‌, నర్సంపేట ఏడీఏ తోట శ్రీనివాసరావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, ఏఈవో మెండు అశోక్‌, కొనుగోలు కేంద్రం బాధ్యులు పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారమే కొనుగోళ్లు

ఖానాపురం: ప్రభుత్వ నిబంధనలకు లోబడే ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు సివిల్‌ సప్లయ్‌ డీఎం భాస్కర్‌రావు అన్నారు. అశోక్‌నగర్‌లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని, తాలు, మట్టి పేరుతో బస్తాకు రెండు కిలోల చొప్పున కోత విధిస్తున్నారని ఈ సందర్భంగా రైతులు డీఎం దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన రైతులు ధాన్యాన్ని తూర్పార పట్టి తాలు, మట్టి లేకుండా తీసుకురావాలని సూచించారు. నిబంధనల ప్రకారం ధాన్యం ఉన్నప్పుడు మిల్లర్లు కోత విధిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు 50 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఆయన వెంట సొసైటీ సిబ్బంది వెంకటేశ్వర్లు, గంగాధర రమేశ్‌, రైతులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

వర్ధన్నపేట: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎంపీపీ అన్నమనేని అప్పారావు కోరారు. మండలంలోని నల్లబెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ మార్గం భిక్షపతితో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో వెంట పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజేశ్‌ఖన్నా, సర్పంచ్‌ ముత్యం దేవేంద్ర, ఎంపీటీసీ దుగ్యాల జ్యోతి, ఉపసర్పంచ్‌ చంద్రయ్య, పీఏసీఎస్‌ కార్యదర్శి వెంకన్న, టీఆర్‌ఎస్‌ నాయకులు తూళ్ల కుమారస్వామి, తుమ్మల యాకయ్య పాల్గొన్నారు.

రైతులు దళారులను ఆశ్రయించొద్దు 

సంగెం: రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి అన్నారు. గవిచర్లలో ఓరుగల్లు జిల్లా మార్కెటింగ్‌ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దొనికెల రమ-శ్రీనివాస్‌, ఏవో సీహెచ్‌ యాకయ్య, ఏఈవో సాగర్‌, ఎంపీటీసీలు గూడ సంపత్‌, రంగరాజు నర్సింహస్వామి, కాపులకనపర్తి సొసైటీ వైస్‌ చైర్మన్‌ ముడిదె శ్రీనివాస్‌, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్‌ కూస కరుణాకర్‌, రాములు, దయాకర్‌, శ్రీనివాస్‌, సతీశ్‌, కూస మల్లయ్య, గూడ వెంకటేశ్వర్లు, మల్లయ్య, ఏలియా, ఎల్లయ్య పాల్గొన్నారు.

మద్దతు ధర అందించేందుకే..

నెక్కొండ: మద్దతు ధర అందించేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని ఎంపీపీ జాటోత్‌ రమేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మారం రాము అన్నారు. మండలకేంద్రంలో వారు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.  కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రామారపు పుండరీకం, సర్పంచ్‌ సొంటిరెడ్డి యమున రంజిత్‌రెడ్డి, ఏవో అడిదెల సంపత్‌రెడ్డి, మార్కెట్‌ కార్యదర్శి శ్రీధర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గుంటుక సోమయ్య, నాయకులు సారంగపాణి, ఈదునూరి యాకయ్య పాల్గొన్నారు.


logo