గురువారం 26 నవంబర్ 2020
Warangal-rural - Nov 08, 2020 , 02:09:04

రైతన్న సేవలో ధరణి

రైతన్న సేవలో ధరణి

దైన్యం నుంచి దర్జా వైపు నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌

వేగవంతమైన ప్రక్రియతో అన్నదాతల్లో అంతులేని ఆనందం

నాడు చిన్న సమస్య కోసం నెలల తరబడి ఎదురుచూపులు

ఇప్పుడు అధికారులే ఎదురుచూస్తున్న వైనం..

నేడు ఏకకాలంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్‌డేషన్‌

తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద తప్పిన పడిగాపులు

స్లాట్‌ బుకింగ్‌లతో సందడిగా మీసేవ కేంద్రాలు

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ధరణి పోర్టల్‌ రాకతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. అనుకున్న సమయానికి ముందే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తవుతుండడం, హక్కులకు రక్షణగా నిలువడం వారిలో ధైర్యాన్ని నింపింది. నాడు ఆదరణ లేని రైతుకు నేడు గౌరవం దక్కుతుండడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నాడు. భూముల వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతుండడంతో దర్జాగా ఆఫీసుకు వెళ్లి పనులు చేయించుకుంటున్నారు. ఇన్నాళ్ల దురవస్థకు చరమగీతం పాడి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధీమానిచ్చాడంటూ భరోసాగా ఉన్నారు. అదే సమయంలో ధరణి సేవలు ఆరంభమయ్యాక రైతన్నల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అతి తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఇన్నాళ్లు అవకాశం దొరకక, వీలుకాక, ఆఫీసుల చుట్టూ తిరిగీతిరిగి విసిగివేసారిన రైతులు మళ్లీ రిజిస్ట్రేషన్‌ కోసం తహసీల్‌ ఆఫీస్‌ల వైపు అడుగులు వేస్తున్నారు. స్లాట్‌ బుకింగ్‌, ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకునే వారు మీ సేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో ఎక్కడచూసినా మీసేవ కేంద్రాలు సందడిగా కనిపిస్తున్నాయి.

దళారుల ఆటలకు చెల్లు..

సొంత భూమిని మ్యుటేషన్‌ చేసేందుకు తిప్పించుకున్న నిబంధనల కష్టాలు తప్పాయి. భూమి రిజిస్ర్టేషన్‌ ఒకప్పుడు రోజులు, నెలలు పట్టేది. ఇప్పుడు సీన్‌ పూర్తిగా మారింది. మీ-సేవలో స్లాట్‌ బుక్‌ చేసుకుని.. అందులో వచ్చిన రోజున తహసీల్‌ ఆఫీసుకు వెళ్తే గరిష్టంగా 20 నిమిషాల్లోపే పని పూర్తవుతోంది. రిజిస్ట్రేషన్‌ కోసం గతంలో రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగి, పైసలు ఇచ్చినా పని కాని పరిస్థితులకు ధరణి ముగింపు పలికింది. ఎవరో రాసే వివరాలను తప్పని చెప్పి తిప్పించుకునే తీరుకు భిన్నంగా మీ-సేవలో రైతు చెప్పిన వివరాలే నమోదవుతాయి. వీటిని ఎవరూ మార్చే అవకాశం లేదు. మారిందనే సాకుతో పైసల కోసం పీడించే అవకాశం ఇప్పుడు లేదు. మ్యుటేషన్‌ అంటే ఏమిటో, ఎక్కడచేస్తారో సామాన్య రైతులకు అర్థంకాని పరిస్థితి. మ్యుటేషన్‌ చేయకపోతే సొంత భూమి ఏమవుతుందో, ఎవరి పేరున ఎక్కుతుందో అనే భయం ఉండేది. ఇవన్నీ దళారీ వ్యవస్థ పుట్టుకకు కారణమయ్యాయి. ఇలా మొన్నటివరకు దళారుల చెప్పుచేత ల్లో నడిచినా ఇక వారి ఆటలు సాగవు.

దస్తావేజుల దుమ్ము దులుపుతున్నరు..

ఇదివరకు రిజిస్ట్రేషన్‌ అంటే భయం. ముఖ్యంగా పేద కుటుంబాల పరిస్థితి మరీ దాకెణం. ఎక్కడెక్కడ తిరగాలో.. ఏ ఆఫీసర్‌కు, అటెండర్‌కు ఎంత లంచం ఇవ్వాలో.. ఎన్ని రోజులు అయితదో.. అసలు పని అయితదో కాదో.. ఇన్ని అనుమానాలు, గందరగోళాలతో తిరిగీతిరిగి వేసారిన వారు ఎందరో. పాలి పగో, గెట్టు పంచాయితీలతో కాదు.. రెవెన్యూ ఆఫీసర్లంటే జడుసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకోని వారూ కోకొల్లలు. ఇప్పుడు వీళ్లందరిలో ‘ధరణి’ కొత్త ఆశలు నింపింది. ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్ల జోలికి వెళ్లని వారు సైతం ఇప్పుడు అల్మారాల పెట్టిన దస్తావేజుల దుమ్ముదులుపేలా చేసింది. తహసీల్దార్‌ కార్యాలయంలోనే ఒకేసారి అన్ని పనులు అవుతున్నాయని తెలుసుకొని నాలుగైదు ఏండ్లు కాదు.. 30-40 ఏండ్ల నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోని వారు సైతం తరలి వస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచన ఫలితంగా వంశపారంపర్యంగా సంక్రమించిన భూమిని కొడుకులకు పంచేందుకు నానాపాట్లు పడ్డ వారిలో సంబురం కనిపిస్తోంది. కేవలం ఆరు గుంటల భూమిని కొడుకులకు రాసిచ్చేందుకు ముప్పై ఐదేళ్ల నుంచి ఎదురుచూసిన ఓ తల్లి రందిని ఇటీవల ధరణి తీర్చడమే దీనికి నిదర్శనం.

అన్నదాతకు అరుదైన గౌరవం..

తహసీల్దార్‌ కార్యాలయాలకు కొత్త కళ వచ్చింది. రెవెన్యూ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ముస్తాబయ్యాయి. పండుగకో, గృహ ప్రవేశానికో అలకరించినట్లు మామిడాకులు, వివిధ రకాలతో అందంగా అలకరించి రైతులకు సాదర స్వాగతం పలుకుతున్నాయి. ఇన్నాళ్లు రైతులంటే కసురుకునే ఆ చోటనే అదే రైతుకు సాదర స్వాగతం లభిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు శ్రేయస్సు కోసం ఎన్నో పథకాలతో లబ్ధిచేకూర్చడమే కాదు.. ధరణితో గౌరవాన్ని పెంచాడు. నాడు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వని పరిస్థితి నుంచి పిలిచిమరీ కుర్చీలు వేసి రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. నాడు తహసీల్దార్ల కోసం ఎదురుచూసీ చూసి రైతులు అలసిపోతే.. ఇప్పుడు అధికారులే రైతులు ఎప్పుడొస్తారని చూస్తుండడం రైతుల్లో అంతులేని ఆనందాన్నిస్తోంది.

చెట్ల కింద తప్పిన పడిగాపులు

మొన్నటివరకు రిజిస్ట్రేషన్‌ పనంటేనే ఓ ప్రహసనం. పని కావాలంటే తహసీల్‌, రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌లకు చుట్టూ రోజులు.. కాదు నెలలు కూడా పట్టేది. రిజిస్ట్రేషన్‌ ఒక చోట, మ్యుటేషన్‌ మరో చోట చేసుకోవాల్సి రావడం ఒక్కో ఆఫీస్‌ ఒక్కో చోట ఉండడం వల్ల సమయమంతా వాటి చుట్టూ తిరిగేందుకే సరిపోయేది. మారుమూల పల్లెల నుంచి వచ్చే వారి గురించి చెప్పనవసరం లేదు. పొలం పనులు వదులుకొని దరఖాస్తులు నింపేందుకు తెలిసిన వారిని తీసుకొని తహసీల్దార్‌ వద్దకు వచ్చేవారు. తహసీల్దార్‌ వచ్చేవరకు అక్కడి చెట్ల కింద కాపుకాసేవారు. సార్లు ఎప్పుడొస్తరో తెలియక ముచ్చట్లు పెట్టుకోవడమే కాదు.. ఇంకొందరు సద్దిమూటలు తెచ్చుకొని అక్కడే భోజనం కూడా చేసేవాళ్లమని ఇటీవల రిజిస్ట్రేషన్‌కు వచ్చిన రైతులు నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు.

వెలవెలబోతున్న రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌లు

ధరణి రాకతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. మొన్నటివరకు రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత మ్యుటేషన్‌ కోసం తహసీల్దార్‌ ఆఫీస్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ రెండు పనులు తహసీల్దార్‌ కార్యాలయా ల్లోనే చేస్తుండడంతో అటూఇటూ తిరిగే పని తప్పింది. ముఖ్యంగా దూర ప్రాం తాల నుంచి వచ్చే వారు పడరాని పాట్లు పడేవారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లావాసుల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. కేవలం ములుగు జిల్లాకేంద్రం లో మాత్రమే రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ ఉండడం వల్ల అటవీ ప్రాంతాలైన మహదేవపూర్‌, మహాముత్తారం, తదితర మండలవాసులైనా.. ఇటు ఏజెన్సీ ఏరియాలైన ఏటూరునాగారం, మంగపేట ప్రజలైనా ములు గుకు రావాల్సి వచ్చేది. ఇప్పుడు పోర్టల్‌ పుణ్యమా అని ఎక్కడికక్కడ మండలాల్లోనే రిజిస్ట్రేషన్లు కావడం వల్ల రైతులకు గొప్ప మేలు చేసింది.

తిప్పల్లేకుండా రిజిస్ట్రేషన్‌

కమలాపూర్‌: ఎలాంటి తిప్పల్లేకుండా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. మాది పంగిడిపల్లి గ్రామం. నేను మా ఊరిలో పది గుంటల వ్యవసాయ భూమి కొన్నా. రిజిస్ట్రేషన్‌ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నా. బ్యాంకు చలానా, రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఖర్చులు అంతా ఆన్‌లైన్‌లో కట్టిన. తహసీల్దారు ఆఫీసుకు రాగానే గంటలోనే రిజిస్ట్రేషన్‌ పూర్తి అయిందని కాగితాలు చేతిలో పెట్టారు. ఇంత తొందర పని పూర్తికావడం ఆశ్చర్యంగా ఉంది. ఇంతకుముందు 25కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమదేవరపల్లి సబ్‌ రిజిస్ట్రా ర్‌ కార్యాలయానికి వెళ్లేది. ఒక రోజు భూమి వాల్యుయేషన్‌, ఒకరోజు బ్యాం కులో చలాన కట్టడం, మరోరోజు దస్తావేజులు రాయించుకుని మీ సేవలో స్లాట్‌ బుక్‌ చేసుకునేది. ఇలా పని వదులుకుని రోజుల తరబడి తిరిగేది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి ప్రారంభించడం రైతులకు సులువుగా మారింది.

- వడ్లూరి శారద, పంగిడిపల్లి

ఇంత జల్దిన 

చేత్తరనుకోలె..

నాకు ఇద్దరు కొడుకులు. ఇదివరకు నా భూమిని వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించడానికి శాన రోజులు తిరిగిన. అప్పుడు హన్మకొండ ఆఫీస్‌కు పోయేది. నాకు తెల్వక మా వూరి పటేల్‌ను తీస్కపోయిన. ఇగ ఆఫీస్‌ల చెట్ల కింద కూసునెటోళ్లం. సార్లు ఎప్పుడు పిల్తరా అని ఎదురుచూసేది. ఒక దగ్గర కాగితం రాయిస్తే మరో కాడ పైసలు కట్టి.. అవ్వి పట్టుకొని ఆఫీసుకు పోయేటోళ్లం. ఇట్ల మూడు నాలుగు రోజులు తిరుగుడుట్ల ఇంటికాడ పనంతా పోయేది . ఇప్పుడు కేసీఆర్‌ కొత్తగ ధరణి తెచ్చిండని తెలిసి మూడో కొడుకుకు రిజిస్ట్రేషన్‌ చేపిద్దామని మళ్లచ్చిన. స్లాట్‌ బుక్‌ చేసి అన్ని కాయితాలు పట్కొని తైసిల్‌ ఆఫీస్‌కు పోయిన. అరగంటల్నే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ అయిపోయింది. ఇంత జల్దిన చేత్తరని కలలో కూడా అనుకోలె.

- ఎల్లావుల చిన్న గుమ్మయ్య, భట్టుపల్లి, కాజీపేట మండలం

పట్టా సూస్కొని 

పరేషానైన..

మాది జనగామ జిల్లా దేశాయితండా. నేను వేలేరు మండలం లోక్యాతండాల రెండున్నర ఎకరాల భూమి కొన్నా. ఆ భూమిని నా పేరు మీద ఎక్కించుకోవాల్నని ఎప్పటినుంచో అనుకుంటాన. అందుకు ఎక్కడెక్కడ తిరగాల్నో అని పరేషాన్‌ అయిన. కేసీఆర్‌ సార్‌ కొత్తగా ధరణి తెచ్చిండని తెలిసి సంబురమైంది. ఇగ అటూఇటు తిరుగుడు లేకుంట మండలంలనే చేత్తరని వాళ్లు వీళ్లు చెప్పిన్రు. ఎంబడే స్లాట్‌ బుక్‌ చేశి కాయిదాలు పట్కొని ఆఫీస్‌కు పోయిన. ఒక్కరోజులోనే నా పేరు మీద పట్టా చేసిచ్చిన్రు. అసలు ఇంత జెప్పన నా పని అయితదనుకోలె.

- భూక్యా లక్ష్మి, దేశాయితండా, చిల్పూరు మండలం

తిరుగుడు తప్పింది

మేం ఇంటిని రిజిర్ట్రేషన్‌ చేసుకుందామని మా ఊరు నుంచి 20కిలోమీటర్ల దూరంలో ఉండే భీమదేవరపల్లి రిజిస్ర్టేషన్‌ ఆఫీసుకు పోతే ఆ కాయిదాలు లేవు.. ఈ కాయిదాలు లేవని నాలుగు సార్లు తిప్పించుకుని ఐదో సారి రెండు వేలు తీసుకుని చేశిన్రు. నాకు నాలుగెకరాల ఉంటే నా ముగ్గురు కొడుకులకు సమానంగ పట్టా చేద్దమని నాలుగేండ్ల నుంచి అనుకుంటున్న. ఇల్లు కోసమే గిన్ని సార్లు తిరిగినం, ఇంక భూమికి ఎన్నిసార్లు తిరుగుడైతదోనని ఇన్నిరోజులు ఊకున్న. గిప్పుడు కేసీఆర్‌ సారు నా కొడుకులకు భూములు పంచెతందుకు అల్కగ జేసిండని తెలిసి హన్మకొండల ఉంటున్న నా కొడుకులను పిలిపించిన. గింత అల్కగ భూముల పనులు అయితయని ఎన్నడు అనుకోలె.

- హన్మకొండ రుక్మారావు, ముప్పారం, 

ధర్మసాగర్‌ మండలం

అటూఇటు 

తిప్పుకునెటోళ్లు..

ధరణితో రిజిస్ట్రేషన్లు తొందర అయితున్నయ్‌. బ్రోకర్ల బాధ పోయింది. ఇదివరకు డాక్యుమెంట్‌ రైటర్‌ దగ్గర రాయించుకొని, బ్యాంకుకు పోయి చలాన్‌ కట్టి రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చేది. నాలుగైదు రోజులు పట్టేది. ఇంకేమైనా ఇబ్బందులుంటే ఇంకింత లేటయ్యేది. అపుడు అధికారులు నోటీసులు ఇచ్చి 21 రోజుల తర్వాత మ్యుటేషన్‌ చేసేది. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు తిప్పుకునెటోళ్లు. ధరణి వచ్చినంక చిన్న చిన్న సమస్యలున్నా పనులు తొందరగ చేస్తున్నరు. కాగితాలు బరాబర్‌ ఉంటే అరగంట లోపల్నే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ రెండూ ఒకసారి చేసి డాకుమెంట్లు చేతిల వెడ్తున్నరు. - మాదాటి రాజిరెడ్డి, వంగాలపల్లి 

అరగంటలో కంప్లీట్‌ చేసిస్తున్నాం..

ఇదివరకు రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ర్టేషన్‌ చేసేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం ద్వారా తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ర్టేషన్లు చేయిస్తోంది. సర్వర్‌లో ఎలాంటి ప్రాబ్లం రావడం లేదు. అరగంటలోనే ప్రాసెస్‌ కంప్లీట్‌ అవుతోంది. రైతులు కూడా తమ సంతోషాన్ని మాతో పంచుకుంటున్నారు. వెంటనే మ్యుటేషన్‌తో పాటు పాస్‌ పుస్తకాల్లో కొన్న వారి భూమి వివరాలు నమోదు చేసిస్తున్నాం. ఎప్పటికప్పుడు ధరణి సైట్‌లో కూడా నమోదవుతుంది. రైతులు మీ సేవలోనే స్లాట్‌ బుక్‌ చేసుకొని, కేటాయించిన తేదీ, సమయానికి ఆఫీస్‌ వస్తే అరగంటలో రిజిస్ర్టేషన్‌ చేస్తాం.

- గుజ్జుల రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌, ఎల్కతుర్తి

గింత తొందర ఎప్పుడు కాలె..


ఇదివరకు రిజిష్ర్టేషన్‌ చేసుకోవాలంటే భీమదేవరపల్లికి పోయేడిది. గప్పుడు చాలన్‌ కట్టుడు ఒక రోజు, రిజిష్ర్టేషన్‌కు ఒక రోజు అయ్యేది. తర్వాత పాసుబుక్కుల్లో ఎక్కాలంటే ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చేది. అప్పుడు వీఆర్వో చూసి మ్యుటేషన్‌ చేసేది. ఇట్ల రోజులు గడిచేటియి. వన్‌బీ, పహాణీకి రావాలంటే ఇంకా లేటయ్యేది. గిప్పుడు గా బాధ లేదు. నేను మా చిన్నమ్మ దగ్గర నుంచి తమ్ముడు శ్రీనివాస్‌ దగ్గర నుంచి 21గుంటలు కొన్నా. మొత్తం అరగంటల్నే రిజిస్ర్టేషన్‌ అయింది. ఏ బాదరబందీ లేకుండా అయింది. గిట్ల చేసి సీఎం కేసీఆర్‌ మంచి పనిచేసిండు. గింత తొందర ఎప్పుడు కాలె.

- సోనబోయిన సారయ్య, 

గోపాల్‌పూర్‌, ఎల్కతుర్తి

ఒక్క రూపాయి అడగలే..

తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ర్టేషన్లు చేయడం చాలా మంచి నిర్ణయం. నేను ఈ రోజు మా నాన్న ఎర్రగోళ్ల బుచ్చయ్య నుంచి ఎకరం భూమిని గిప్ట్‌డీడ్‌ చేసుకున్నాను. ఇదివరకు కూడా మా నాన్న పేరు మీదికి సాదాబైనామా ద్వారానే భూమి రిజిస్ర్టేషన్‌ అయింది. మొన్న మీసేవ కేంద్రంలో స్లాట్‌ బుక్‌ చేశాం. ఇప్పుడు తహసీల్దార్‌ కార్యాలయానికి మా చిన్న పాపతో వచ్చాను. వచ్చిన అరగంటలోనే రిజిష్ర్టేషన్‌ పూర్తయింది. ఎవరు కూడా ఒక రూపాయి అడగలేదు. ఇదివరకు రిజిష్ర్టేషన్‌ అంటే చాలా ఇబ్బందులు ఉండేవి. వెంటనే మొబైల్‌లో చూసుకున్నా. భూమి నా పేరు మీదికి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన రెవెన్యూ చట్టం తీసుకరావడం చాలా సంతోషం.

- ఎర్రగోళ్ల స్వప్న, కేశవాపూర్‌, ఎల్కతుర్తి 

సందడిగా మీసేవ కేంద్రాలు..

ధరణి రాకతో మీసేవ కేంద్రాల్లో సందడి మొదలైంది. కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ లేకుండా ప్రభుత్వం మీసేవలోనే దరఖాస్తులు, స్లాట్‌బుకింగ్‌ సౌకర్యం కల్పించడంతో రైతులకు పని సులభమైంది. ధరణితో వెనువెంటనే పనులు పూర్తవుతుండడంతో మీసేవ వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో రైతులు సమీపంలో ఉండే మీసేవలకు ఉదయమే చేరుకుంటుండడంతో ఎక్కడచూసినా కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. నిర్ణీత ఫీజుతో చలానా కట్టి మరుసటి రోజు లేదా సూచించిన రోజున నేరుగా తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్తున్నారు. దీని వల్ల రైతులకు సమయం వృథా కాకపోగా, అధికారులకు కూడా పనిభారం తప్పుతోంది.

బిడ్డకు గిఫ్ట్‌ చేపిచ్చిన..

ఐనవోలు : మాది ఐనవోలు మండలం పంథిని దగ్గర చింతకుంట గ్రామం. నా పేరు దొంతి తిరుపతిరెడ్డి. మా గ్రామంలో నాకు 4.04 ఎకరాల భూమి ఉంది. నా బిడ్డకు గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేయిద్దామని అనుకోవట్టి నాలుగేండ్లాయె. తైసిల్‌ ఆఫీస్‌ పొంట తిరుగుడు నాతోటి కాదని ఊకున్న. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ పెట్టిన ధరణితోటి తొందర అయితున్నయని తెలిసి శుక్రవారం స్లాట్‌ బుక్‌ చేయించిన. నిన్న నా బిడ్డ, అల్లుడు, ఇద్దరు సాక్షులను తీస్కొని ఆఫీస్‌కు పోయిన. రండి.. రండి సార్‌ మీకోసమే చూస్తున్నారని పిలిచిన్రు. ఆపరేటర్‌ మా వివరాలు తీసుకునుడు, వేలిముద్ర, ఫొటోలు తీసుడు సూత్తాంటే అయిపోయింది. ఇంతల్నే బిడ్డ పేరు మీద చేయించిన పట్టాపాసుబుక్‌ కాపీ చేతిల పెట్టిన్రు. పొద్దున 11.51గంటలకు అత్తె.. 12.29కి బయటవడ్డం. 38 నిమిషాలల్ల అయిపోయింది బాపు అని నా బిడ్డ చెప్తాంటే నాకు నమ్మబుద్ధికాలె.