శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Jun 10, 2020 , 03:26:35

ఆపన్నుల కోసం రక్తదానాలు

ఆపన్నుల కోసం రక్తదానాలు

  • మెగా రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

నెక్కొండ, జూన్‌ 09: రాజకీయ ప్రయోజనాల కోసం దశాబ్దాల తరబడి నాయకులు పారించిన రక్తపుటేరులను చూసిన నర్సంపేట నియోజకవర్గం.. నేడు తెలంగాణ సమాజ హితం కోసం రక్తదానాలు చేసే దాతృత్వాన్ని చూసి మురిసిపోతున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని షాదీఖానాలో మంగళవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మొదట జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పెద్ది స్వప్న రక్తదానం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గానికి గతంలో ఉన్న పేరును తుడిచేసి చరిత్రలో నిలిచే మార్పు, చైతన్యానికి ప్రజలు కారకులయ్యారన్నారు. గవర్నర్‌, ముఖ్యమంత్రి సూచన మేరకు రాష్ట్రంలో ఎక్కడైనా, ఎవరైనా సరే.. ప్రాణాపాయ స్థితిలో ఉంటే రక్తం అందించేందుకు పదివేల యూనిట్ల రక్తం సేకరించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే రక్తదాతల వివరాలతో కూడిన జాబితాను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశామని చెప్పారు. నర్సంపేట, దుగ్గొండిలో రక్తదాన శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. నెక్కొండలో రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. పదివేల మంది రక్తదాతల గ్రూపుల వివరాలతో ఒక వెబ్‌యాప్‌ను రూపొందించి ప్రత్యేక జీవో తెచ్చుకొని ముందుకు సాగుతున్నామన్నారు. నెక్కొండ, పెద్దకోర్పోలు, అలంకానిపేట, రెడ్లవాడ, చంద్రుగొండకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి 246 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ గోపాల్‌,  ఐఎంఏ ప్రతినిధి లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, ఎంపీపీ జాటోత్‌ రమేశ్‌, జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌నబీ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, నెక్కొండ, రెడ్లవాడ, సూరిపల్లి సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్‌రావు, ఘంటా దామోదర్‌రెడ్డి, సీఐ పుప్పాల తిరుమల్‌, ఎస్సై నాగరాజు, ఎంపీడీవో శ్రీధర్‌, తహసీల్దార్‌ వెంకన్న, డిప్యూటీ డీఎంహెచ్‌వో కొమురయ్య, నెక్కొండ, అలంకానిపేట పీహెచ్‌సీ వైద్యులు రమేశ్‌, సుమంత్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రాజిరెడ్డి, సోమయ్య, ఈదునూరి యాకయ్య, ఉప సర్పంచ్‌ దేవనబోయిన వీరభద్రయ్య, సర్పంచులు మహబూబ్‌పాషా, సురేందర్‌, రావుల శ్రీలత ప్రసాద్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం మండలంలోని 25 మంది లబ్ధిదారులకు రూ. 24,52,784 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పెద్ది పంపిణీ చేశారు.