శనివారం 11 జూలై 2020
Warangal-rural - May 27, 2020 , 04:50:56

సేంద్రియ సేద్యంతో నూతన ఒరవడి

సేంద్రియ సేద్యంతో నూతన ఒరవడి

  • 18 క్వింటాళ్ల వరకు ధాన్యం దిగుబడి 
  • రూ.18 వేల పెట్టుబడితో రూ.68 వేల రాబడి 
  • ఆదర్శంగా నిలుస్తున్న రైతు 

రసాయన ఎరువుల్లేవు.. క్రిమిసంహారక మందులూ లేవు.. వరిలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ, రూ. 18 వేల పెట్టుబడితో రూ. 68 వేలు సాధించాడు ఆ రైతు. ఏటా దిగుబడి పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు చిన్నగుంటూరుపల్లికి చెందిన ముక్కు సుబ్బారెడ్డి. వ్యవసాయంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి, సుభాశ్‌ పాలేకర్‌ విధానంలో పంటలు సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. 

-ములుగు 

వరంగల్‌ చింతగట్టు వద్ద 2012లో సేంద్రియ వ్యవసాయంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు గుంటూర్‌పల్లికి చెందిన సుబ్బారెడ్డి హాజరయ్యాడు. ప్రకృతి ప్రేమికుడైన ఆయన రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకంతో జరుగుతున్న నష్టాన్ని గుర్తించాడు. మనం తినే ఆహారంలో పురుగుమందు అవశేషాలు ఉన్నాయని తెలుసుకొని ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు. ఓ దేశవాలీ ఆవును కొనుగోలు చేశాడు. 2016లో ఎకరంలో సేంద్రియ విధానంలో వరి సాగు చేసి 14 బస్తాలు పండించాడు. 2017లో 20 బస్తాలు, 2018లో 17 బస్తాలు, 2019లో 25 బస్తాల దిగుబడి వచ్చింది. 5కిలోల ఆవు పేడ, రెండు కిలోల పిండి, బెల్లం, పుట్ట మన్ను, 5లీటర్ల గో మూత్రంతో జీవామృతం తయారు చేశాడు. దానిని పంటలకు పిచికారీ చేశాడు. వరి పొట్టకు వచ్చే దశలో పుల్లటి మజ్జిగ, దోమకాటుకు వస్తే నీమాస్త్రం, పురుగు సోకితే అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం, గజకర్ని కాషాయం తయా రు చేసి, ఎకరం పొలంలో ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు లేకుండా రూ.18వేల పెట్టుబడితో 68వేల దిగుబడి సాధించాడు. ప్రస్తుతం 4ఎకరాలు పొలం, మిగతా భూమిలో పత్తి, మిర్చి పండిస్తున్నాడు. ఇతడి వ్యవసాయాన్ని ఇతర రైతులు నిశితంగా గమనిస్తున్నారు. సుబ్బారెడ్డితో రైతులకు వ్యవసాయ అధికారులు మెళకువలు నేర్పిస్తున్నారు. 


logo