ఆదివారం 07 జూన్ 2020
Warangal-rural - Mar 10, 2020 , 02:39:34

కాంతులీనిన కోటంచ

కాంతులీనిన కోటంచ

రేగొండ,మార్చి 09 : మండలంలోని కొడవటంచ గ్రామంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి జాతర సోమవారం  అత్యంత వైభవంగా ప్రారంభమైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారిని  ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అభిషేకాలు, అర్చనలు, పల్లకీసేవలు, హోమాలు, మధ్యాహ్నం పూర్ణాహుతి, హోమబలిహరణములు, రాత్రి పెద్దరథంపై స్వామి వారిని అలయ పురవీధులగుండా ఊరేగించారు. అనంతరం బోనాలు, బండ్లు, వాహనాలు తిరగడంతో జాతర ప్రారంభమైంది.  స్వామి వారిని ఊరేగిస్తున్న సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కోలాటాలు, డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, భక్తుల కరదానలతో స్వామి వారి రథయాత్ర కన్నులపండువగా సాగింది.  రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని రథాన్ని లాగారు. జాతర రాత్రి ప్రారంభమైనప్పటికీ భక్తులు మధ్యాహ్నం నుంచే తరలివచ్చారు. తెలంగాణలోని నరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన దేవాలయాల్లో కొడవటంచ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం ఒకటి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున జాతర ప్రారంభమై మూడు రోజుల పాటు అత్యంత వైభంగా ఉత్సవాలు జరుగుతాయి. ఆలయం చుట్టూ మిరుమిట్లు గొలిపే విధంగా విద్యుత్‌ దీపాలు, హైమాస్ట్‌ లైట్లతో అలంకరించారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన  భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లుపై తరలివస్తున్నారు. స్వామివారికి ఇష్టమైన  ప్రభబండ్లు, ఏనుగు, మేక ఆకారం కల్గిన బొమ్మల బండ్లు రక రకాల  రంగులతో చూడ ముచ్చటగా తయారు చేసి స్వామివారి ఆలయం చుట్టు ప్రదక్షిణలు గావించారు. ఈ ప్రభ బండ్లు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతర సందర్భంగా ఆలయ పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు అక్కడే విడిది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా భక్తులకు సేవలు అందించేందుకు ఎన్‌సీసీ, స్వచ్ఛంద సంస్థల యువకులు వలంటీర్లుగా వ్యవహరించారు. భక్తులకు ఎలాంటి అంతరాయం కలుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మిఠాయి, బొమ్మలు తదితర దుకాణాలు వెలిశాయి. దేవాలయం ప్రాంగణం అంతా భక్తులతో నిండి సందడిగా మారింది. భక్తులకు తాగునీటి వసతితో పాటు మరుగుదొడ్లు, స్నానఘట్టాలు, వైద్య, విద్యుత్‌తో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. జాతర ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్‌ ఇంగే మహేందర్‌ కార్యనిర్వాహణ అధికారి కే సులోచన, ధర్మకర్తలు గైని కుమారస్వామి, మాదాటి అనిత, కరుణాకర్‌రెడ్డి, గండి తిరుపతి, నిమ్మాని భుజంగరావు, లింగయ్య, రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీ రవీందర్‌రావు, సర్పంచ్‌ పబ్బ శ్రీనివాస్‌ అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
logo