విద్యాశాఖలో హేతుబద్ధీకరణకు నిర్ణయం
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రారంభం
వరంగల్, ఆగస్టు 19(నమస్తేతెలంగాణ): విద్యాశాఖలో రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) సందడి మొదలైంది. ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్‌తో పాటు ఇతర పాఠశాలలు మినహా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రేషనలైజేషన్‌కు కసరత్తు జరుగుతోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12న ఉత్తర్వులు ఇచ్చింది. 2015 జూలైలో హేతుబద్ధీకరణ ద్వారా పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం రేషనలైజేషన్‌కు నిర్ణయించింది. ప్రాథమిక పాఠశాలలో 19మందిలోపు విద్యార్థులుంటే ఒకరు, 20 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు, 91 నుంచి 120 ఉంటే నలుగురు, 121 నుంచి 150 మంది విద్యార్థులుంటే ఐదుగురు టీచర్ల చొప్పున ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. 151 నుంచి 200 మంది ఉంటే ఒక హెడ్మాస్టర్, ఐదుగురు టీచర్లు, 201 నుంచి 240 మంది ఉంటే హెడ్మాస్టర్ అరుగురు టీచర్లు, 241 నుంచి 280 మంది ఉంటే హెడ్మాస్టర్, ఏడుగురు టీచర్లు, 281 నుంచి 320 మంది ఉంటే హెడ్మాస్టర్, ఎనిమిది మంది టీచర్లు, 321 నుంచి 360 మంది ఉంటే హెడ్మాస్టర్, తొమ్మిది మంది టీచర్లు, 361 నుంచి 400 మంది విద్యార్థులు ఉంటే హెడ్మాస్టర్, పది మంది టీచర్లు ఉండాలని తెలిపింది.
జిల్లాలో 645 పాఠశాలలు
రేషనలైజేషన్ జరిగే ప్రభుత్వ పాఠశాలలు వరంగల్ జిల్లాలో 645 ఉన్నాయి. వీటిలో 452 ప్రాథమిక, 68 ప్రాథమికోన్నత, 125 ఉన్నత పాఠశాలలు. 77 రాష్ట్ర ప్రభుత్వం, 568 లోకల్ బాడీల పరిధిలో పనిచేస్తున్నాయి. మొత్తం 38,091 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు 16,703, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు 3,826, ఉన్నత పాఠశాలల విద్యార్థులు 17,562 మంది ఉన్నారు. పలు పాఠశాలల్లో విద్యార్థుల కంటే టీచర్లు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. 19 మంది విద్యార్థులు కూడా లేని కొన్ని పాఠశాలల్లో ముగ్గురు నుంచి ఐదుగురు వరకు టీచర్లు ఉన్నట్లు సమాచారం. విద్యార్థులు అసలే లేని ప్రాథమిక పాఠశాలలు లేకపోలేదు. ఇక్కడ టీచర్లు మాత్రం పనిచేస్తున్నట్లు విద్యాశాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఎక్కువశాతం పాఠశాలల్లో ఉండాల్సిన టీచర్ల కంటే ఎక్కువ మంది టీచర్లు ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఎక్కడ, ఏ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది టీచర్లు ఉన్నారనేది పాఠశాలల వారీగా గుర్తిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో ఏ సబ్జెక్టుకు ఎంతమంది టీచర్లు, ఎందరు విద్యార్థులు ఉన్నారు.. ఎక్కువ ఎక్కడెక్కడ ఉన్నారనే సమగ్ర సమాచారాన్ని పాఠశాలల వారీగా నమోదు చేసి జాబితాలు రూపొందిస్తున్నారు. ఇది పూర్తయ్యాక ప్రభుత్వానికి నివేదికను పంపిస్తారు. అనుమతి లభించగానే కౌన్సెలింగ్ ద్వారా టీచర్ల సర్దుబాటు జరుగనుందని తెలిసింది. రేషనలైజేషన్ కోసం ప్రస్తుతం పాఠశాలల వారీగా విద్యార్థులు, టీచర్ల సంఖ్య, వివరాలను సేకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డీ వాసంతి వెల్లడించారు. రేషనలైజేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రస్తుతం ఉపాధ్యాయుల్లో ఇదే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.