ఎంజీఎం హాస్పిటల్లో ఆక్సిజన్ హబ్
రెండు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సిద్ధం
త్వరలో అందుబాటులోకి సేవలు
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధం
వరంగల్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శాశ్వత చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తున్నది. సెకండ్ వేవ్ సమయంలో కేసుల సంఖ్య అమాంతం పెరుగడం, అదేస్థాయిలో కొవిడ్ వైద్యంలో ముఖ్యమైన ప్రాణవాయువు వినియోగించాల్సి వచ్చింది. అప్పుడు ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా ఆక్సిజన్‌ను తెప్పించి సరఫరా చేసేందుకు ప్రతినెలా రూ.10 లక్షల దాకా ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో రోగులకు ఇబ్బందుల్లేకుండా వరంగల్ ఎంజీఎం దవాఖాన ఆవరణలో సొంతంగా రెండు(పీఎంకేర్స్, ఎల్అండ్టీ) ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పగా వీటికి 1.20 లక్షల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. త్వరలో సేవలు అందుబాటులోకి రానుండగా సాధారణ వైద్య సేవలకు భరోసా కలుగనున్నది.
సర్కారు దవాఖానల్లో అన్ని రకాల వసతులు పెంచడంతో పాటు కరోనా వైద్యంలో అతి ముఖ్యమైన ఆక్సిజన్ సొంత ఉత్పత్తి కోసం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ తర్వాత పెద్ద ప్రభుత్వ దవాఖాన అయిన వరంగల్ ఎంజీఎం దవాఖానలోని ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటును వేగంగా పూర్తి చేసింది. కరోనా నేపథ్యంలో ఎంజీఎంకు రెండు ఆక్సిజన్ ప్లాంట్లు మంజూరయ్యాయి. ప్రధానమంత్రి నిధులు(పీఎం కేర్స్) నుంచి మంజూరైన ఆక్సిజన్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంజీఎం దవాఖానకు కేటాయించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద ఎల్అండ్టీ సంస్థ మరో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఎంజీఎంలో ఏర్పాటుచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా వీటిని పూర్తి చేసింది. త్వరలోనే ఈ రెండు ప్లాంట్ల సేవలు అందుబాటులోకి వచ్చేలా సిద్ధమయ్యాయి.
ప్రైవేట్‌లో నెలకు రూ.10లక్షలు ఖర్చు..
సాధారణ వైద్య సేవలతో పాటు కరోనా బాధితులకు ప్రధానంగా అవసరమయ్యే ఆక్సిజన్ సరఫరా పూర్తిగా ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతిలో ఉండడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు కావడంతో వ్యాపార దృక్పథంతోనే ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. ఎంజీఎంలో రెండు ఆక్సిజన్ ట్యాంకులు ఉన్నాయి. వీటి సామర్థ్యం 10వేల లీటర్లు, 13వేల లీటర్ల చొప్పున ఉంది. ప్రైవేట్ కాంట్రాక్టర్లు సరఫరా చేసిన ఆక్సిజన్‌ను వీటిలో నింపి రోగులకు సేవలు అందిస్తున్నారు. రెండో విడుత కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ఆక్సిజన్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రతి రోజూ 4500 లీటర్ల డిమాండ్ ఉండేది. దీంతో ఆక్సిజన్ కోసం ప్రభుత్వం ప్రతి రోజూ లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. కరోనాతో పాటు సాధారణ వైద్య సేవల కోసం అందించే ఆక్సిజన్ కోసం ప్రతి నెలా సగటున రూ.10 లక్షలు చెల్లించాల్సి వచ్చేది.
సర్కారు చొరవతో సొంతంగా ప్లాంట్లు
ఆక్సిజన్ సరఫరా విషయంలో శాశ్వత చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈమేరకు సొంతంగా ప్లాంట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఎంజీఎంలో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసింది. పీఎం కేర్స్ నుంచి రూ.70 లక్షలతో మన రాష్ర్టానికి ఆక్సిజన్ యూనిట్ మంజూరైంది. ఈ ప్లాంట్‌ను ఎంజీఎంలో నెలకొల్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కరోనా బాధితుల చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంజీఎం దవాఖానలో 800 పడకలతో వైద్య సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ర్టానికి వచ్చిన ఆక్సిజన్ ప్లాంట్‌ను రాష్ట్ర సర్కారు ఎంజీఎంకు మంజూరు చేసింది. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ(సీఎస్ఆర్) కింద ఎల్అండ్టీ సంస్థ మరో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఎంజీఎంలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. వైద్య శాఖ అధికారులు వెంటనే స్పందించి రెండు ప్లాంట్లను ఎంజీఎంలో నెలకొల్పేందుకు చర్యలు చేపట్టారు. మూడు నెలల్లోనే వీటి నిర్మాణం పూర్తి చేశారు. సేవలు అందించేందుకు రెండు ప్లాంట్లు సిద్ధమయ్యాయి. గంటకు 60వేల లీటర్ల చొప్పున రెండు ప్లాంట్ల నుంచి 1.20 లక్షల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. రెండు యూనిట్లు పనిచేయడం మొదలైతే ఎంజీఎంలోని అన్ని బెడ్లకు పూర్తిస్థాయిలో ఆక్సిజన్ సరఫరా చేసే అవకాశం ఉంటుంది. రెండు ప్లాంట్ల ఆక్సిజన్‌తో ఎంజీఎంతో పాటు నగరంలోని సీకేఎం, జీఎంహెచ్, సూపర్ స్పెషాలిటీ, టీబీ హాస్పిటల్లో అవసరమైన మేరకు ఆక్సిజన్ సరఫరా కానుంది. ప్రైవేట్ కాంట్రాక్టర్లపై ఆధారపడి పేదలకు ఆక్సిజన్ అందించే ఇప్పటి పరిస్థితి పూర్తిగా మారనుంది.
వైద్య సేవలపై భరోసా..
ప్రస్తుతం ట్యాంకుల్లో నిల్వచేసి పైపులైనుతో ఆయా విభాగాలకు ఆక్సిజన్ సరఫరా చేసే వ్యవస్థ ఉంది. ఉత్పత్తి చేసే వ్యవస్థ లేదు. సొంతంగా ఉత్పత్తి చేసేలా ప్లాంట్లు ఉండడంతో ఇప్పుడు ఎంజీఎంలోని వైద్య సేవలపై భరోసా పెరుగుతోంది. ప్రస్తుతం నిల్వ ప్లాంట్ ఉన్న స్థలంలోనే అధునాతన టెక్నాలజీ వినియోగించి నిమిషానికి వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను నిర్మించారు. కొత్త టెక్నాలజీతో నిర్మించిన ప్లాంట్లు కావడంతో ఎక్కువ పీడనంతో ఆక్సిజన్ సరఫరా చేసేందుకు వీలుంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి, అధిక ఒత్తిడితో వేగంగా సరఫరా చేసేలా ఈ ప్లాంట్లను నిర్మించారు. కరోనా వంటి పరిస్థితుల్లో ఎక్కువ మందికి మెరుగైన వైద్య సేవలు అదించేందుకు ఇవి బాగా ఉపయోగపడుతాయి. ఆక్సిజన్ ట్యాంకులకు తోడు హైఫ్లో నాజిల్ వ్యవస్థతో ఉండే వంద వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో ఎంజీఎంలోని కరోనా విభాగంతో పాటు అన్ని ఆపరేషన్ థియేటర్లకు నాణ్యమైన, ఎక్కువ పీడనంతో ఆక్సిజన్ సరఫరా జరుగనుంది. ఎంజీఎంలో రెండు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణం పూర్తవ్వడంతో వీటి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టీఎస్ఎంఐడీసీ చర్యలు చేపట్టింది. ప్లాంట్లకు అవసరమైన విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేస్తున్నారు. సరఫరాలో ఇబ్బందులు తలెత్తినప్పుడు అంతరాయం లేకుండా ప్రత్యేకంగా జనరేటర్లను అందుబాటులో ఉంచారు. ఆటోమెటిక్ కంట్రోలింగ్ విధానాన్ని అనుసంధానించి పైప్‌లైన్ ద్వారా అన్ని విభాగాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్ని హాస్పిటళ్లకు సరిపోతుంది..
ఎంజీఎంలో చేపట్టిన రెండు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయ్యింది. కరంటు సరఫరా పనులు చివరిదశలో ఉన్నాయి. త్వరలోనే రెండు ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తి మొదలవుతుంది. ఇప్పటి పరిస్థితి పూర్తిగా మారుతుంది. రెండు ప్లాంట్లలో ఉత్పత్తి మొదలైతే ఎంజీఎంతో పాటు వరంగల్ నగరంలో ఉన్న సీకేఎం, టీబీ, జీఎం హాస్పిటళ్లకు.. కేఎంసీలో కొత్తగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవసరాలకు సరిపోతుంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పేదల వైద్యానికి భరోసా కలుగుతోంది. ప్రైవేటు వారికి చెల్లించే సొమ్ము ఆదా అవుతుంది.