మ్మం, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ రెండో రోజైన శనివారమూ కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండోరోజు 14 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగెస్ పార్టీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు 2వ సెట్ దాఖలు చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొంకిమల్ల సాయికుమార్ 2వ సెట్‌ను దాఖలు చేశారు. పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బైరవబట్ల శ్రీనివాసరావు, షేక్ సిరాజుద్దీన్‌లు నామినేషన్లు వేశారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారత్ పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా కల్యాణ్‌కుమార్, స్వతంత్య్ర అభ్యర్థిగా బొమ్మెర రామ్మూర్తి నామినేషన్ దాఖలు చేశారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో ఆధార్ పార్టీ నుంచి ఆంబోజు సుమలత, భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరపున ఎర్ర కామేశ్, ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కోరం కనకయ్య, ఇండిపెండెంట్ అభ్యర్థిగా భుక్యా మంగీలాల్, పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పాండ్రు హేమసుందర్, అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మెచ్చా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. మొదటి రోజు 8, రెండో 14 నామినేషన్లు దాఖలు కావడంతో మొత్తం నామపత్రాల సంఖ్య 24కు చేరింది. నామినేషన్లను ఈ నెల 10 వరకు ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు సంబంధించి అభ్యర్థులకు కావాల్సిన సమాచారాన్ని అందించేందుకు ఆయా కార్యాలయాల్లో హెల్ప్‌డెస్కులను ఏర్పాటు చేశారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు మంచి ముహూర్తం కోసం అన్వేషిస్తున్నారు. తమ పేరు బలం, సెంటిమెంటు అంశాలను పరిగణనలోకి తీసుకొని నామినేషన్ దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.