జనగామ, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : పరస్పర పొదుపుతో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు మహిళలంతా ఒక్కటయ్యారు.. రుద్రమదేవి మహిళా మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిడెట్ను ఏర్పాటు చేసుకున్నారు.. వారే ఉద్యోగులుగా.. మేనేజింగ్ కమిటీగా ఏర్పడి ఏటా రూ. కోట్ల టర్నోవర్‌ను సాధించి తెలంగాణలోనే ఏకైక మహిళా మ్యాక్స్‌గా పేరు గడించారు.. ఇంత ఖ్యాతి సాధించిన సొసైటీలో భారీ ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా గ్రామీణ ప్రాంత సభ్యులంతా కలిసి కూడబెట్టుకున్న డబ్బులపై కన్నేసిన పాలక మండలి బాధ్యులు కార్యాలయ సిబ్బందితో కుమ్మక్కై రూ. కోట్లల్లో కొల్లగొట్టారు.
మహిళలు నెలనెలా పొదుపు చేసుకున్న దాదాపు రూ.12 కోట్లను తప్పుడు రికార్డులు సృష్టించి గుట్టుచప్పుడు కాకుండా 22 మంది సొసైటీ నిర్వాహకులే స్థాయిని బట్టి వాటాల వారీగా పంచుకుతిన్నారు. జనరల్ బాడీ ఆమోదం లేకుండా, సహకార నిబంధనలు పక్కనబెట్టి నేరుగా కోట్ల నిధులు డ్రాచేయడమే కాకుండా, రికార్డులను తారుమారు చేసి అక్రమాలకు తెరలేపారు. ఈ వ్యవహారంలో మ్యాక్స్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ చిర్ర సుగుణమ్మ, చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈవో) పీ కవిత, సొసైటీ అధ్యక్షురాలు బండి విజయలక్ష్మి, కార్యదర్శి గడ్డం విజయలక్ష్మి, మాజీ కార్యదర్శి ఎం పద్మ, మాజీ బ్రాంచ్ మేనేజర్ దేవర సుజాత, క్లర్క్‌లు గుండెల్లి శ్రీనివాస్, సుంకరి దేవేందర్, సలహాదారు తల్క లక్ష్మణ్ సహా ఇందులో ప్రమేయం ఉన్న మొత్తం 22 మంది ప్రస్తుత, మాజీ డైరెక్టర్లు, కార్యాలయ సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార అధికారి, జిల్లా రిజిస్ట్రార్ కే కోదండరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం జనగామ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రూ.7.09 కోట్ల నిధులు చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేసినట్లు వరంగల్ కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్ ప్రాథమిక విచారణలో తేల్చినప్పటికీ తీగలాగితే డొంక కదిలినట్లు ప్రతి లావాదేవీలోనూ బాధ్యులు దాదాపు రూ. 12 కోట్లకు పైగానే ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు సహకార అధికారులు అనుమానిస్తున్నారు.
2018-2020 మధ్య రుద్రమదేవి మహిళా మాక్స్ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీ, ఉద్యోగులు జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో 38.21 ఎకరాల భూమిని చట్ట విరుద్ధంగా కొనుగోలు చేసి సొసైటీ నిధులను భారీగా దుర్వినియోగం చేసినట్లు సహకార ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొంది. జనరల్ బాడీ ఆమోదం, భూ యాజమాన్య నిర్ధారణ లేకుండానే భూమి కొనుగోలు చేయడంతోపాటు మధ్యవర్తులకు కమీషన్ పేరిట రూ.1.42 కోట్లు సొసైటీ నుంచి చెల్లించగా, అందులో రూ.90 లక్షలు నగదు రూపంలో చెల్లించడాన్ని సహకార ట్రిబ్యునల్ కోర్టు తప్పు పట్టింది. రికార్డులు తారుమారు చేయడంతో పాటు తప్పుడు నగదు పుస్త్తకాలు రూపొదించి, అన్ని స్థాయిల్లో సంతకాలను ఫోర్జరీ చేసి నిధులు దారి మళ్లించినట్లు తేల్చింది.