స్టేషన్ ఘన్పూర్, మే 25 : 1121 కామన్ రకం సీడ్ వడ్లను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీసుకోవడం లేదు. అన్ని రకాల ధాన్యాన్ని కొంటామని చెప్పిన ప్రభుత్వ హామీ బుట్టదాఖలైందని మహిళా రైతు వాపోయింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పాంనూర్ గ్రామానికి చెందిన బాషబోయిన అరుణకు భర్త లేకపోవడంతో తనకున్న ఎకరంన్నర పొలంతో పాటు రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నది. రెండెకరాల్లో 1121 కామన్ రకం సీడ్ వడ్లను పండించగా, సుమారు 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది.
నాలుగు రోజుల క్రితం పాంనూర్ గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చింది. సెంటర్ నిర్వాహకులు ఆ వడ్లను రైస్‌మిల్లర్ల వద్దకు తీసుకుపోగా వీటిని తీసుకుంటలేమని చెప్పి తిప్పి పంపించారు. కొనుగోలు కేంద్రంలో తీసుకోపోతే దళారులకు అమ్ముకోవాలా?, తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలి?, నా పిల్లలను ఎలా చదివించు కోవాలని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ప్రభుత్వం తన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆమె కోరుతున్నది.