రాయపర్తి, సెప్టెంబర్ 6 : నాలుగు దశాబ్దాలుగా రాయపర్తి మండల సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును తాము ఏనాడూ వీడేది లేదని మండలంలోని జేతురాం తండా గ్రామ పంచాయతీ పరిధిలోని జేతురామ్ తండా, రావుల తండా, విద్యానగర్ తండాల గ్రామస్తులు స్పష్టం చేశారు. బుధవారం జిల్లాలోని సంగెం మండలం కాపులకనపర్తి పర్యటనలో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్‌రెడ్డి, రైతు బంధు మండల కోఆర్డినేటర్ సురేందర్‌రావు నేతృత్వంలో సుమారు 100 గిరిజన కుటుంబాలు కలిసి సామూహికంగా మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండల ప్రజలందరి సంక్షేమం కోసం నిర్విరామంగా పని చేస్తున్నారన్నారు. ఎన్నికల కోసమే నాయకులుగా ప్రజాక్షేత్రంలోకి వచ్చేవారు ఓట్ల సీజన్ ముగియగానే అడ్రస్ లేకుండా పోతున్నట్లు వాపోయారు. రాయపర్తి మండల ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వీడమని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో దయాకర్‌రావును అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ రాయపర్తి మండలం తన స్వస్థలం కంటే ఎక్కువే అని అన్నారు. మండల ప్రజలందరినీ తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ నేతావత్ కిషన్ నాయక్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రవినాయక్, ఉపసర్పంచ్ అనిల్, నాయకులు బోజ్యా నాయక్, రమేశ్, రవి, పూర్ణచందర్, బాలు, భద్రు, మురళీ పాల్గొన్నారు.