చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలతో డీసీపీ వెంకటలక్ష్మి
హన్మకొండ సిటీ, జూలై 2: వెట్టిచాకిరీ నుంచి చిన్నారులకు విముక్తి కలిగించేందుకు ఈ నెల 7 నుంచి ప్రారంభించనున్న ‘ఆపరేషన్ ముస్కాన్’ను విజయవంతం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఇన్చార్జి అడ్మిన్ డీసీపీ, ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మి అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి ఆదేశాలతో ఆమె శుక్రవారం వరంగల్ అర్బన్, రూరల్, జనగామ జిల్లాలకు చెందిన చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ ప్రొటెక్షన్, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. తప్పిపోయిన, వదిలేయబడిన, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న, బాలకార్మికులుగా పని చేస్తున్న 18 సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించడం, లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. బాలకార్మికులను గుర్తిస్తే పోలీస్ వాట్సాప్ (9491089257) నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ ప్రతాప్‌కుమార్, ఇన్స్పెక్టర్ సుజాత, మూడు జిల్లాల చైల్డ్ వెల్ఫేర్ చైర్మన్లు అనిల్ చందర్రావు, వసుధ, ఉప్పలయ్య, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ ప్రసాద్, చైల్డ్ డెవలప్మెంట్ అధికారులు సంతోష్, మహేందర్‌రెడ్డి, రవికాంత్, సతీశ్‌కుమార్, చైల్డ్‌లైన్ అధికారులు కృష్ణమూర్తి, వీరబాబు, పాషా, జోన్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు పాల్గొన్నారు.