శాయంపేట, అక్టోబర్ 11 : తెలంగాణ ప్రభుత్వం ఒక యజ్ఞంలా చేపట్టిన హరితహారం సత్ఫలితాలు ఇస్తున్నది. ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏటేటా విడుతల వారీగా నాటిన మొక్కలు పెరిగిపెద్దవై చల్లటి నీడతోపాటు స్వచ్ఛమైన గాలినిస్తున్నాయి. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం హరితహారం మొక్కలతో పచ్చదనం పరుచుకున్నది. హరితహారంలో భాగంగా 2016 నుంచి ఏటేటా దవాఖాన ఆవరణలో నాటిన సుమారు 500పైగా పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలు పెరిగి పెద్దవయ్యాయి. జామ, అల్లనేరడు, కొబ్బరి, వేప చెట్లు చికిత్సకోసం వచ్చే రోగులకు స్వచ్ఛమైన గాలి, నీడతోపాటు ఫలాలను అందిస్తున్నాయి. దవాఖానకు వెళ్లే దారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు రోగులకు స్వాగతం పలుకుతున్నాయి. 2016లో అప్పటి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి దవాఖాన ఆవరణలో అల్లనేరడు మొకను నాటారు. అది ఇప్పుడు పెద్దచెట్టుగా మారి ఫలాలు అందిస్తున్నది. దవాఖాన ఆవరణలో నాటిన 80శాతం మొక్కలు పెరిగి పెద్దగామారి వనాన్ని తలపిస్తున్నది.