దుగ్గొండి, అక్టోబర్24: ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో నిర్మితమై.. తెలంగాణకు ఆధ్యాత్మిక అస్తిత్వ ప్రతీకగా నిలిచిన యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించే బృహత్కార్యంలో ఆ గ్రామస్తు లు ‘మేముసైతం’ అంటూ పాలుపంచుకున్నారు. ‘యాదాద్రి నిర్మాణం మన కళ్ల ముందే జరుగడం ఈ తరం చేసుకున్న మహద్భాగ్యమనే అభిప్రాయం తెలంగాణ బిడ్డల్లో కనిపిస్తున్నది. ఇందులో ఉడుతా భక్తిగా తమకూ కొంత భాగస్వామ్యం లభించాలనే భావన బలంగా ఉన్నది. అందుకే ఆలయ శిఖరానికి బంగారు తాపడం కోసం ఎవరికి తోచినంత, చేతనైనంత వారు ధన రూపంలో కూడా సమర్పించుకోవచ్చు” అని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు కదిలివచ్చారు. దుగొండి మండలం నాచినపల్లిలో సర్పంచ్ పెండ్యాల మమతారాజు ఆధ్వర్యంలో ఆదివారం నుంచి విరాళాల సేకరణ చేపట్టగా తొలిరోజు గ్రామస్తులు రూ.15 వేలు సమకూర్చి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు.
చిన్నాపెద్దా భాగస్వామ్యం
ఉదయం నుంచి సర్పంచ్ దంపతులు, జీపీపాలకవర్గం, సిబ్బంది, మహిళలు, చిన్నారులు కలిసి గ్రామంలో కలియదిరిగారు. యాదాద్రి ఆలయ విమాన గోపురం కోసం గ్రామస్తుల తమవంతుగా సాయం అందించి భక్తిభావాన్ని చాటకున్నారు. తొలిరోజు పలువురు దాతలు రూ.10వేలు ఇవ్వగా దేవుడి కోసం చిన్నారులు తమ కిడ్డీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును సైతం విరాళంగా ఇచ్చారు. పంచాయతీ పారిశుధ్య కార్మికులు తమ వంతుగా రూ.వెయ్యి అందజేశారు. వర్తకవ్యాపారులు, కిరాణా వ్యాపారులు, మహిళా సంఘాల సభ్యులు తలోచేయి వేశారు.
ప్రజా భాగస్వామ్యం సంతోషంగా ఉంది
యాదాద్రి ఆలయ నిర్మాణంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నాచినపల్లి గ్రామస్తులు భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉంది. వరంగల్ జిల్లాలోనే మొదటగా నాచినపల్లిలో విరాళాలు సేకరించడం ఆనందంగా ఉంది.
నావంతుగా రూ.5వేలు
సీఎం కేసీఆర్ పిలుపుతో నేను కూడా ఆలయానికి నావంతుగా సా యం చేయాలని రూ.5వేల విరాళం ఇచ్చాను. ఈ పుణ్యకార్యంలో భాగస్వామిని అయ్యేందుకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు, నమస్తే తెలంగాణ దినపత్రికకు కృతజ్ఞతలు.
-పెండ్యాల రాజు, నాచినపల్లి
పూర్వ జన్మ సుకృతం
యాదాద్రి ఆలయానికి విరాళం ఇవ్వడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. నావంతుగా రూ. 2వేలు ఇవ్వడం ఆనందంగా ఉంది. ప్రజలంతా ఈ బృహత్కార్యంలో పాలుపంచుకుని దేవుడి కృపకు పాత్రులు కావాలి.