లింగాలఘనపురం, ఆగస్టు 9 : బోడ కాకర కాయలు అంటే అటవీప్రాంతాలు, పొలం గట్ల వెంట, పుట్టల వెంట పొదల్లోనే లభిస్తాయని అందరికీ తెలుసు. పోషక విలువలతో పాటు రుచి కూడా బాగుండే వీటిని ప్రజలు ఇష్టంగా తింటారు. ఈ క్రమంలో కొందరు రైతులు కష్టమైనా బోడ కాకర పంట పండిస్తూ లాభాలు గడిస్తున్నారు.
జనగామ జిల్లాలో కొందరు రైతులు పంటల సాగులో వినూత్నంగా ముందుకు పోతున్నారు. చెట్లు, గుట్టల వెంటే సీజన్లోనే లభ్యమయ్యే బోడకాకరను చేన్లలో పందిరి సాగు ద్వారా పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. పోషక విలువలు అధికంగా ఉన్న బోడకాకరకు డిమాండ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో సాగువైపు దృష్టిసారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి సాధిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. లింగాలఘనపురం మండలం జీడికల్కు చెందిన మైలారం వెంకన్న నాలుగేళ్ల క్రితం బోడ కాకర సాగుకు శ్రీకారం చుట్టాడు. చెట్ల వెంట.. గుట్టల వెంట తిరిగి బోడకాకర మొక్కలు సేకరించి పది గుంటల భూమిలో సాగుచేస్తున్నాడు. శ్రమనే పెట్టుబడిగా పెట్టి ఏటా రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నాడు. ప్రస్తుతం బోడకాకర కాయలు కిలోకు రూ.170 నుంచి రూ.200 దాకా ధర పలుకుతుండడంతో పలువురు రైతులు సైతం ఈ పంట సాగుకు ముందుకొస్తున్నారు.
బూమ్ స్ప్రేయర్
స్వాల్, యూపీఎల్ కంపెనీలు సంయుక్తంగా బూమ్ స్ప్రేయర్ యంత్రాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చాయి. రూ.8లక్షల విలువైన ఈ యంత్రాన్ని కంపెనీవారు సామాజిక బాధ్యతగా తక్కువ ధరకు అద్దెకు ఇస్తున్నారు. అన్ని మెట్ట పంటల్లో ఈ యంత్రం ద్వారా పురుగు మందులు పిచికారీ చేసుకోవచ్చని, మొక్కకు ఎలాంటి నష్టం వాటిల్లదని, మిర్చి , పత్తి పంటలకు ఇది అనువుగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ యంత్రం 600 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎకరాకు రూ.160 మాత్రమే తీసుకుని స్ప్రే చేస్తున్నారు. nurture.form యాప్ను డౌన్లోడ్ చేసుకుని యంత్రాన్ని బుక్ చేసుకోవాలి. రెండు రోజుల ముందు బుక్ చేసుకుంటే ఎకరానికి రూ.100, అత్యవసరంగా బుక్ చేసుకుంటే రూ.160 చార్జ్ చేస్తారు. కంపెనీ వారు మరో ఆఫర్ కూడా ఇచ్చారు. యంత్రాన్ని యాప్ ద్వారా బుక్ చేసుకుని కంపెనీ వారి పురుగు మందుల ప్రోడక్ట్ కొనుగోలు చేస్తే ఒక కార్డు ఇస్తారు. దాన్ని స్క్రాచ్ చేయగా వచ్చే పాయింట్స్ ఆధారంగా చెల్లింపు చేస్తే చార్జీలు తగ్గుతాయి.
లాభాలు బాగున్నయ్
బోడకాకర కాయలు చెట్ల వెంట గుట్టల వెంట కాస్తయ్.. సీజన్లో చాలామంది వాటిని సేకరించి అమ్ము కుంటరు. రుచి బాగుంటుందని చాలా మంది కొంటరు. ధర కూడా ఎక్కువ ఉంటది. పావులకిలో రూ.30 నుంచి రూ.50కి అమ్ముతరు. అందుకే బోడకాకర సాగుచేయాలన్న ఆలోచన వచ్చింది. నేనే స్వయంగా చెట్లు, పుట్టల వెంట తిరిగి మొక్కలు సేకరించి నాలుగేళ్ల నుంచి సాగు చేస్తున్న.. పెట్టుబడి తక్కువే అయినా శ్రమ ఎక్కువ ఉంటది. ఏటా రూ.లక్షదాకా ఆదాయం వస్తున్నది. బోడకాకర సాగుచేస్తే లాభాలు మంచిగుంటయ్.
-మైలారం వెంకన్న, జీడికల్
రైతులు ముందుకురావాలి
తీగజాతి కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. జీడికల్ రైతు వెంకన్నకు కూడా పందిరి ఖర్చులు ప్రభుత్వ మే సబ్సిడీపై అందించింది. రైతులు ఇలాంటి పంటల సాగు కోసం ముందుకు వస్తే ప్ర భుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుంది.