రాయపర్తి, ఆగస్టు 24: వ్యవసాయ రంగంలో వివిధ పంటలు సాగు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు సిరులు కురిపించే పంటగా ప్రస్తుతం ఆయిల్‌పామ్ అందుబాటులోకి వచ్చిందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు అధ్యక్షతన ఆయిల్‌పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ నూనెల వినియోగం పెరిగిపోతున్నందున భవిష్యత్‌లో ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులు అధిక లాభాలు గడించే అవకాశం ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోకుండా, కోతులు ఆశించని ఆయిల్‌పామ్ పంటసాగు చేసుకునేందుకు ప్రభుత్వం అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు. ఇసుక, ఎర్ర, మెట్ట నేలల్లోనూ ఆయిల్‌పామ్ సాగు చేసుకోవచ్చని వివరించారు. ఆయిల్‌పామ్ సాగుకు పెట్టుబడి కూడా తక్కువగానే ఉంటుందన్నారు. ఆరుతడి పంటగా పేరున్న ఆయిల్‌పామ్ సాగువైపు మండలంలోని అన్ని గ్రామాల రైతులు దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సదస్సులో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఏవో గుమ్మడి వీరభధ్రం, ఎంపీటీసీ అయిత రాంచందర్, ఏఈవోలు వేమిరెడ్డి హిమబిందు, ఉడుత సాయిప్రసాద్, కడుదూరి రాజేశ్‌కుమార్, వల్లెరావు మనస్విని, రాజారపు శిరీష, మండలంలోని 39 గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్లు, అన్నదాతలు పాల్గొన్నారు.
ఉత్తమ అవార్డు గ్రహీతలకు సత్కారం
ఉత్తమ అవార్డులు పొందిన తాసిల్దార్ కుసుమ సత్యనారాయణ, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్యను రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి, మెమొంటోలు అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, ఏవో గుమ్మడి వీరభధ్రం, ఏఈవోలు, ఎంపీటీసీలు అయిత రాంచందర్, రైతులు పాల్గొన్నారు.
పాఠశాలల పునఃప్రారంభంపై మంత్రుల వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి పునఃప్రారంభం కానున్న పాఠశాలలు, పల్లెప్రగతి పనులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పాఠశాలలను శుభ్రం చేసి, తరగతుల నిర్వహణలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి సూచించారు.
పల్లెప్రగతి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, నర్సంపేట మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, ఎంపీడీవో సుమనావాణి, ఎంఈవో రత్నమాల, మిషన్ భగీరథ ఏఈ సతీశ్, ఏపీవో సునీత, ఎంపీవో కైసర్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మంగీలాల్, ఏఈ మౌనిక పాల్గొన్నారు.