వరంగల్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కొద్ది నెలల క్రితం టెలీ మెడిసిన్ సెంటర్లు నిర్వహించింది. ఆయా జిల్లాల్లో కరోనా లక్షణాలతో బాధపడుతున్న ప్రజలు ఈ సెంటర్లలోని వైద్యుల నుంచి ఫోన్ ద్వారా సేవలు పొందారు. ప్రస్తుతం వీడియో కాల్ ద్వారా ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. పీహెచ్‌సీల ద్వారా ఈ టెలీ మెడిసిన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం తాజా గా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. సాధారణ జబ్బులతో పాటు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి పీహెచ్సీ వైద్యుడి పర్యవేక్షణలో వీడియో కాల్ ద్వారా సంబంధిత ప్రత్యేక వైద్య నిపుణులతో మాట్లాడించి వైద్యం అందించాలని స్పష్టం చేసింది.
ఎంజీఎం కేంద్రంగా..
ప్రభుత్వ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలో టెలీ మెడిసిన్ సేవలను అమల్లోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇటీవల జరిగిన జిల్లాల మార్పుతో వరంగల్ జిల్లా పరిధిలో 14 పీహెచ్‌సీలు, ఏడు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు(యూపీహెచ్సీ) ఉన్నాయి. పైడిపల్లి పీహెచ్సీ చేరికతో ఇక్కడ పీహెచ్‌సీల సంఖ్య 14కి చేరింది. యూపీహెచ్‌సీల్లో వరంగల్ నగరంలోని దేశాయిపేట, కీర్తినగర్, కాశీబుగ్గ, చింతల్, ఆర్ఆర్తోట, రంగశాయిపేటతో పాటు మరొకటి ఉంది. గతంలో వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని 17 పీహెచ్‌సీల్లో నాలుగింటితో పాటు పరకాల సీహెచ్‌సీ ప్రస్తుతం హనుమకొండ జిల్లా పరిధిలోకి వెళ్లింది. గతంలో వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో ఉన్న యూపీహెచ్‌సీల్లో ఏడింటితో పాటు వరంగల్ ఎంజీఎం, రీజినల్ ఐ హాస్పిటల్, సీకేఎం దవాఖాన వంటివి వరంగల్ జిల్లా పరిధిలోకి వచ్చాయి. దీంతో ఎంజీఎం దవాఖాన కేంద్రంగా జిల్లాలో టెలీ మెడిసిన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్లాన్చేశారు. పని దినాల్లో ప్రత్యేక వైద్య నిపుణులు ఓపీ విధులు నిర్వర్తిస్తారు. ఈ క్రమంలో ప్రత్యేక సేవల కోసం తమ వద్దకు వచ్చిన ప్రజలతో పీహెచ్‌సీల వైద్యులు వీడియోకాల్ ద్వారా ఎంజీఎం దవాఖాన ప్రత్యేక వైద్య నిపుణులతో మాట్లాడిస్తారు. బాధితులకు వైద్య సలహాలు, సూచనలు చేస్తారు. వారు సూచించిన మందులను పీహెచ్‌సీల వైద్యులు రాసిస్తారు.
ప్రజలకు ప్రయోజనం..
సాధారణ జబ్బులతో బాధపడుతున్న ప్రజలకు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో వైద్యసేవలు లభిస్తున్నాయి. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు, నరాలు, కంటి, దంత, ముక్కు, చెవి తదితర వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు వరంగల్, హైదరాబాద్ వంటి నగరాల బాటపట్టాల్సిన పరిస్థితి. దీంతో ప్రజలపై రవాణా చార్జీల భారంతో సమయం వృథా అవుతుంది.
ఈ నేపథ్యంలో ప్రత్యేక వైద్య నిపుణుల వైద్య సేవలు అందుబాటులోకి వస్తే ప్రజలు నగరాలకు పరుగు పెట్టాల్సి రాదు. అందుబాటులో ఉన్న పీహెచ్‌సీకి వెళ్తే వీడియోకాల్ ద్వారా ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను పొందవచ్చు. ప్రభుత్వం ఇలాంటి సేవలను ప్రవేశపెడుతుండటం ఇదే ప్రథమం. కాగా, టెలీ మెడిసిన్ సేవల అమలుపై ఇప్పటికే కలెక్టర్ ఎం హరిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చల్లా మధుసూదన్‌తో చర్చించారు.
త్వరలో ప్రారంభిస్తాం..
టెలీ మెడిసిన్ సేవలను జిల్లాలో సాధ్యమైనంత త్వరలో ప్రారంభిస్తాం. పీహెచ్‌సీల నుంచి వీడియోకాల్ ద్వారా ఎంజీఎం దవాఖానలోని ప్రత్యేక వైద్య నిపుణులతో ప్రజలకు వైద్య సేవలందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 లేదా 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఎంజీఎం దవాఖానలో ఓపీ విధులు నిర్వర్తించే ప్రత్యేక వైద్య నిపుణులు పాల్గొంటారు. టెలీ మెడిసిన్ సేవల వేళలు, ప్రారంభంపై నేడో రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. – చల్లా మధుసూదన్, డీఎంహెచ్‌వో, వరంగల్