ఆత్మకూరు, ఆగస్టు 17: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి సాధిస్తాయని ఎంపీపీ మార్క సుమలత అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా పీహెచ్సీ వైద్యాధికారి రణధీర్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే సబ్ సెంటర్లకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వారానికి ఐదు రోజులు టీకాలు వేస్తున్నట్లు వెల్లడించారు. అంగన్వాడీ సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని వినియోగించుకోవాలని కోరారు. మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ అంకూస్ మాట్లాడుతూ ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రాలకు టీచర్లు సరిగా రావడం లేదని ఆరోపించారు. కేంద్రాలపై పర్యవేక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఏఈ రవికుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో కరంటు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. మల్కపేట సర్పంచ్ మాడిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ గ్రామంలో నిర్మించిన శ్మశాన వాటిక, పల్లెప్రకృతి వనానికి కరంటు మీటర్లను ఏర్పాటు చేసేలా కృషి చేయాలని ఎంపీడీవో నర్మద దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎంపీడీవో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి
గ్రామాల్లో 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ మీసేవ కేంద్రాల్లో ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సూచించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని గ్రామాల్లో టీఆర్ఎస్ సర్కారు చేస్తున్నదని తెలిపారు. మండలసభలో వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు అర్షం వరుణ్‌గాంధీ, బొమ్మగాని భాగ్య, బయ్య రమ, మండల కోఆప్షన్ మెంబర్ ఎండీ అంకూస్, సర్పంచ్‌లు రంపీస మనోహర్, అర్షం బలరాం, మచ్చిక యాదగిరి, జిల్లెల రాజేశ్వరి, పీఆర్ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, విద్యుత్ ఏఈలు ఆర్ కృష్టయ్య, సతీశ్, రవికుమార్, వ్యవసాయ శాఖ, పశు సంవర్ధకశాఖ అధికారులు యాదగిరి, ధర్మనాయక్, ఎంఈవో విజయ్‌కుమార్, ఐకేపీ ఏపీఎం లలితాదేవి, ఏపీవో రాజిరెడ్డి, వార్డెన్ రవికుమార్, గ్రంథాలయ అధికారి అనిత పాల్గొన్నారు.