చెన్నారావుపేట, డిసెంబర్ 13: థర్డ్‌వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని, ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించాలని కొవిడ్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చల్లా మధుసూదన్ అన్నారు. మండలంలోని కట్టయ్యపల్లె, అమీనాబాద్‌లో సోమవారం ఆయన కరోనా టీకా ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మధుసూదన్ మాట్లాడుతూ ఒమిక్రాన్ రూపంలో వైరస్ వేగంగా విస్తరిస్తున్నదని, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల దాన్ని ఎదుర్కోవచ్చని సూచించారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో అర్హులను గుర్తించి టీకాలు వేయాలని ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా వైద్య సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆయన వెంట సీహెచ్‌వో వెంకటేశ్వరరావు, ఏఎన్ఎంలు ఆంగోత్ అరుణ, పుష్పలత, ఆశ కార్యకర్తలు వసుమతి, మాధవి, అడుప విజయ ఉన్నారు.
వేగవంతంగా వ్యాక్సినేషన్
కొవిడ్ వ్యాక్సినేషన్ మండలంలో వేగవంతంగా కొనసాగుతున్నది. వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు వార్డుల వారీగా 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి టీకాలు వేస్తున్నారు. మొదటి డోసు వేసుకున్న వారికి సెకండ్ డోస్ టీకాలు వేస్తున్నారు. ఇప్పటికే మండలంలో 90 శాతం టీకాలు వేశారు. మరో వారం రోజుల్లో వందశాతం కొవిడ్ టీకాలు పూర్తి చేస్తామని వైద్యాధికారులు తెలిపారు. చెన్నారం, నల్లబెల్లిలో పూర్తి కాగా, ఇల్లంద, దమ్మన్నపేట, ఉప్పరపల్లి, కట్య్రాల తదితర గ్రామాలు వంద శాతానికి చేరువలో ఉన్నాయి. కొవిడ్ మూడో దశ ఉధృతంగా వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు కోరుతున్నారు.