సంగెం/గీసుగొండ, నవంబర్ 18: కరోనా వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేసి ఆదర్శంగా నిలువాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ సూచించారు. సంగెం మండలంలోని గవిచర్లలో గురువారం ఆయన వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ప్రజలు టీకాలు వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి పద్మశ్రీ, వైద్యాధికారి పొగాకుల అశోక్, సర్పంచ్ దొనికెల రమ-శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం హరిసింగ్ సంగెం మండలంలోని తిమ్మాపురంలో బృహత్ పల్లెప్రకృతి వనంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. డంపింగ్ యార్డును పరిశీలించి సేంద్రియ ఎరువు తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీవో కొమురయ్య, సర్పంచ్ గన్ను శారద, సంపత్ పాల్గొన్నారు. అలాగే, అడిషనల్ కలెక్టర్ గీసుగొండ మండలం మరియపురం గ్రామాన్ని సందర్శించారు. సర్పంచ్ అల్లం బాలిరెడ్డి గ్రామంలోని ప్రధాన రహదారుల్లో మల్టీలేయర్ పద్ధతిలో మొక్కలు నాటించడంతోపాటు నర్సరీ కోసం బ్యాగుల ఫిల్లింగ్ పనులను దగ్గరుండి చేయిస్తుండడంతో అభినందించారు. వారి వెంట కార్యదర్శి స్వప్న ఉన్నారు.
వ్యాక్సిన్‌తోనే కరోనా కట్టడి
ఖానాపురం/చెన్నారావుపేట: వ్యాక్సిన్ వేసుకుంటేనే కరోనాను కట్టడి చేయొచ్చని ఖానాపురం మండల మంగళవారిపేట సర్పంచ్ లావుడ్యా రమేశ్‌నాయక్, మండల వైద్యాధికారి మల్యాల అరుణ్‌కుమార్ అన్నారు. మంగళవారిపేటలో వందశాతం కరోనా వ్యాక్సిన్ పూర్తి చేసిన వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ రామలింగయ్య, ఏఎన్ఎం కనకలక్ష్మి, అనిల్‌కుమార్, ఆశ కార్యకర్తలు సుజాత, రమ, సునీత, అనిత పాల్గొన్నారు. చెన్నారావుపేట మండల పరిధిలో అర్హులు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి టీకాలు వేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నర్సంపేట నుంచి చెన్నారావుపేటకు వస్తున్న ఆటోడ్రైవర్ వివరాలు కనుగొని ఏఎన్ఎం పుష్పలత టీకా వేసింది. 37 మందికి మొదటి డోస్, 178 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ వేసినట్లు మెడికల్ ఆఫీసర్ ఉషారాణి తెలిపారు.