వరంగల్, అక్టోబర్ 1(నమస్తేతెలంగాణ) : పల్లెల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో అనేక పథకాలను అమల్లోకి తెచ్చింది. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలను మార్చుతున్నది. పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్నది. పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. మొక్కల పెంపకానికి నర్సరీలు నిర్వహిస్తున్నది. పారిశుధ్యం కోసం డంపింగ్ యార్డులు నిర్మించింది. మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు సీసీ రోడ్లు నిర్మిస్తున్నది. తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో గ్రీనరీ పెంచుతున్నది. వీటిలో ఎక్కువ అభివృద్ధి పనులను గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ద్వారా నిర్వహిస్తున్నది. జరిగిన పనులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుపుతున్నది. దీంతో పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పల్లెలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చింది. ఊరూరా, మున్సిపాలిటీల పరిధిలోని ప్రతి వార్డు, నగర పాలక సంస్థ పరిధిలో డివిజన్ వారీగా నర్సరీలు నిర్వహిస్తున్నది. ఈ నర్సరీల్లోని మొక్కలను హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం వానకాలం పల్లెలు, పట్టణాల్లో నాటుతున్నది. ప్రతి గ్రామం, వార్డు, డివిజన్లో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. పల్లెల్లో మంకీ ఫుడ్‌కోర్టులను, యాదాద్రి మోడల్ పార్కులను సైతం నెలకొల్పింది. ఈ ఏడాది ప్రతి మండలంలో పదెకరాల విస్తీర్ణంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నది. తడి, పొడి చెత్త సేకరణ కోసం ఇంటింటికీ డస్ట్బిన్లు ఇచ్చింది. సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులకు తరలించేందుకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థకు ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలను సమకూర్చింది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ట్రాక్టర్ల ద్వారా నీరందిస్తున్నది.
చెల్లింపులతో ఉత్సాహం..
పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించారు. పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం తదితర కార్యక్రమాల ద్వారా చేపట్టిన పనులను వివరించారు. గ్రామాల రూపురేఖలు మారిపోయినట్లు చెప్పారు. దేశంలో తెలంగాణకు మరే రాష్ట్రం దరిదాపుల్లో లేదన్నారు. ప్రధానంగా వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనులను ప్రోత్సహించే రీతిలో చెల్లింపులు జరుగుతుండడం వల్ల ఆశించిన అభివృద్ధి కనబడుతున్నది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా పనులు నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ నిధులతో నర్సరీలు, అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ, మొక్కల సంరక్షణ, పల్లె ప్రకృతి వనాలు, మెగా పార్కులు, మంకీ ఫుడ్ కోర్టులు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలతో పాటు సీసీ రోడ్లు, కమ్యూనిటీ సోప్ పిట్స్ నిర్మిస్తున్నది. గ్రామాల్లో నిర్మించిన రైతువేదికలకు సైతం ఉపాధి హామీ పథకం నుంచి కొంత శాతం నిధులు కేటాయించింది. ఈ పథకం నుంచి ఆయా గ్రామం, పట్టణం, నగరంలో చేపట్టే ప్రతి పనిని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, నగర పాలక సంస్థ నిర్వహిస్తున్నది. గ్రామ పంచాయతీలో దీనికోసం ప్రత్యేక అకౌంట్ ఉంటుంది. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ పేర ఉండే ఈ అకౌంట్ ద్వారా ప్రభుత్వం జరిగిన పనులకు చెల్లింపులు చేస్తుంది. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కలిసి జాయింట్ సిగ్నేచర్ చెక్‌ద్వారా అకౌంట్ నుంచి ఉపాధి హామీ నిధులు డ్రా చేస్తారు. ఇతర స్థానిక సంస్థల్లోనూ ఇదే పరిస్థితి. స్థానిక సంస్థల ద్వారా జరిగే పనులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అభివృద్ధిని చూసి సకల జనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.