నల్లబెల్లి, డిసెంబర్ 13: కరోనా వ్యాక్సినేషన్‌ను జిల్లాలో వేగంగా నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో వెంకటరమణ అన్నారు. మండలకేంద్రంలోని పీహెచ్‌సీని పీవో ఎంపీహెచ్ డాక్టర్ పద్మతో కలిసి సోమవారం తనిఖీ చేశారు. దేశవ్వాప్తంగా ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో టీబీ, లెప్రసీ, వ్యాధినిరోధక టీకాలు, గర్భిణులకు పరీక్షలు, చిల్డ్రన్స్ ఇమ్యూనైజేషన్, కేసీఆర్ కిట్ల పంపిణీ, ప్రసవాల సంఖ్య పెంచడంతోపాటు వందశతం వ్యాక్సినేషన్ దిశగా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలను పరిశీలించనున్న నేపథ్యంలో వైద్యాధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట వైద్యాధికారి మహేందర్‌నాయక్, సిబ్బంది జానకీదేవి, రజిని, విజయలక్ష్మి, రజినీకుమారి ఉన్నారు.
కొనసాగుతున్న టీకా కార్యక్రమం
లక్ష్యం దిశగా జిల్లావ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. సోమవారం 8944 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించారు. స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 2,68,377 మందికి మొదటి డోస్, 1,57,234 మందికి సెకండ్ డోస్ టీకాలు వేశామన్నారు. 271 గ్రామాలు, 31 కాలనీల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. పర్వతగిరి మండలవ్యాప్తంగా 535 మందికి టీకాలు వేసినట్లు పీహెచ్సీ వైద్యాధికారి ప్రసాద్‌ముఖర్జీ తెలిపారు. అన్నారం షరీఫ్, కొంకపాక, ఏనుగల్, పర్వతగిరి, వడ్లకొండ, చింతనెక్కొండ సబ్ సెంటర్లలోని ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు.