కరీమాబాద్, నవంబర్5: శీతాకాలంలో వెచ్చదనాన్నిచ్చే నేస్తాలు వచ్చేశాయి. రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతతో వరంగల్‌లో ఉన్ని దుస్తుల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. స్వెటర్లు, జర్కిన్లు, శాలువాలు, టోపీలపై ప్రజలు ఆసక్తి చూపిస్తుండడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. టిబెట్, నేపాల్‌కు చెందిన వ్యాపారులు నగరంలో ఏర్పాటు చేసిన ఉన్ని దుకాణాల వద్ద సందడి చేస్తున్నారు.
సరికొత్త డిజైన్లతో..
వినియోగదారులకు ఆకట్టుకునేలా నాణ్యతతోపాటు సరికొత్త డిజైన్లతో ఉన్ని దుస్తులు లభ్యమవుతున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో అమ్మకాలు చేస్తున్నారు. బతుకుదెరువు కోసం ఏటా వందలాది మంది టిబెటియన్లు, నేపాలీలతోపాటు ఆయా రాష్ర్టాల్లోని వ్యాపారులు గుడారాలు వేసుకుని స్వెటర్లు, తదితర ఉన్ని దుస్తులను విక్రయిస్తుంటారు. పెరుగుతున్న పోటీకి తగ్గట్టుగా వ్యాపారులు ప్రత్యేకతను చాటుతూ అక్టోబర్ నెల చివరి నుంచి జనవరి ఆఖరి వరకు విక్రయిస్తున్నారు. ఉన్ని దుస్తులకు సంబం ధించిన ట్యాగ్‌ను అతికించి ఫిక్స్డ్ రేట్‌తో అమ్మకాలు సాగిస్తున్నారు. రూ. 150 మొదలుకుని రూ. 1000 వరకు ధరలు ఉంటున్నాయి. సరుకు నాణ్యతను బట్టి, ఆయా సైజులను బట్టి ధరలు ఉన్నాయి.
అమ్మే ప్రదేశాలివే..
జిల్లా కేంద్రంలోని అశోకా జంక్షన్‌లోని మున్సిపల్ కాంప్లెక్స్, ఎంజీఎం దవాఖాన సర్కిల్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం సమీపంలో వ్యాపారులు ఉన్ని దుస్తుల దుకాణాలు ఏర్పాటు చేశారు. రోడ్ల పక్కన తాత్కాలిక షెడ్లు వేసుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. రంగురంగుల స్వెటర్లు, శాలువాలు, మంకీ క్యాప్‌లు, జర్కిన్లు, మఫ్లర్లను అందుబాటులో ఉంచారు. సుమారు నాలుగు నెలల పాటు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తారు. ఆ తర్వాత స్వస్థలాలకు వెళ్లిపోతారు. మళ్లీ శీతాకాలం రాగానే తరలివచ్చి ఇక్క డ ఉన్ని దుస్తుల దుకాణాలు తెరుస్తారు.