వరంగల్‌రూరల్, ఆగస్టు 8(నమస్తేతెలంగాణ) : హైదరాబాద్- భూపాలప ట్నం 163వ జాతీయ రహదారి(ఎన్‌హెచ్)లో వరంగల్, ములుగు మధ్య పెండింగ్‌లో ఉన్న 29 కి.మీ. డబుల్ రోడ్డును ఫోర్ లేన్‌గా విస్తరించే పనులను సంబంధిత అధికారులు వేగవంతం చేశారు. ఇటీవల మంజూరైన రూ.317 కోట్లతో పను లు చేపట్టేందుకు ఆన్లైన్ టెండర్ పిలిచా రు. ఈ నెల 17న టెండర్లను ఓపెన్ చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి 150వ కి.మీ. వరకు అంటే వరంగల్ నగర శివారులో ఉన్న ఆరెపల్లి వరకు ఫోర్ లేన్ నిర్మాణం జరిగింది. ఆరెపల్లి త ర్వాత వరంగల్, ఏటూరునాగారం మధ్య రెండేళ్ల క్రితం 159వ కి.మీ. నుంచి 165/4వ కి.మీ. అంటే ఆత్మకూరు మం డలం గూడెప్పాడ్ నుంచి నీరుకుల్ల క్రాస్ వరకు గతంలో ఉన్న డబుల్ రోడ్డును ఎ న్హెచ్ విభాగం ఫోర్ లేన్‌గా విస్తరించిం ది. దీంతో పాటు 186వ కి.మీ. నుంచి 215వ కి.మీ. అంటే ములుగు జిల్లా కేం ద్రం సమీపంలోని గట్టమ్మ వద్ద నుంచి ములుగు మీదుగా గోవిందరావుపేట మండలంలోని పస్రా వరకు నాలుగు వ రుసల రహదారి నిర్మించింది. వరంగల్, ములుగు మధ్య ఇంకా 29.6 కి.మీ. డ బుల్ రోడ్డును ఫోర్‌లేన్‌గా విస్తరించాల్సి ఉంది. ఇందులో ఆత్మకూరు మండలంలోని కటాక్షపురం చెరువు లోలెవల్ వం తెన, దామెర, ఆత్మకూరు, ములుగు మం డలాల పరిధిలోని ఎస్సారెస్పీ, ఇతర కెనాళ్లపై ఇరుకు వంతెనలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా కటాక్షపురం చెరువు మత్తడి దుంకిన సమయంలో వరద నీరు ఎన్‌హె చ్ మీదుగా ప్రవహిస్తుండడం వల్ల వానకాలం రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇటీవల భారీ వర్షాలు కురిసిన సమయంలో రెండు రోజులు అదే పరిస్థితి. విస్తరణకు నోచుకోని రోడ్డు కూడా దెబ్బతిన్నది. పెండింగ్‌లో ఉన్న 29.6 కి.మీ. డబుల్ రోడ్డును ఫోర్ లేన్‌గా విస్తరించే పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.
రూ.317 కోట్లతో టెండర్..
ఎన్‌హెచ్ విభాగం ఇంజినీర్లు గత ఏడాది ఈ 29.6 కి.మీ. డబుల్ రోడ్డును ఫోర్ లేన్‌గా విస్తరించేందుకు రూ.317 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. 150వ కి.మీ. నుంచి 159వ కి.మీ. అంటే ఆరెపల్లి నుంచి ఆత్మకూరు మండలం గూడెప్పాడ్, 165/4వ కి.మీ. నుంచి 186వ కి.మీ. అంటే నీరుకుల్ల క్రాస్ నుంచి ములుగు సమీపంలోని గట్టమ్మ వరకు 29 కి.మీ. ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణం కోసం రూ.317 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఎన్‌హెచ్ అధికారులు ఆన్లైన్ టెండర్ పిలిచారు. దాఖలైన టెండర్లను ఈ నెల 17న తెరువనున్నట్లు వెల్లడించారు. టెండర్ కైవసం చేసుకునే కాంట్రాక్టు సంస్థ 24 నెలల కాల పరిమితితో అగ్రిమెంటు కుదుర్చుకుని రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనుంది. సాధ్యమైనంత త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎన్‌హెచ్ అధికారులు తెలిపారు.
విస్తరణ పనులు ఇవే..
రహదారి విస్తరణలో భాగంగా 2.5 మీటర్ల వెడల్పు డివైడర్, దీనికి ఇరువైపులా 9 మీటర్ల వెడల్పుతో బీటీ రోడ్డు నిర్మాణం జరుగనుంది. దీంతో ఇది 20.5 మీటర్ల ఫోర్ లేన్ రోడ్డు కానుంది. ఈ 29.6 కి.మీ రోడ్డులో దామెర మండలం దర్గావిలేజ్, ఓగ్లాపురం, ఊరుగొండ, ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ జంక్షన్, కటాక్షపురం, ములుగు మండలం మహ్మద్ గౌస్‌పల్లి, మల్లంపల్లి, జాకారం గ్రామాల వద్ద అదనంగా డ్రెయిన్స్, ఫుట్‌పాత్‌లు, రెయిలింగ్, సెంట్రల్ లైటింగ్ నిర్మించనున్నారు. ముఖ్యంగా కటాక్షపురం చెరువు వద్ద ఉన్న లో లెవల్ వంతెన, ములుగు మండలం పందికుంట స్టేజీ సమీపంలోని కెనాల్‌పై ఉన్న ఇరుకు వంతెన స్థానంలో హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణం జరుగనుంది. మల్లంపల్లి, ఓగ్లాపూర్, ఊరుగొండ తదితర గ్రామాల వద్ద ఎస్సారెస్పీ, ఇతర కెనాళ్లపై ఉన్న వంతెనల స్థానంలోనూ కొత్తగా హై లెవల్ వంతెనలు నిర్మిస్తారు. దీంతో వానకాలం వరంగల్, ములుగు మధ్య కటాక్షపురం వద్ద రాకపోకలు నిలిచిపోవడం వంటి సమస్యలకు శాశ్వతంగా తెరపడనుంది.