వరంగల్, అక్టోబర్ 10 : గ్రేటర్ కార్పొరేషన్లో విలీనమైన గ్రామాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల పరిధిలోని 42 గ్రామాల విలీనంతో వరంగల్ కార్పొరేషన్ గ్రేటర్‌గా రూపాంతరం చెందింది. ఈ గ్రామాల అభివృద్ధిపై గ్రేటర్ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించారు. రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలు, కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నారు. సీఎం హామీ, ఎస్సీ సబ్‌ప్లాన్, జనరల్ ఫండ్ నిధులతో పనులు చేపడుతున్నారు. ఇప్పటికే రూ. 427.41 కోట్ల నిధులతో పనులు ప్రారంభించగా, సుమారు 176.62 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పురోగతిలో ఉండగా, మిగతా పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. విలీన గ్రామాలకు చెందిన ఎమ్మెల్యేలు నిరంతరం గ్రేటర్ అధికారులతో సమీక్షిస్తూ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు.
చకచకా పనులు..
గ్రేటర్లో విలీనమైన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని గ్రామాలు 1, 2, 3, 14, 43, 44, 45, 46, 55, 56, 64, 65, 66 డివిజన్లలో ఉన్నాయి. పరకాల నియోజకవర్గం పరిధిలోని గ్రామాలు 15,16, 16 డివిజన్లలో ఉన్నాయి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని గ్రామాలు 46,64 డివిజన్లలో కలిశాయి. 42 విలీన గ్రామాలతో 16డివిజన్లను ఏర్పాటు చేశారు. రూ. 427.41 కోట్లతో 2690 అభివృద్ధి పనులకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వీటిలో రూ. 176,62 కోట్లతో చేపట్టిన 1851 అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. రూ.97.59 కోట్లతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నా యి. సీఎం కేసీఆర్ గ్రేటర్ కార్పొరేషన్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నిధులు విడుదల చేస్తున్నారు.
అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..:గుండు సుధారాణి, మేయర్
గ్రేటర్ కార్పొరేషన్లో విలీనమైన 42 గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. పట్టణీకరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా విలీన గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆదేశాలు ఇచ్చింది. రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలు తదితర మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఈ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పాలకవర్గం పనిచేస్తున్నది.