నల్లబెల్లి, అక్టోబర్ 26 :హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాలు పల్లెల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. హరితహారంలో భాగంగా విరివిగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి గ్రామాలు పచ్చబడగా, పల్లెప్రగతితో పరిశుభ్రంగా మారి అభివృద్ధి బాటపట్టాయి. వీటికితోడు తీరొక్క మొక్కలతో రూపుదిద్దుకున్న పల్లె ప్రకృతివనాలతో బృందావనాలను తలపిస్తున్నాయి. నల్లబెల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో పల్లె ప్రకృతివనం, దాని పక్కనే పది ఎకరాల్లో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతివనం గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
నల్లబెల్లి మండలంలోని ఏజెన్సీ గ్రామమైన కొండాపూర్లో తీరొక్క మొక్కలతో రూపుదిద్దుకున్న పల్లెప్రకృతివనం చిట్టడవిని తలపిస్తున్నది. ఇప్పటికే హరితహారంలో భాగంగా గ్రామం పచ్చబడగా, సుందరంగా తీర్చిదిద్దిన పల్లెప్రకృతి వనం మరింత శోభను తెచ్చింది. దాని పక్కనే పది ఎకరాల్లో బృహత్ ప్రకృతివనం ఏర్పాటు చేసి పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు పెద్ద ఎత్తున నాటారు. వాటిని కంటికి రెప్పలా కాపాడుతుండడంతో ఏపుగా పెరుగుతూ గ్రామస్తులకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకర వాతావరణం అందిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలు, పెద్దలు ఈ వనాల్లో సేదతీరుతున్నారు. ఇటీవల బృహత్ ప్రకృతివనాన్ని పరిశీలించిన వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, అందులో క్రమపద్ధతిలో నాటిన మొక్కలు, ప్రత్యేక శ్రద్ధతో వాటిని పెంచుతున్న తీరును చూసి సర్పంచ్ తిరుపతమ్మను, మండల అధికారులను అభినందించారు.
హరితనిధి భవిష్యత్ తరాలకు పెన్నిధి
హరితనిధి భవిష్యత్ తరాలకు పెన్నిధి. హరితహారం కార్యక్రమం నిరంతరంగా కొనసాగేలా దోహదపడుతుంది. 2015 నుంచి రాష్ట్రంలో అమలవుతున్న హరితహారంతో ధ్వంసమైన అటవీప్రాంతం మళ్లీ పునరుజ్జీవం పోసుకుంటున్నది. ఇది శుభపరిణామం. హరితనిధిలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యేలా అవగాహన కల్పిస్తాం. నావంతు సహకారం తప్పకుండా అందిస్తా.
మండలంలో ప్రకృతి పరవశం
హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు పెరిగిపెద్దవై, గ్రామాలు పచ్చబడి ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుతున్నది. తీరొక్క మొక్కలతో ప్రకృతి పులకించిపోతున్నది. మండల పంచాయతీ అభివృద్ధి అధికారిగా ఈ ప్రభుత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరూ హరితనిధిలో భాగస్వాములై భావితరాలకు బంగారు బాటలు వేయాలి. నా వంతు సహకారం అందిస్తా.