వరంగల్, ఆగస్టు 8: ట్రింగ్ ట్రింగ్…, ట్రింగ్ ట్రింగ్… అంటూ ఇంట్లో మార్మోగిన ల్యాండ్‌లైన్ ఫోన్ చప్పుడు మూగబోయింది. రెండు దశాబ్దాల క్రితం స్టేటస్ సింబల్‌గా పిలుచుకునే టెలిఫోన్ ప్రస్తుతం డెడ్ అయ్యింది. ‘ప్రపంచం పరిచయం చేసే ప్రతి నూతన ఆవిష్కరణ వెనుక కొన్ని నష్టాలు, లాభాలు ఉంటాయి’అన్నారు తత్వవేత్తలు. కానీ, బీఎస్ఎన్ఎల్ విషయంలో మాత్రం నష్టమే జరిగిందని చెప్పవచ్చు. కాలగమనంలో అరచేతిలోకి ప్రపంచం వచ్చి చేరడంతో ల్యాండ్‌లైన్‌కు ఆదరణ కరువైంది. ఒకప్పుడు స్టేటస్ సింబల్‌గా నిలిచి, సెల్‌ఫోన్ సునామీతో నేడు మ్యూజియంలో వస్తువుగా మారిన ‘ల్యాండ్‌లైన్ ఫోన్’పై ప్రత్యేక కథనం.
ఒకప్పుడు స్టేటస్ సింబల్ ల్యాండ్‌లైన్ ఫో
సుమారు మూడు దశాబ్దాల క్రితం ఎవరింట్లోనైనా టెలిఫోన్ ఉందంటే వారిని భూస్వాములుగానో, రాజకీయ నాయకులుగానో చెప్పుకునేవారు. వారిని ఉరంతా సంపన్నులుగా భావించేవారు. కొంతకాలం తర్వాత ల్యాండ్‌లైన్ ఫోన్ మధ్యతరగతి వారి ఇళ్లకూ చేరింది. తమ పిల్లలు, బంధువుల యోగక్షేమాలు తెలుసు కోవాలంటే ఫోన్ తప్పనిసరికావడంతో ల్యాండ్‌ఫోన్ పెట్టించుకునేవారు.
లక్ష నుంచి 5 వేలకు..
21వ శతాబ్దం ప్రారంభంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగి సెల్‌ఫోన్‌ను రూపొందించారు. ఈ మార్పే ల్యాండ్‌లైన్ ఫోన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో, రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 5 వేలకు పడిపోయింది.
ఉపాధికి కేరాఫ్ ఎస్టీడీ బూత్‌లు
20 సంవత్సరాల క్రితం నిరుద్యోగ యువత ఎస్టీడీ బూత్‌ల ద్వారా ఉపాధి పొందారు. వీటిలో షిఫ్టుల పద్ధతిలో వేలాది మంది పనిచేసే వారు. కాలక్రమేణా ల్యాండ్‌లైన్ స్థానంలో కాయిన్‌బాక్స్‌లు వచ్చినా కొంతకాలం తర్వాత ఇవి కూడా కనుమరుగయ్యాయి.
సునామీ సృష్టించిన సెల్‌ఫోన్
ఒకప్పుడు ఇంట్లో మాత్రమే ఏర్పాటు చేసుకునేలా ఉండే ఫోన్ కొద్ది రోజులకు జేబులో పెట్టుకునేలా రూపొందించారు. దీంతో ప్రజలు సెల్‌ఫోన్‌పై ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారింది. దీనికి తోడు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనాతో చిన్నారుల చేతికీ సెల్‌ఫోన్ ఇచ్చే లా చేసింది. విద్యా సంవత్సరం నష్టపోకూ డదని భావించిన ప్రభుత్వాలు విద్యార్థులు ఆన్లైన్లో పాఠాలు వినాలని ఆదేశించింది. దీంతో ప్రతి విద్యార్థి చేతికి సెల్‌ఫోన్ వచ్చింది.
ప్రభుత్వ ఆఫీసులు, గ్రామాల్లోనే..
బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ ఫోన్ల సంఖ్య భారీగా తగ్గింది. 2005 వరకు సుమారు లక్షా 20 వేల కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం 5వేలకు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ నెట్‌వర్క్‌లు తమ టవర్లు ఏర్పాటు చేయకపోవడంతో అక్కడక్కడ ల్యాండ్‌లైన్ కనెక్షన్లు ఉన్నట్లు బీఎస్ఎన్ఎల్ అధికారులు చెప్పారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలైన విద్యుత్, పోలీసు, దవాఖానలతో పాటు కొన్ని ప్రముఖ వ్యాపార సంస్థల్లో మాత్రమే ల్యాండ్ఫోన్లు కనిపిస్తున్నాయి.