చెన్నారావుపేట, అక్టోబర్ 24: లీగల్‌సెల్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుతుందని, చట్టపరంగా తప్పు చేయనివారు భయపడాల్సిన అవసరం లేదని నర్సంపేట జూనియర్ సివిల్ జడ్జి పీ శిరీష అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మండలకేంద్రంలోని ఆశాజ్యోతి సమాఖ్య కార్యాలయంలో ఆదివారం అధ్యక్షురాలు వర్దెల్లి భాగ్య అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు న్యాయ విజ్ఞానం చేరవేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం జరిగే న్యాయ సహాయ కమిటీకి దరఖాస్తు చేసుకోవడం ద్వారా లబ్ధి పొందొచ్చన్నారు. అనంతరం సివిల్ జడ్జి శిరీషను మహిళా సంఘాల సభ్యులు శాలువాతో సన్మానించారు. సదస్సులో ఓరుగల్లు మహా సమాఖ్య అధ్యక్షురాలు మోటూరి శ్వేత, మండల వైద్యాధికారి ఉషారాణి, ఎస్సై శీలం రవి, ఏపీఎం ముక్కెర ఈశ్వరయ్య, లీగల్ సర్వీస్ మెంబర్ పీ రవి, ప్యానల్ లాయర్లు సాంబయ్య, సునీత, అడ్వకేట్లు సుధాకర్, అశోక్, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు కట్టయ్య, వెంకటేశ్వర్లు, ఎంఎస్ఏ రజిత, మహిళా సంఘాల ప్రతినిధులు ప్రమీల, మౌనిక, వీవోఏలు సుధ, మంజుల పాల్గొన్నారు.
ఉచిత న్యాయ సేవలు పొందాలి
వర్ధన్నపేట: మూడు లక్షల రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న పేద కుటుంబాలు న్యాయ సేవ సాధికార సంస్థ ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సహాయాన్ని పొందొచ్చని వరంగల్ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే చాముండేశ్వరి సూచించారు. మండలంలోని బండౌతాపురంలో రాష్ట్ర, జిల్లా న్యాయసేవ సాధికార సంస్థ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వారు కోర్టును ఆశ్రయించొచ్చన్నారు. వీరు న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్తోమత లేకపోతే న్యాయసేవ సంస్థను ఆశ్రయించాలన్నారు. తద్వారా సంస్థ ప్రత్యేకంగా న్యాయవాదిని ఏర్పాటు చేసి న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. గ్రామాల్లో ప్రజలు అనవసర తగాదాలకు వెళ్లకుండా శాంతియుతంగా జీవించాలని సూచించారు. సదస్సులో ఏసీపీ గొల్ల రమేశ్, సీఐ సదన్‌కుమార్, ఎస్సై రామారావు, ప్రజలు పాల్గొన్నారు.