నర్సంపేట, అక్టోబర్ 10: జిల్లాలోని రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలో నిర్మించిన నర్సంపేట డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కు సంబంధించిన ప్రతి సమస్య పరిష్కారంలో తాను 20 ఏళ్లుగా ముందు వరుసలో ఉన్నానని తెలిపారు. రైతుల కళ్లలో ఆనందాన్ని చూడడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో కలలన్నీ నిజం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. నర్సంపేట డివిజన్లో వరి ప్రధాన పంటన్నారు. వ్యవసాయాధారిత ప్రాంతం కావడంతోనే నూతన ప్రాజెక్టులు, గోదాములు నిర్మించుకున్నామని వివరించారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, ఆర్డీవో పవన్‌కుమార్, స్టేట్ ఫుడ్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు సంగులాల్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోనెల రవీందర్, జిల్లా అధ్యక్షుడు తోట సంపత్, నర్సంపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సింగిరకొండ మాధవశంకర్, మోతె జయపాల్‌రెడ్డి, శ్రీరాం ఈశ్వరయ్య, ఇరుకు కోటేశ్వర్రావు, జయపాల్‌రెడ్డి, శివకుమార్, వెంకటనారాయణ, రవీందర్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజారోగ్యానికి సర్కారు పెద్దపీట
రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నర్సంపేట నియోజకవర్గానికి చెందిన 134 మంది లబ్ధిదారులకు రూ. 48.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పెద్ది పంపిణీ చేసి మాట్లాడారు. ఆరోగ్యశ్రీలో వర్తించని అనేక వ్యాధులకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ ద్వారా వైద్యం చేయించుకోవచ్చన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.