వరంగల్, నవంబర్ 12(నమస్తేతెలంగాణ): రైతులకు దన్నుగా నిలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. వాడవాడ నుంచి గులాబీ దండు కదిలింది. కేంద్రం యాసంగి వడ్లు కొనాలనే డిమాండ్‌తో రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించింది. ఢిల్లీకి సెగ తగిలేలా నిరసన తెలిపింది. గల్లీగల్లీ దద్దరిల్లేలా కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. వడ్లను పంజాబ్‌లో కొంటున్న కేంద్రం తెలంగాణలో కొనబోమంటోందని ఎండగట్టింది. తెలంగాణ రైతులపై ఎందుకీ వివక్ష అంటూ ప్రశ్నించింది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపుమేరకు టీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం రైతులతో కలిసి జిల్లాలో మహాధర్నా నిర్వహించారు. వరంగల్‌లో ఖమ్మం రోడ్డులోని నాయుడుపంప్ జంక్షన్, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలు, రాయపర్తి మండల కేంద్రంలో ఈ ధర్నా జరిగింది. వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలు, రాయపర్తి మండలంలోని టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు మహాధర్నాలో పాల్గొన్నారు. ప్రతి గ్రామం, వార్డు, డివిజన్ నుంచి గులాబీ జెండాలతో ధర్నాకు తరలివచ్చారు.
గ్రామం, వార్డు, మండల కేంద్రంలో ర్యాలీ తీశారు. ఎద్దుల బండ్లు, బైక్‌ల ద్వారా వరి కంకులతో ధర్నా వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో కూడిన ఫ్లెక్సీలను చేతబూని ధూంధాంను తలపించేలా కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం యాసంగి వడ్లు కొనాలని నినదించారు. కేంద్రం ప్రభుత్వం రూపొందించిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణలో వడ్లు కొనేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. బీజేపీని బాధ్యత లేని జనతా పార్టీగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా చేసిన నినాదాలు మారుమోగాయి. గ్రామాలు, మండల, నియోజకవర్గ కేంద్రాలు దద్దరిల్లాయి. మహాధర్నాతో జిల్లాలోని గ్రామాలు, వార్డులు, డివిజన్లు, మండల కేంద్రాలు గులాబీమయమయ్యాయి. ధర్నాలో పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు కేంద్రం తీరుపై మండిపడ్డారు.
నాలుగు చోట్ల మహాధర్నా
జిల్లాలో అనుమతులను పొంది కరోనా నిబంధనలకు లోబడి నాలుగు చోట్ల టీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించింది. వరంగల్‌లో ఖమ్మం రోడ్డులోని నాయుడుపంపు, నర్సంపేట, వర్ధన్నపేట, రాయపర్తి మండల కేంద్రంలో ఈ ధర్నా ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైంది. గ్రామాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి ఉత్సాహంగా ధర్నాకు హాజరయ్యారు. ఆయా నియోజకవర్గ, మండల కేంద్రంలో ఈ ధర్నాకు స్థానిక ఎమ్మెల్యే నేతృత్వం వహించారు. నాయుడు పంపు వద్ద జరిగిన ధర్నాకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు తరలివచ్చారు. 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి అధ్యక్షత వహించిన ఈ ధర్నాలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ దిడ్డి భాగ్యలక్ష్మితోపాటు పీఏసీఎస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు, పార్టీ కార్యకర్తలు, రైతులు ఈ ధర్నాలో పాల్గొని కేంద్రం విధానాలపై మండిపడ్డారు. నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో జరిగిన మహాధర్నాలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ మలోతు కవిత పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. జెడ్పీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, జెడ్పీ వైస్ చైర్మన్ ఎ.శ్రీనివాస్, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్తోపాటు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్‌ల చైర్మన్లు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఈ ధర్నాకు హాజరయ్యారు. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. రాయపర్తి మండల కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు నరసింహనాయక్, మండల ఇన్చార్జ్ దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహా ధర్నా జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని టీఆర్ఎస్ శ్రేణులు, రైతులకు ఉత్సాహాన్నిచ్చారు. అనంతరం టీఆర్ఎస్ ముఖ్య నేతలు రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఇక్కడి తహసీల్దార్‌కు కేంద్రం యాసంగి వడ్లను కొనాలనే డిమాండ్‌తో కూడిన వినతిపత్రం అందజేశారు.
కేంద్రం విధానాలపై ఫైర్
వర్ధన్నపేట, రాయపర్తి ధర్నాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని ఫైర్ అయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు శాపాలుగా మారుతాయని ధ్వజమెత్తారు. పంజాబ్‌లో వడ్లు కొంటున్న కేంద్రం తెలంగాణలో వడ్లను కొనబోమని పేర్కొనటంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. నర్సంపేట ధర్నాలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు అండగా టీఆర్ఎస్ నిలుస్తుందని అన్నారు. తెలంగాణలో ఏ రైతు అరికాలికి ముల్లు గుచ్చినా పంటితో తీసే నాయకుడు మన కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు. వరంగల్ తూర్పు మహాధర్నాలో ఎమ్మెల్యే నన్నపునేని మాట్లాడుతూ ఢిల్లీ బీజేపీది ఒకమాట, ఇక్కడ గల్లీ బీజేపీది ఒకమాట అని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని అన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని, రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తెలంగాణలో రైతులు పండించిన వడ్లను కొనే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని నరేందర్ తూర్పారపట్టారు. తెలంగాణ రైతులను మోసం చేస్తున్న బీజేపీ కుట్రలను తిప్పికొడుతామని అన్నారు.