గతంల ఎవుసం చేయాలంటె రైతుకు శాన కష్టమయ్యేది. గిట్టుబాటుకాక అప్పుల పాలై వలసలెల్లిన కుటుంబాలు కోకొల్లలు. కొందరు నీళ్లు లేక, కరంటు సక్కగ ఉండక, పెట్టుబడికి పైసలెల్లక భూములను పడావు పెట్టిన్రు. మరికొందరు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు జేసేటోళ్లు. వడ్డీతో పాటు వడ్లు తామే కొంటామని అగ్గువ సగ్గువకు తీసుకునేవారు. ఇప్పుడు ఫుల్లు కరంటు, పుష్కలంగా నీళ్లతోపాటు పంట పెట్టుబడికి ఇబ్బందుల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ‘రైతుబంధు’ పేరిట నగదు అందిస్తోంది. దీంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. సీఎం కేసీఆర్ వానకాలం, యాసంగిలో ఎకరాకు రూ.5వేల చొప్పున అందిస్తుండడంతో వాటిని విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులకు వినియోగిస్తున్నారు. ఎనిమిదో రోజు గురువారం పలువురు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో అవి అందుకొని మురిసిపో యారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని పండుగలా మార్చారని సంబురపడుతున్నారు. ఆయన మేలు మరువమని స్పష్టం చేస్తున్నారు.
పరకాల: సీఎం కేసీఆర్ వచ్చినంక ఎవుసం పండుగైంది. అప్పట్ల సక్కగ కరంటు ఉండకపోయేది. చీకట్ల పోయి పంటలకు నీళ్లు కట్టేది. గిప్పుడు రోజంత ఉచిత కరంటు వస్తాంది. రెండు పంటలకు రైతుబంధు పైసలిస్తాండు. పెట్టుబడి ఇబ్బందులు, మిత్తిల బాధలు తప్పినై. దిగుబడులు కూడా పెరిగి జరింత వెనకేసుకుంటున్నం. ఎవుసం దండుగ అన్న కాన్నుండి పండుగ అనేకాడికి వచ్చినం. కేసీఆర్‌తోనే రైతుల తలరాత మారింది.
– బుడిగె చంద్రసేన, నడికూడ
రైతుల కోసం మస్తు పథకాలు పెడుతున్న కేసీఆర్ సారు సల్లంగ ఉండాలె. గతంల ఎవుసం చేయాల్నంటె భయంగా ఉండేది. సక్కగ నీళ్లు లేకుండేవి. కరంట్ గోసలు, పెట్టుబడి దొరక్క అప్పులయ్యేటివి. ఇగ ఎందుకని ఎవుసం వదిలి కూలిపనుల కోసం పట్టణాలకు పోయినం. గిప్పుడు ఆ తిప్పలు లేవు. మంచిగ నీళ్లున్నయ్. కరెంట్ ఫుల్లుగ ఉంటాంది. అదునుకు రెండుసార్లు పైసలు ఇస్తుండడంతో పెట్టుబడికి రంది లేకుంట అయ్యింది. పంటలు కూడా బాగ పండుతున్నాయ్. మంచి ధర పలకడంతో ఇప్పుడె నాలుగు పైసలు వెనుకేసుకుంటున్నం.
– గన్రెడ్డి రాజిరెడ్డి, రైతు రేగొండ
నర్సింహులపేట: కేసీఆర్ రైతులకు ఏటా రెండుసార్లు రైతుబంధు పైసలిచ్చి ఆదుకుంటాండు. అనేక రకాలుగ సాయం చేస్తుండడంతో రైతులే అప్పు లిచ్చే స్థాయి కొచ్చారు. పెట్టుబడి కోసం గతంల యాపారుల దగ్గరకు ఎల్తే వడ్డీతోపాటు క్వింటాకు బయట ధర కంటే తక్కువగా ఇచ్చేవారు. ఇప్పుడు అ తిప్పలు తప్పినయ్. ఈ సారి కూడా టైముకు డబ్బులు అకౌంట్ల పడ్డయి. మా తమ్ముడు ఈ మధ్య చనిపోతే కుటుంబానికి రూ.5 లక్షలు వచ్చినయ్. ఇంతకన్న రైతులను ఆదుకునే నాయకుడ్ని ఇప్పటి వరకు చూడలేదు. – రామయ్య, సోమనర్సమ్మ, కొమ్ములవంచ (నర్సింహులపేట)
ఖిలావరంగల్, జనవరి 4 : నాకు ఒక గుంట తక్కువ ఎకరం ఎవు సం భూమి ఉన్నది. సీఎం కేసీఆర్ సారు ప్రతి యేడు రెండు పంటలకు రూ.9,800 ఇస్తున్రు. ఆ పైసలు నా బ్యాంక్ ఖాతాల పడుతున్నయ్. వీటితోనే పత్తి, వరి, మక్కజొన్న పంటలు పండిస్తాన. వేడి నీళ్లకు చన్నీళ్ల లెక్క రైతుబంధు పైసలు బాగా పనిచేస్తున్నయ్. 24 గంటల కరంటు, రైతుబంధుతో చాలా వరకు సమస్యలు తీరినయ్.
– ఆగపాటి సమ్మక్క, బొల్లికుంట(వరంగల్)