చెన్నారావుపేట, ఆగస్టు 10: డంపింగ్‌యార్డుల్లో తయారు చేస్తున్న సేంద్రియ ఎరువును హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు వినియోగించాలని, మార్కెటింగ్ చేసేందుకు కూడా వర్మీకంపోస్టు తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం ఆమె డీల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారంలోగా జిల్లాలోని అన్ని వైకుంఠధామాల్లో రెండు బర్నింగ్ ప్లాట్‌ఫారంలు, వెయిటింగ్, వాష్‌రూం, ఆర్చ్‌ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మల్టీ లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్‌ను పూర్తి చేయాలన్నారు.
కొవిడ్ నిబంధనలతో వేడుకలు..
ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కొవిడ్ నిబంధనలకనుగుణంగా ఏర్పాటు చేయాలని జిల్లాలోని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పంద్రాగస్టు వేడుకలు కలెక్టరేట్ ప్రాంగణంలోనే జరుగుతాయని, ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలన్నారు. వేదిక, ఇతర ఏర్పాట్లను ఆర్డీవో మహేందర్‌జీ, ఆర్అండ్బీ ఈఈ చేయాలని, వేదిక పైన మైక్ సిస్టం, జిల్లాకు సంబంధించిన ప్రగతిని తయారు చేయాలని డీపీఆర్వో బండి పల్లవిని ఆదేశించారు. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగుల వివరాలు, ఒక్కో శాఖకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసి త్వరగా నిర్దేశించిన ఫార్మాట్లో కలెక్టరేట్‌కు పంపించాలన్నారు. శకటాల ప్రదర్శన, స్టాళ్ల ఏర్పాట్లు ఉండదని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు కార్యాలయాల్లో జెండావిష్కరణ కార్యక్రమం తర్వాత కలెక్టరేట్లో జరిగే వేడుకలకు వివిధ శాఖల అధిపతులు రావాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా పోలేదని, వేడుకలకు హాజరయ్యే అధికారులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ భీంరావు, ఆర్డీవో మహేందర్‌జీ, అదనపు కలెక్టర్ భూక్యా హరిసింగ్, డీఆర్డీవో సంపత్‌రావు, డీపీవో ప్రభాకర్, జడ్పీ సీఈవో రాజారావు పాల్గొన్నారు.
ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు నెల వారీ తనిఖీలో భాగంగా ఏనుమాముల మార్కెట్ గోడౌన్ 9-బీలో భద్రపర్చిన జిల్లాకు సంబంధించిన వీవీప్యాట్లు, ఈవీఎంలను కలెక్టర్ హరిత పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న రిజిస్టర్లో సంతకం చేశారు. కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్ జీ నాగరాజు, నాయబ్ తహసీల్దార్ పవన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.