సుబేదారి, జనవరి 14: వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ భూ దందాలపై నజర్ పెట్టారు. భూ ఆక్రమణలు, వివాదాలు, కోర్టు కేసుల గొడవలు, కూల్చివేతలు, బెదిరింపుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టిసారించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. సెలవు రోజులు, వీవీఐపీల పర్యటనలు మినహా ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్‌కుమార్‌ను సీపీ రంగంలోకి దింపారు. ఫిర్యాదుల ఆధారంగా ఇరువర్గాల భూ పత్రాలతో డీసీపీ, స్థానిక సీఐ, సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులు, ఎస్వోసీ ఆధారంగా డీసీపీ విచారణ చేసి సీపీకి నివేదిక ఇస్తున్నారు. ఈ ప్రక్రియ 10 రోజుల నుంచి కొనసాగుతున్నది.
అవినీతి, హద్దుమీరిన పోలీసు అధికారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన గీసుగొండ సీఐ రాయల వెంకటేశ్వర్లు, దామెర ఎస్సై హరిప్రియపై సస్పెన్షన్ వేటు వేశారు. పీడీఎస్ బియ్యం వ్యాపారుల నుంచి వసూళ్లకు పాల్పడడంతో టాస్క్‌ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ నరేశ్‌కుమార్, మరో ముగ్గురు సిబ్బందిపై, యువతి లైంగిక వేధింపుల రాజీ కేసులో సుబేదారి ఎస్సై పున్నంచందర్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. కేయూ పోలీసు స్టేషన్లో దొంగ పరారైన కేసులో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఇదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై సంపత్‌ను వీఆర్‌కు అటాచ్డ్ చేశారు. పోలీసు కమిషనరేట్ పరిధిలో పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 300 గజాల స్థలంపై ఓ హోంగార్డు కన్నేశాడు. మరో వ్యక్తి కలిసి కబ్జా చేయడానికి యత్నించగా బాధితుడు సీపీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై సీపీ రంగనాథ్.. డీసీపీ అశోక్‌కుమార్‌తో సమగ్ర విచారణ జరిపించారు. హోంగార్డు భూ ఆక్రమణ నిజమని విచారణలో తేలింది. దీంతో హోంగార్డు, అతడికి సహకరించిన వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారం క్రితం రిమాండ్‌కు పంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్‌కాలనీ ఫేజ్-1లో భూ వివాదం ఫిర్యాదుపై సీపీ విచారణ జరిపించారు. 300 గజాల స్థలం విషయంలో డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్నట్లు డీసీపీ అశోక్‌కుమార్ విచారణలో తేలింది. విచారణ అధికారి ఇరువర్గాల డాక్యుమెంట్లను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి డాక్యుమెంట్లు తెప్పించుకొని విచారణ చేశారు. తండ్రి అమ్మిన తర్వాత కొడుకు మరో వ్యక్తికి డబుల్ రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది.
కేయూసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉషోదయకాలనీలో నాలుగో తరగతి ఉద్యోగులకు సంబందించిన స్థలం తనదేనని ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉద్యోగుల డాక్యుమెంట్లు, ఫిర్యాదుదారుడి డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేసిన స్థానిక పోలీసులు కోర్టులో తేల్చుకోవాలని చెప్పారు. సదరు ఫిర్యాదుదారుడు ఇటీవల సీపీకి ఫిర్యాదు చేశాడు. సీపీ ఆదేశాలమేరకు రెండు రోజుల క్రితం ఇరువర్గాల డాక్యుమెంట్లు ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ చేశాడు. ఫిర్యాదుదారుడు చూపించిన హద్దులు డాక్యుమెంట్ల ప్రకారం లేవని తెలిసింది.
నగరంలోని కేయూసీ, సుబేదారి, హసన్‌పర్తి, హనుమకొండ, ఇంతెజార్గంజ్, మిల్స్‌కాలనీ, ధర్మసాగర్, మడికొండ పోలీసు స్టేషన్ల పరిధిల నుంచి భూ వివాదాలు, ఆక్రమణలపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. వరంగల్ నగరంలో రియల్టర్లు, భూ కబ్జాదారులతో కొంతమంది ఇన్స్పెక్టర్లకు సంబంధాలు ఉన్నట్లు సీపీకి ఫిర్యాదులు వస్తున్నాయి. స్టేషన్లో ఫిర్యాదు చేసే భూ బాధితులను ఎదుటి పార్టీ వ్యక్తులతో రాజీపడాలని ఓ ఇద్దరు సీఐలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. కబ్జాదారులను ముందు పెట్టి, పరోక్షంగా ఆ ఇద్దరు ఇన్స్పెక్టర్లు భూ దందాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. కబ్జాదారులకు వంతపాడుతున్న ఇన్స్పెక్టర్లపై సీపీ ప్రత్యేక నజర్ పెట్టారు. భూ వివాదాల్లో తలదూర్చుతున్న పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తున్నారు.
భూ ఆక్రమణలు, వివాదాలు ఫిర్యాదులపై సమగ్రంగా విచారణ జరిపిస్తున్నాం. ప్రతి రోజు 10కి పైగా భూములకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయి. వీటన్నింటిపై లోతుగా విచారణ చేస్తున్నాం. ఇరువర్గాల డ్యాకుమెంట్లు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ల నుంచి ఆధారాలు సేకరించి, క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. చుట్టు పక్కల వారి నుంచి సాక్షాలు సేకరిస్తున్నాం. కోర్టు పరిధిలో ఉన్న కేసులలపై కోర్టు ఆదేశాలు , రెవెన్యూ రికార్డులు ప్రకారం విచారణ చేస్తున్నాం. కబ్జాలకుపాల్పడే వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇందులో పోలీసు శాఖ అధికారుల ప్రమేయం ఉంటే సహించేది లేదు, వారిపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటాం. ధర్మసాగర్లో భూ ఆక్రమణ కేసులో హోంగార్డు, అతడికి సహకరించిన వ్యక్తిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
– ఏవీ రంగనాథ్, వరంగల్ పోలీస్ కమిషనర్