కమలాపూర్, ఆగస్టు 17: తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ఏం సాయం చేసిందని ఆ పార్టీకి ఓటు వేయా లో చెప్పాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలకు చెప్పాలని ఈటలను ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలు రాజీనామా చేయాలని అడిగా రా? మరి ఎందుకు ఎన్నికలు తెచ్చినవో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని హితవు పలికారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకే రాజీనామా డ్రామా ఆడారని, దీనిని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ పథకం ప్రారంభిస్తే అభినందించాల్సి పోయి విమర్శించడం ఈటల అవివేకానికి నిదర్శనం అన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, రెండు సార్లు మంత్రిని చేసిన కేసీఆర్ ఇప్పుడు చెడ్డోడు అయ్యిండా? అని ప్రశ్నించారు. రాజేందర్ మాట్లాడే ప్రతి మాట ఓ బూటకం, ప్రతి పని ఓ నాటకమని విమర్శించారు. గోడగడియారాలు, కుట్టుమిషన్లు, మందుబాటిళ్లు పంపిణీ చేసే నీకు ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
తెలంగాణకు బీజేపీ ఏం చేసింది?
ఏడేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ర్టానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీ ఇచ్చిందా? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిందా? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందా? ఏం చేసిం దో చెప్పాలని నిలదీశారు. కేంద్రం తెలంగాణ ప్రాజెక్టులపై, నీళ్లపై ఆదిపత్యం కావాలనడం సిగ్గుచేటన్నారు. ఈ విషయమై తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించా రు. మోటర్లకు మీటర్లు పెట్టాలని, రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలు తెస్తే ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీని అమ్ముతున్న కాషాయ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలో చెప్పాలని సూటిగాప్రశ్నించారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొచ్చి ప్రజలు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానన్న మోదీ మాట ఏమైందని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడం మానుకొని ఇప్పటికైనా అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జి డాక్టర్ పీ రవీందర్రావు, సర్పంచ్ల ఫోరం కన్వీనర్ రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం కన్వీన ర్ సంపత్‌రావు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, కో ఆప్షన్ సభ్యుడు చోటేమియా, నాయకులు నవీన్‌కుమార్, ప్రదీప్‌రెడ్డి, శ్రీనివాస్, అశోక్, విజయ్, సమ్మిరెడ్డి పాల్గొన్నారు.