వరంగల్, సెప్టెంబర్ 26 : చారిత్రక వరంగల్ నగరంలో అభివృద్ధి చేసిన భద్రకాళీ బయో డైవర్సిటీ కల్చరల్ పార్కు అబ్బుర పరుస్తున్నదని, రూ.30 కోట్ల నిధులతో రాష్ర్టానికే తలమానికంగా దీన్ని సుందరీకరించారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా భద్రకాళి బండ్‌పై ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టితో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. రూ.2500 కోట్లతో వరంగల్ నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో నగర రూపు రేఖలు మారుతాయన్నారు. కరోనా మహమ్మారితో అభివృద్ధి పనుల్లో కొంత ఆలస్యం జరిగిందన్నారు. ప్రస్తుతం శరవేగంగా పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా భద్రకాళీ బండ్‌ను తీర్చిదిద్దారన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అభివృద్ధిలో సీఎం కేసీఆర్ ముందుకు తీసుకపోతున్నారన్నారు.
ఎడ్యుకేషనల్, హెల్త్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న నగరం రాబోయే రోజుల్లో టూరిజం హబ్‌గా మారుతుందన్నారు. మేయర్ గుండు సుధారాణి మట్లాడుతూ ఈ బండ్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బండా ప్రకాశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నగరం అభివృద్ధి జరుగుతోందన్నారు. వేయిస్తంభాల దేవాలయంలో మహా మండపం నిర్మాణం కోసం రూ.7 కోట్ల మంజూరు చేయించామన్నారు. ఏడాది చివరి నాటికి మండపం నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఖిలావరంగల్‌లో 17 ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నామని ఆయన వివరించారు. కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ సోమవారం నుంచి భద్రకాళీ బండ్ పైకి సందర్శకులను అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో 1.1కిలోమీటర్ల మేరకు బండ్ అభివృద్ధి చేశామని, రెండో దశలో 2.5కిలోమీటర్లు అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. కాగా, భద్రకాళీ బండ్‌పై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వాగత నృత్యంతో ప్రారంభమైన కార్యక్రమాలు దాండియాతో ముగిశాయి. కార్యక్రమంలో హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్‌బాబు, డిప్యూటీ మేయర్ రిజ్వానాషమీమ్, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, కుడా ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.