శాయంపేట, సెప్టెంబర్ 5: రెండు, మూడు రకాల పూల మొక్కలను చూస్తేనే అబ్బా ఎంత బాగున్నాయో అనుకుంటాం. అలాంటిది వందలకొద్దీ ఒక్కచోట కనిపిస్తే ఎలా ఉంటుంది. దేశ, విదేశాలు, హిమాలయాల్లో పెరిగేవి, మనమెప్పుడూ చూడనివే గాక నాసా గుర్తించిన పది రకాల అరుదైన మొక్కలున్నది ఎక్కడో కాదు.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకలోనే. చిన్ననాటి నుంచి మొక్కలపై ఉన్న ఆసక్తితో తన ఇంటినే ప్రయోగశాలగా మార్చేశాడు కొమ్మినేని రఘు అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు. తీరొక్క పూలు, మొక్కలతో ఆ ఇల్లు ఓ పూలతోటలా కనిపిస్తుంది.
చిన్నప్పటి నుంచి మొక్కలంటే రఘుకు ఎంతో ఇష్టం. ఆ ఆసక్తి ఆయన్ను ప్రకృతి ప్రేమికుడిని చేసింది. ఆకట్టుకునే మొక్క ఆయన కంటపడితే చాలు అది ఆయన పెరట్లో ఉండాల్సిందే. అది పక్క ఊరైనా, వేరే దేశమైనా.. చివరికి హిమాలయాలైనా సరే! తన మిత్రులు, తెలిసిన వారి ద్వారా పోస్ట్‌లోనో, ఆన్లైన్లోనో తెప్పించుకుంటాడు. లేకపోతే తానే స్వయంగా వెళ్లి సేకరిస్తాడు. ఇలా ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా రెండు వందల రకాలను ఇరవై ఏళ్లుగా చంటిపిల్లల్లా సాకుతున్నాడు.
ప్రతి మొక్క ప్రత్యేకమే..
ఇక్కడ పెరిగే ప్రతి మొక్క కూడా ప్రత్యేకమే. సుమారు 80కి పైగా కాక్టస్ మొక్కలున్నాయి. దక్షిణ ఆఫ్రికా, ఎడారి ప్రాంతాల్లో ఉండే ఈ ముళ్ల రకం మొక్కలు ఇక్కడ పెరుగుతున్నాయి. ఇది ఇంట్లో విడుదలైన కార్బన్ డయాక్సైడ్ని గ్రహించి.. ఆ తర్వాత మనం పీల్చుకోవడానికి తాజా, శుభ్రమైన ఆక్సిజన్‌గా మారుస్తుంది. ముళ్ల అల్లిక నుంచి ఓ పువ్వు పూయడం ఓ కొత్త అనుభూతినిస్తుంది. తెలుపు, పసుపు, గులాబీ రంగుల్లో పూస్తాయి. వీటితో పాటు అశ్వగంధ, నల్లేరు, శ్రీగంధం, ఉసిరి, తులసి, అజ్వైన్, శంకుపువ్వు, బ్రయోఫిలమ్ సహా పలు ఔషధ గుణాలు కలిగిన మొకలు ఉన్నాయి. సపోట, జామ, మామిడి, అల్లం నేరేడు, సీతాఫలం, అడవి బాదం, వంటి పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. అరుదుగా లభించే డ్రాగన్ ఫ్రూట్, అల్బుకర్ చెట్లూ ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్లో మూడు రకాల చెట్లున్నాయి. ఇవి రేడియేషన్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఔషధ గుణమున్న మొక్కలు అనేకం ఉన్నాయి. ఇంట్లోనే గాక ఇప్పటివరకు రఘు సుమారు 50వేల మొక్కలను వివిధ ప్రాంతాల్లో నాటాడు. ఇటీవల గ్రామానికి వచ్చిన వ్యవసాయశాఖ మంత్రి నిరంజనరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులకు ఇక్కడి అరుదైన మొకలనే బహుమతిగా ఇవ్వగా వారు అభినందించారు.
బ్రహ్మకమలం
మన దేశంలో ఇది అరుదైన మొక. ఓ మిత్రుడు బహూకరించిన ఈ మొక్కకు 2016లో మొదటి పువ్వు పూసింది. తర్వాత ఏటా పూస్తూనే ఉంది. ఈసారి ఒకేసారి 11 పూలు పూశాయి. అరుదుగా పూసే ఈ అందమైన పూలను సంప్రదాయ వైద్యంలోనూ వినియోగిస్తారు. రాత్రివేళ వికసించే స్వభావం ఉన్నందున వీటిని ‘క్వీన్ ఆఫ్ ది నైట్”, ‘లేడీ ఆఫ్ ది నైట్’ ‘నైట్ బ్లూమింగ్ సెరియస్’ అని వివిధ పేర్లతో పిలుస్తారు. మనదేశంలో దీనిని పవిత్రమైన మొకగా పరిగణిస్తారు. ఈ పువ్వు వికసించే సమయంలో చూసే వారు అదృష్టవంతులని నమ్ముతారు.
అశ్వగంధ
విఠానియా సోమ్నిఫెరా. సాధారణంగా అశ్వగంధ అని పిలుస్తాం. ఇంకా ఇండియన్ జిన్సెంగ్, పాయిజన్ గూస్బెర్రీ లేదా వింటర్ చెర్రీ అని వ్యవహరిస్తారు. ఇది సోలనేసి లేదా నైట్‌షేడ్ కుటుంబంలోని వార్షిక సతత హరిత పొద. ఇది భారతదేశం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతుంది.
పెలికాన్ ఫ్లవర్
అరిస్టోలోచియా గ్రాండిఫ్లోరా, పెలికాన్ ఫ్లవర్. ఇది ఒక ఆకురాల్చే తీగ. ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వులలో ఒకటి. ఇది శరీరాన్ని అంతర్గతంగా శుభ్రపరుస్తుంది. అధిక శ్లేష్మం వదిలించుకునేందుకు సహాయపడుతుంది. బెలిజ్ దేశానికి చెందిన ఈ మొకను పదేళ్ల క్రితం ఒక మిత్రుడు బహూకరించాడు. పువ్వులు చాలా అందంగా ఉంటాయి.
నాసా గుర్తించిన పది మొకలు ప్రత్యేకం
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రత్యేకంగా కొన్ని మొకలను గుర్తించింది. ఆ మొకల్లో పది అత్యుత్తమ మొకలు రఘు పెంచుతుండడం విశేషం. వీటిలో న్సై్పడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, స్వార్ట్ ఫెర్న్, అలోవెరా, అగ్లోనెమా, డ్రసీనియా, లేడీ పామ్, ఎలిఫెంట్ లీవ్స్, ఫెల్లోడెండ్రోన్, జెడ్ జెడ్ ప్లాంట్, మొదలైనవి ఉన్నాయి. వీటిని ఇంట్లో పెంచుకుంటే గాలిని శుద్ధిచేసి ఆరోగ్యాన్ని మేలు చేస్తాయని నాసా పేర్కొన్నట్లు తెలిపారు. ప్రత్యేక శ్రద్ధతో మొక్కలను జాగ్రత్తగా పెంచుతున్నాడు.
పెర్షియన్ కార్పెట్
పెర్షియన్ కార్పెట్ కాక్టస్‌ను శాస్త్రీయంగా ఎడితోలియా గ్రాండిస్ అని పిలుస్తారు. పువ్వుల కారియన్ లాంటి వాసన పరాగ సంపరం కోసం ఈగలు, ఇతర కీటకాలను ఆకర్షిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎడారి తోటలలో అలంకారంగా సాగు చేయబడుతుంది. చాలా తేలికైన అధిక శీతాకాలపు ఉష్ణోగ్రతల్లో పెరిగే క్లిష్టమైన మొక. తకువ ఉష్ణోగ్రతల్లో కుళ్లిపోయే అవకాశం ఉంది. దీని కాండం ఇథియోపియా, సోమాలియాలో కూరగాయలుగా తింటారు. మూడేళ్ల క్రితం ఒక మిత్రుడు గుజరాత్ నుంచి పంపించాడు.
ఇరవై ఏండ్లుగా పెంచుతున్నా
చిన్నప్పటి నుంచి నాకు మొకలు పెంచడం అంటే చాలా ఇష్టం. అందుకే ఇవన్నీ సేకరించగలిగాను. మొకలకు మనుషులకు ఉన్నట్లు భావాలు కూడా ఉంటాయని నాకు అనిపిస్తుంది. మొకలు మనతో మాట్లాడుతాయి. ఉదయం, సంధ్యావేళల్లో చిరుగాలితో మనల్ని కవ్విస్తాయి. ప్రేమతో పలుకరిస్తాయి. మొకలకున్న శక్తి ఎలాంటిదంటే.. మనకున్న కొన్ని వ్యసనాల్ని సైతం అవి దూరం చేయగలవు. అందుకే వాటిని జాగ్రత్తగా కాపాడుతున్నా. కేవలం సేంద్రియ ఎరువులు వేస్తా. ఇంట్లో పండిన పండ్లు, కూరగాయలు చాలా రుచిగా ఉంటాయి. పువ్వులు వెదజల్లే సువాసన మరచిపోలేం.
– కొమ్మినేని రఘు, ప్రకృతి ప్రేమికుడు