భూపాలపల్లి టౌన్, ఆగస్టు 17: తాము పుట్టి, పెరిగిన గడ్డ రుణం తీర్చుకున్నారు ఎన్ఆర్ఐలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా దవాఖానకు భారీగా వితరణ అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జీడీ తిరుపతి ప్రత్యేక చొరవతో వారితో మాట్లాడి రూ.30 లక్షలతో అన్ని సౌకర్యాలతో 12 ఐసీయూ పడకల యూనిట్‌ను ఏర్పాటు చేయించారు. కాటారం మండలం బొప్పారం గ్రామానికి చెందిన ఊర నందకిశోర్, శిసాన్రావు దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు. పుట్టిన గడ్డకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇండో అమెరికన్ చారిటబుల్ ట్రస్టు సహకారంతో దవాఖానలో ఐసీయూ యూనిట్‌ను ఏర్పాటు చేయించారు. జిల్లాలోని నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంస్థ బాధ్యత తీసుకుని పనులు పూర్తి చేసింది. ఐసీయూ యూనిట్‌ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పుట్టిన గడ్డకు సేవ చేయాలనే తపన ఉన్న నందకిశోర్ దంపతులను ఎన్ఆర్ఐలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ సొంతగడ్డకు సేవ చేస్తే పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్నట్లు అవుతుందన్నారు. నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంస్థ మధ్యవర్తితత్వం వహించి ఐసీయూ యూనిట్‌ను ఏర్పాటు చేయించడం అభినందనీయమన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతులమీదుగా దవాఖాన ప్రారంభోత్సవం జరుగుతుందని, అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ సీఈవో మయూర్ పట్నాల, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనురాధ, టీం సభ్యులు సుధీర్, కుమార్, తిరుపతి, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, నేతలు బుర్ర రమేశ్, తాటి అశోక్, నాగుల రాజిరెడ్డి, చాట్ల రాములు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.