-వరంగల్, అక్టోబర్ 10(నమస్తేతెలంగాణ):పశు సంపద అభివృద్ధికి ప్రభుత్వం అర్హులకు నాలుగు రకాల యూనిట్లను సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించింది. గొర్రెలు లేదా మేకలు, కోళ్లు, పందుల పెంపకానికి లబ్ధిదారులకు యాభై శాతం సబ్సిడీ అందనుండగా, మార్గదర్శకాలు విడుదల చేసింది. తాజాగా పశుసంవర్ధక శాఖ అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. లబ్ధిదారులకు ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పిస్తున్నది. గొర్రెలు లేదా మేకల యూనిట్ విలువ రూ.కోటి కాగా, రూ.50 లక్షలు సబ్సిడీ ఇవ్వనుంది. కోళ్లు, పందులు, పశుగ్రాసం యూనిట్‌కు 50శాతం సబ్సిడీ అందించనుంది. అర్హులైన వారు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఈనెల 15వరకు అవకాశం ఉన్నది.
పశు సంపద అభివృద్ధికి ప్రభుత్వం మరో పథకాన్ని అమల్లోకి తెచ్చింది. గొర్రెలు లేదా మేకలు, కోళ్లు, పందుల పెంపకానికి లబ్ధిదారులకు యాభై శాతం సబ్సిడీ అందించనుంది. గొర్రెలు లేదా మేకల యూనిట్ విలువ రూ.కోటి కాగా, ప్రభుత్వం 500 గొర్రెలు, 25 పొట్టేళ్లను లేదా 500 ఆడ మేకలు, 25 మగ మేకలను ఇవ్వనుంది. రూ.50 లక్షల సబ్సిడీని రెండు విడుతల్లో విడుదల చేయనుంది. గొర్రెలు లేదా మేకల యూనిట్ పనులు ప్రారంభించగానే తొలి విడుత రూ.25 లక్షలు, పూర్తయ్యాక రెండో విడుత రూ.25 లక్షలు అందజేయనుంది. లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రకాల గొర్రెలు, మేకలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గడ్డి పెంపకం, షెడ్ల నిర్మాణం కోసం కనీసం ఎనిమిది ఎకరాల భూమి కలిగి ఉన్న వారు దరఖాస్తు చేయడానికి అర్హులు. గడిచిన మూడేళ్లు ఆదాయపన్ను, ఆరు నెలలకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్ను జత చేయాల్సి ఉంటుంది. రూ.కోటి యూనిట్ విలువలో రూ.50 లక్షలు బ్యాంకు రుణంగా ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు రుణం అవసరం లేదనుకునే వారికి బ్యాంకు కాన్సెంట్ ఇస్తే సరిపోతుంది. సొంత భూమి లేకపోతే కనీసం ఎనిమిది ఎకరాల భూమి లీజుకు తీసుకున్నట్లు డాక్యుమెంట్లు దరఖాస్తుతో పాటు జతచేయాలి. ఎనిమిది ఎకరాల భూమిలో కనీసం ఐదెకరాలు గడ్డి పెంపకానికి కేటాయించాల్సి ఉంటుంది. షెడ్లు నిర్మించేందుకు రెండు ఎకరాలు అవసరం. సబ్సిడీని లబ్ధిదారులకు కాన్సెంట్ ఇచ్చిన బ్యాంకులో ప్రభుత్వం జమ చేయనుంది. గొర్రెలు లేదా మేకల పెంపకం కోసం ఒకరికి సబ్సిడీపై రూ.కోటి యూనిట్ అందజేసే పథకం అమల్లోకి రావటం ఇదే తొలిసారి.
కోళ్ల యూనిట్‌కు రూ.50 లక్షలు..
సబ్సిడీపై కోళ్ల యూనిట్లను అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో యూనిట్ విలువ రూ.50లక్షలు. ఇందులో యాభై శాతం రూ.25 లక్షలు సబ్సిడీ. షెడ్ల నిర్మాణం కోసం సొంత భూమి కలిగి, గడిచిన మూడేళ్లు ఆదాయ పన్ను చెల్లించిన వారు అర్హులు. ఆరు నెలల బ్యాంకు స్టేట్మెంటును కూడా జత చేయాలి. లబ్ధిదారులు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ యూనివర్సిటీ నుంచి కోడి పిల్లలు, గుడ్లను పొందవచ్చు. లబ్ధిదారులు కోళ్ల పెంపకంలో మూడు రకాలను ఎంచుకునే అవకాశం ఉంది. పందుల అభివృద్ధికి ప్రభుత్వం యూనిట్లను ప్రకటించింది. ఒక్కో యూనిట్ కింద లబ్ధిదారులకు 100 ఆడ పందులు, 25 మగ పందులను ఇవ్వనుంది. యూనిట్ విలువ రూ.60 లక్షలు. ఇందులో యాభై శాతం రూ.30 లక్షలు సబ్సిడీ. సీమ జాతి పందులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
పశుగ్రాసం యూనిట్..
గొర్రెలు లేదా మేకలు, కోళ్లు, పందుల యూనిట్లతో పాటు పశువుల దాణా, పశుగ్రాస అభివృద్ధికి కూడా స బ్సిడీపై రుణాలు అందజేయనుంది. మాగుడు గడ్డి, గడ్డి కోసే, చుట్టే యంత్రం, ఇతర మిషన్ల యూనిట్‌కు రూ. కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందులో యాభై శాతం సబ్సిడీ కింద రూ.50 లక్షలు లబ్ధిదారులకు ఇవ్వనుంది. పశువుల దాణా, పశుగ్రాస యూనిట్ పొందడానికి భూమి కలిగి ఉన్న వారు అర్హులు. కోళ్లు, పందులతో పాటు పశువుల దాణా, పశుగ్రాస యూనిట్లకు ప్ర భుత్వం ఇంత పెద్ద మొత్తంలో రుణాలు, సబ్సిడీ ఇస్తుండటం ఇదే మొదటిసారి. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ పథకంపై విస్తృత ప్రచారం చేపట్టారు. గొర్రెలు లేదా మేకలు, కోళ్లు, పందులు, పశువుల దాణా, పశుగ్రాసం యూనిట్లపై జిల్లాలో అవగాహన కల్పిస్తున్నారు.
15 వరకు దరఖాస్తుల స్వీకరణ…
పశు సంపద అభివృద్ధి ప థకం కోసం అర్హులైన వారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లోదరఖాస్తు చేయవచ్చు. ఆఫ్‌లైన్ లో దరఖాస్తులను పశు సం వర్ధకశాఖ జిల్లా అధికారి కా ర్యాలయంలో అందజేయా లి. ఈ సబ్సిడీ పథకం పొందడానికి ఏ కులం వారై నా అర్హులే. నిబంధనల ప్రకారం ఆదాయ పన్ను చె ల్లింపు, బ్యాంకు స్టేట్మెంటు, భూమి పత్రాలు, ఆ ధార్కార్డు తదితర ప్రతులను దరఖాస్తు వెంట జత చేయాలి. గొర్రెలు లేదా మేకలు, కోళ్లు, పందులు, పశు దాణా, పశుగ్రాసం యూనిట్ల కోసం డీపీఆర్ కూడా దరఖాస్తుతో పాటే అందించాలి. దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఈ నెల పదిహేనో తేదీ.