వరంగల్, నవంబర్ 1(నమస్తేతెలంగాణ) : పత్తి ధర పైపైకి ఎగబాకుతున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలు పు మేరకు వానకాలం పత్తి పంట సాగు చేసిన రైతులు ప్రస్తుతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధర పెరుగుతుండడంతో ఆనందం వెలిబుచ్చుతున్నారు. మార్కెట్లో పత్తికి ప్రభుత్వ మద్దతు ధరకు మించి ధర పలుకుతున్నది. సోమవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తికి గరిష్ఠ ధర రూ.8,500 పలికింది. ఈ మార్కెట్ లో ఇది రికార్డు ధర. మున్నెన్నడూ ఇంత ధర లేదు. గత ఆగస్టులో పాత పత్తికి గరి ష్ఠ ధర రూ.8,230. మార్కెట్లో పత్తికి ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారు. రూ.10 వేలకు చేరే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. ప్రస్తుతం క్వింటాల్ లాంగ్ పత్తికి మద్దతు ధర రూ.6,025, మీడియం పత్తికి రూ.5,726. గత ఏడాది లాంగ్ పత్తికి మద్దతు ధర రూ.5,825, మీడియం పత్తికి రూ.5,515. ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాల్ లాంగ్ పత్తికి మద్దతు ధరను రూ.200, మీడియం పత్తికి రూ.211 పెంచింది.
ఆరంభం నుంచి పైపైకి..
అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండడం వల్ల ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచి పత్తి ధర హైక్ అవుతున్నది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు గత సెప్టెంబర్ చివరి వారం నుంచి పత్తి రావ డం మొదలైంది. ప్రారంభం నుంచి కూ డా ఈ మార్కెట్లో పత్తికి ధర ప్రభుత్వ మద్దతు ధరకు మించి పలుకుతున్నది. అ క్టోబర్ 1న ఇక్కడ పత్తికి క్వింటాల్‌కు గరి ష్ఠ ధర రూ.7,400. అక్టోబర్ 4న రూ.7,200, ఐదున రూ.7,160, ఏడు, ఎనిమిది తేదీల్లో రూ.7,235, పదకొండున రూ.7,220, పన్నెండున రూ.7,335 పలికింది. 20వ తేదీన రూ.7,350, 21న రూ.7,450, 22న రూ.7,550కి ఎగబాకింది. 25న రూ.7,900కి పెరిగింది. 26న మరింత పెరిగి రూ.7,960కి చేరింది. ఇదేరోజు కనీస ధర రూ.7 వేలు పలకడం విశేషం. 26వ తేదీ నుంచి మార్కెట్లో కనీస ధర రూ.7 వేలకు తగ్గడం లేదు. 27న రూ.8 వేలు దాటింది. అనూహ్యంగా ధర రూ.8,105 పలికింది. 28వ తేదీన రూ.8,155కి చేరింది. ఊహించని రీతిలో సోమవారం ఈ మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.8,500 పలికింది. ఎనుమాముల మార్కెట్ చరిత్రలో పత్తికి ఇది రికార్డు ధరగా అధికారులు చెబుతున్నారు. గత ఆగస్టులో పాత పత్తికి గరిష్ట ధర రూ.8,230 పలికింది.
ధర మరింత పెరిగే చాన్స్..
అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డి మాండ్ ఉంది. వర్షాల వల్ల ఇతర రాష్ర్టా ల్లో పత్తి దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. వివిధ దేశాలు పత్తిని దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో పత్తి గింజలకు ధర పెరుగుతున్నది. గతంలో క్వింటాల్ పత్తి గింజల ధర రూ.1,200 నుంచి రూ.1,400 వర కు ఉండేది. ధర క్వింటాల్‌కు రూ.2,100 మించిన దాఖలాల్లేవు. ఇప్పుడు క్విం టాల్‌కు రూ.3,300 పలుకుతున్నది. 170 కిలోలతో కూడిన పత్తి బేలు ధర రూ.11.65 లక్షలకు పెరిగింది. మార్కెట్లో ఆయిల్దీ ఇదే పరిస్థితి. మార్కెట్ పరిస్థితిని పరిశీలిస్తున్న విశ్లేషకులు పత్తికి ధర మరింత పెరుగడం ఖాయమని చెబుతున్నారు. దీంతో రైతులు పత్తిని ఎప్పటికప్పుడు అమ్మకానికి మార్కెట్‌కు తరలిస్తున్నారు. గతంలో ధర తక్కువగా ఉన్న సమయంలో పత్తిని ఇండ్లలో నిల్వ చేసి అన్ సీజన్లో ధర పెరిగాక మార్కెట్‌కు తరలించేవారు.
ఇప్పుడు మంచి ధర లభిస్తుండడంతో వెంటవెంటనే పత్తిని మార్కెట్‌కు తెచ్చి అమ్ముతున్నారు. సోమవారం ఎనుమాముల మార్కెట్‌కు సుమారు ఐదు వేల క్వింటాళ్ల పత్తి వచ్చింది.