పోచమ్మమైదాన్, అక్టోబర్ 12: నగర ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తున్న వరంగల్ దేశాయిపేట రోడ్డులోని ప్రతాపరుద్ర ఫిల్టర్‌బెడ్ పచ్చని చెట్లు, మొక్కలతో కళకళలాడుతోంది. ఫిల్టర్‌బెడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏటేటా నాటుతున్న మొక్కలతోపాటు హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి నందనవనాన్ని తలపిస్తున్నది. పెద్ద వృక్షాలు, పండ్లు, నీడనిచ్చే చెట్లు, రంగురంగుల పూల మొక్కలు, బంగారు వర్ణంలో ఉండే ఆర్నమెంట్ మొక్కలు అక్కడికి వెళ్లిన వారిని ముగ్ధులను చేస్తున్నాయి.
పోచమ్మమైదాన్, అక్టోబర్ 12 : వరంగల్ దేశాయిపేట రోడ్డులోని ప్రతాపరుద్ర ఫిల్టర్‌బెడ్ పచ్చని చెట్లతో కళకళలాడుతున్నది. నగర ప్రజలకు స్వచ్ఛమైన నీటితోపాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నది. ఈ ఫిల్టర్‌బెడ్‌లో అడుగుపెట్టగానే అడుగడుగునా ఆకుపచ్చని చెట్లు, మొక్కలు దర్శనమిస్తాయి. నగర ప్రజల తాగునీటి కోసం ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్‌ను 1985లో ప్రారంభించారు. దాదాపు 14ఎకరాల స్థలంలో ఉన్న ఫిల్టర్‌బెడ్ ఖాళీ స్థలంలో 1997 నుంచి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఏటేటా సుమారు 50 మొక్కల చొప్పున నాటుతూ వాటిని సంరక్షిస్తున్నారు. దీనికి తోడు 2015 నుంచి హరితహారం మొక్కలను విరివిగా నాటడంతో ఇప్పుడు ఫిల్ట్ర్బెడ్ ఆవరణ వేలాది మొక్కలు, చెట్లతో నందనవనాన్ని తలపిస్తున్నది. ఫిల్టర్ బెడ్ ఆవరణలోకి అడుగు పెట్టగానే పచ్చనిచెట్లే మనకు స్వాగతం పలుకుతాయి. దారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు, చక్కని ఫౌంటేన్, గార్డెన్ కనువిందు చేస్తాయి. ఇందులోకి వచ్చినవారు పచ్చనిచెట్ల మధ్యన ప్రశాంతతతోపాటు కాలుష్య రహిత వాతావరణాన్ని ఆస్వాదించి వెళ్తుంటారు.
అన్ని రకాల పండ్లు, పూలు, కాయగూరల చెట్లు..
దాదాపు పదెకరాల స్థలంలో వనంలా మారిన ఫిల్టర్‌బెడ్ ఆవరణలో అన్ని రకాల పూలు, పండ్లు, కాయగూరల చెట్లు దర్శనమిస్తాయి. దీనికి తోడు వాణిజ్యపరమైన చెట్లు కూడా ఏపుగా పెరిగి దట్టంగా ఒక వనాన్ని తలపిస్తుంది. ఇందులో టేకు, కొబ్బరి, అశోక, మామిడి, జామ, బత్తాయి, నారింజ, సపోట, అంజీర్, చీమచింత, దానిమ్మ, సీతాఫలం, నేరేడు, బొప్పాయి, నిమ్మ, ఖర్జూరతో పాటు టమాట, వంకాయ, పలు రకాల ఆకుకూరల మొక్కలు ఉన్నాయి. ముఖ్యంగా చెట్ల మధ్యలో బంగారాన్ని తలపించే విధంగా ఆర్ణమెంట్ మొక్కలు కూడా కనువిందు చేస్తున్నాయి. అధికారులు ప్రత్యేక చొరవతో వీటిని రక్షించడం వల్లనే అన్ని కాలాల్లో ఇక్కడ పచ్చదనం వెల్లివిరుస్తుంది. ఇక్కడ చెట్లు, మొక్కలను కాపాడడానికి ఇద్దరు రెగ్యులర్, మరో ఇద్దరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది నిత్యం చేస్తున్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా హరితహారంలో భాగంగా ఏటేటా ఫిల్టర్‌బెడ్ ఆవరణలో వందలాది మొక్కలు నాటి, వాటిని కాపాడుతున్నాం. తెలంగాణలో లభించే అన్ని రకాల చెట్లు ఇక్కడ ఉన్నాయి. మొక్కల రక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బంది పని చేస్తున్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటండి…కాలుష్యాన్ని నివారించాలి.
అందరి సహకారంతో మొక్కల సంరక్షణ
అందరి సహకారంతో ఫిల్టర్ బెడ్ ఆవరణలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇక్కడకు వచ్చే ప్రతిఒక్కరూ చెట్లనీడన సేదతీరుతూ ప్రశాంత వాతావరణంలో గడుపుతారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలన్నీ బతికి పెద్ద వృక్షాలుగా మారాయి. అధికారులు, సిబ్బంది తోడ్పాటుతో నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటితో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తున్నామనే తృప్తి ఉంది.
– ఎస్. కార్తీక్ రెడ్డి ఏఈ