చేయూతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
చేనేత మిత్ర, క్యాష్ క్రెడిట్ పథకాలూ..
కొండా లక్ష్మణ్ బాపూజీ పేర అవార్డులు
నేడు జాతీయ చేనేత దినోత్సవం
పోచమ్మమైదాన్, ఆగస్టు 6: భారత స్వాతంత్య్ర సముపార్జనకు ఒక సాధనంగా నిలిచిన చేనేత రంగానికి తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తున్నది. కార్మికులకు అనేక రకాల పథకాలు ప్రవేశపెడుతూ అండగా ఉంటున్నది. అదేవి ధంగా చేనేతను ప్రోత్సహించేందుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేర అవార్డులు అందజేస్తున్నది. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతపై కథనం.
సీఎం కేసీఆర్ చేనేత కార్మికుల అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయిస్తూ చేతి నిండా పని దొరికేలా చర్యలు చేపడుతున్నారు. గతంలో మాదిరిగా పస్తులు, ఆత్మహత్యలు చేసుకోకుండా వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. పండుగలు, పర్వదినాల్లో ప్రజలకు పంపిణీ చేయడానికి చీరెలు, ధోవతులు, ఇతర వస్ర్తాలను ఉత్పత్తులు చేసేలా పని కల్పిస్తున్నారు. తాజాగా రైతు బీమా మాదిరిగా నేత కార్మికుల కోసం చేనేత బీమా కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 33 చేనేత సహకార సంఘాలు పనిచేస్తుండగా, 2,380 మంది నేత కార్మికులు ఉన్నారు. మార్కెట్లో గిరాకీ ఉండే షర్టింగ్, షూటింగ్, తదితర తయారీలో తగిన నైపుణ్యం పెంచడానికి కార్మికులకు శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 11 సంఘాలను ఎంపిక చేసి 122 మంది కార్మికులకు అధునాతన మగ్గాలను ఉచితంగా అందజేశారు. వీరికి 45 రోజులపాటు శిక్షణ ఇచ్చారు.
నేతన్నకు చేయూత
‘నేతన్నకు చేయూత’(థ్రిఫ్ట్ ఫండ్) పథకాన్ని 2017 సంవత్సరం నుంచి ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ఇందులో కార్మికులు బ్యాంకులో నెలకు రూ.8 చెల్లిస్తే, ప్రభుత్వం రెండింతలు రూ.16 వరకు జమ చేస్తుంది. మూడేళ్లు వర్తించే ఈ పథకం గడువు తర్వాత నేరుగా నేతన్నల ఖాతాలో డబ్బులు జమవుతాయి. అయితే ఇటీవల కొవిడ్ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని మూడేళ్లు పూర్తి కాకముందే డబ్బులు అందేలా ఏర్పాట్లు చేశారు. దీంతో 2,306 మంది నేత కార్మికులు సుమారు రూ. రెండు కోట్ల జమ చేస్తే, రూ.4 కోట్ల వరకు డబ్బులు జమ అయ్యాయి.
చేనేత మిత్ర..
చేనేత మిత్ర పథకం ద్వారా నేత కార్మికులు కొనుగోలు చేసే రంగులు, రసాయనాలు, కిరోసిన్ తదితర వాటితో పాటు యారన్ సబ్సిడీ ఇస్తారు. ఇందులో వీవర్స్, అనుబంధ కార్మికుల కోసం 35 శాతం, మరో 5 శాతం సబ్సిడీ చేనేత సంఘాలకు అందజేస్తారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 1712 మంది కార్మికులు రూ.78లక్షల, 12వేల లబ్ధి పొందారు.
క్యాష్ క్రెడిట్ పథకం..
చేనేత సంఘాల బలోపేతం కోసం రుణ పరిమితిని కేంద్ర సహకార బ్యాంకు మంజూరు చేస్తుంది. 2021-2022 సంవత్సరంలో 26 సంఘాలకు రూ.2కోట్ల 66లక్షలకు ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా ఆయా సంఘాలు బ్యాంకులకు కేవలం పావలా వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన ముప్పావు వంతు వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం 24 సంఘాలకు రూ. 14లక్షల 73వేలను కేంద్ర సహకార బ్యాంకులో క్యాష్ క్రెడిట్ కోసం జమ చేసింది.
కొండా లక్ష్మణ్ బాపూజీ పేర పురస్కారాలు..
కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాల్లో భాగంగా 2017 సంవత్సరం నుంచి ఉత్తమ నేతన్నలను ఎంపిక చేసి, రూ.25వేల నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం అందజేస్తున్నారు. నేడు హైదరా బాద్లో జరుగనున్న కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ అవార్డులను అందజేయనున్నారు.
నేడు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా..
గత ఏడాది పూర్తయిన నేతన్నకు చేయూత(థ్రిఫ్ట్ ఫండ్)ను తిరిగి మంత్రి కేటీఆర్ నేడు హైదరాబాద్లో ప్రారంభించనున్నారు. అయితే ఈ పథకం సెప్టెంబర్ 2 నుంచి అమలులోకి వస్తుంది. అలాగే చేనేత దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని జడ్పీ హాల్లో నేడు ఉదయం 10.30 గంటలకు సమావేశం జరుగనుంది.
సీఎం కేసీఆర్ కడుపు సల్లగుండ..
సీఎం కేసీఆర్ వచ్చినంక కొత్త పథకాలు వస్తున్నయ్. పుట్టినప్పటి నుంచి చేనేత వృత్తిపై ఆధారపడి బతుకుతున్న. తాతల నాడు ఉన్న పనులు కాకుండా కొత్త కొత్త ఉత్పత్తులను చేయిస్తున్నారు. నేను వృద్ధుడిని అయినప్పటికీ కొత్త మగ్గాల ద్వారా షర్టింగ్, షూటింగ్ నేస్తాను. ఉత్పత్తికి తగినట్లు మార్కెట్ కల్పించాలి.