కమలాపూర్, కమలాపూర్ రూరల్ అక్టోబర్ 6 : పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం ఉందా? అని మంత్రి హరీశ్‌రావు బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను నిలదీశారు. దమ్ముంటే ధరలు తగ్గిస్తామని చెప్పి ప్రజలను ఓటడిగేందుకు రావాలని సవాల్ విసిరారు. బుధవారం కమలాపూర్ మండలంలోని గూడూరులో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ ముదిరాజ్, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కారు ఎక్కించి చంపిన బీజేపీ ప్రభుత్వానికి ఓటెందుకు వేయాలో? ప్రజలు ఆలోచించాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పథకాలు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. అభివృద్ధిలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతు బంధు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. అభయహస్తం పెన్షన్ కోసం చెల్లించిన మహిళలకు వడ్డీతో సహా చెల్లించి, రూ.2వేల పెన్షన్ ఇచ్చేందుకు సీఎం ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.
స్వార్థం కోసమే ఈటల రాజీనామా
బీజేపీ నేత ఈటల రాజేందర్ ఇప్పటి వరకు రాజీనామా ఎందుకు చేశాడో చెప్పకుండా మొసలికన్నీరు కారుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్ వంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయో? లేవో? చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడి ప్రభుత్వాలు రూ.600ల కంటే పింఛన్ ఎక్కువ ఇవ్వడం లేదని తెలిపారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఇప్పటి వరకు నియోజకవర్గానికి ఒక్క రూపాయి పనిచేసిన దాఖలాలు లేవన్నారు. బతుకమ్మ పండుగ కానుకగా గ్యాస్ సిలిండర్‌పై బీజేపీ ప్రభుత్వం రూ.15లు పెంచిందని ఎద్దేవా చేశారు. ఈటల కార్చే మొసలికన్నీళ్లకు ప్రజలు మోసపోవద్దని కోరారు. ఆయన ఇచ్చే రూపాయి బొట్టుబిళ్లలకు ఓటేస్తరా? కల్యాణలక్ష్మికి ఓటేస్తరా? కుట్టుమిషన్‌కు ఓటేస్తరా? కేసీఆర్ కిట్టుకు ఓటేస్తరా? 80 రూపాయల గొడుగుకు ఓటేస్తరా? రైతుబంధుకు ఓటేస్తరా? ఆలోచన చేయాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు గెలిస్తే నియోజకవర్గంలో సొంత స్థలాలున్న పేదలకు ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ కనుమరుగైందని, ఇక ఉన్నవి టీఆర్ఎస్, బీజేపీ మాత్రమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి డాక్టర్ పేరియాల రవీందర్రావు, సర్పంచ్ అంకతి సాంబయ్య, పీఏసీఎస్ చైర్మన్ సంపత్‌రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, కేడీసీసీబీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సంపత్‌రావు, నాయకులు పాక రవీందర్, వెంకటేశ్వర్‌రెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, పింగిళి ప్రదీప్‌రెడ్డి, కృష్ణప్రసాద్, సంపత్‌రావు, నవీన్‌కుమార్, మాడిశెట్టి చంద్రశేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉద్యమ స్ఫూర్తిని చాటాలి
బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నది టీఆర్ఎస్. రానున్న ఉప ఎన్నికలో ఉద్యమ స్ఫూర్తిని చాటి మద్దతు ఇవ్వాలి. ఎలాంటి ఆందోళనలు, దరఖాస్తులు లేకుండానే బీసీ, బడుగు బలహీన వర్గాలకు పదవులు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. ఉమ్మడి రాష్ట్రంలో కనుమరుగైన కుల వృత్తులను ముఖ్యమంత్రి ఆదరించి జీవం పోసిండు. రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్‌లకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది. గొల్ల కురుమలకు గొర్రెలు పంపిణీ చేసి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నది. అన్ని వర్గాల ప్రజలకు పథకాలు అందిస్తున్నది. 18 ఏండ్లు నిండిన ప్రతి ముదిరాజ్ బిడ్డకు సహకార సంఘాల్లో సభ్యత్వం కల్పిస్తాం
అమ్ముడుపోయిన టీపీసీసీ చీఫ్
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రూ.25 కోట్లకు అమ్ముడు పోయాడు. బీజేపీతో కుమ్ముక్కై స్థానికేతర అభ్యర్థిని బరిలోకి దింపాడు. ఈటల పదవిలో ఉన్నప్పుడు గ్రామానికి రూ.పది లక్షలు కూడా కేటాయించలేదు. చేతిలో నిధులు ఉన్నా అభివృద్ధిని కనీసం పట్టించుకోలే. ఆయన వెళ్లిన తర్వాత గ్రామాలకు మోక్షం లభించింది. అభివృద్ధి బాట పడుతున్నయ్. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.