వరంగల్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలోనే విప్లవాత్మకంగా మొదలైన దళితబంధు పథకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు జరిగాయి. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సీఎం కేసీఆర్కు పాలాభిషేకాలు చేశారు. అలాగే దళిత ఉద్యోగుల కుటుంబాలకు దళితబంధు పథకం వర్తింపజేయడంపై ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో కేసీఆర్కు కృతజ్ఞతా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకూ పథకం వర్తింపజేయడం గొప్ప విషయమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. సంక్షేమ పథకాల్లో దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని వారు కొనియాడారు. ఉద్యోగ సంఘాలతో పాటు అన్ని మండలాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి.
దళిత బిడ్డల్లో సంబురం..
ప్రతి దళిత కుటుంబానికి నేరుగా రూ.10 లక్షల సాయం అందించే పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి వేదికపై సీఎం కేసీఆర్ ప్రారంభించి పథకం అమలుతీరును అందరికీ వివరించారు. ఇన్నాళ్లూ ఈ పథకం అమలు ఎలా ఉంటుందోనని వ్యక్తమైన సందేహాలకు తెరదించారు. ప్రతి దళిత కుటుంబానికి ప్రభుత్వం తరపున సాయం అందుతుందని స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్మెంట్ ఉద్యోగుల కుటుంబాలకు సాయం చేస్తామ ని చెప్పారు. దళితబంధు పథకానికి నిబంధనలు ఉండవని, లబ్ధిదారులు ఇష్టమైన రంగంలో పెట్టుబడి పెట్టుకోవచ్చని స్పష్టం చేశారు. అనుభవం ఉన్న రంగంలో పెట్టుబడి పెట్టుకోవచ్చి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే సాయంతో పెట్టుబడి పెట్టుకుని వృద్ధిలోకి వచ్చేలా అధికార యంత్రాగం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దళితబంధు పథకాన్ని ప్రారంభించడంతో పాటు అమలు తీరును అందరికీ అర్థమయ్యేలా వివరించడంతో ప్రజలకు పూర్తి స్పష్టత వచ్చింది. రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు పథకం అమలవుతుందని స్పష్టంగా చెప్పడంతో అందరిలోనూ భరోసా కలిగింది. అందుకు అన్ని చోట్ల సంబురాలు జరుగుతున్నాయి.
దళిత బాంధవుడు కేసీఆర్
భారతదేశంలో 75 ఏండ్లలో ఏ నాయకుడూ చేయని, ఎవరూ ఊహించని అద్భుతమైన పథకానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు. దళితబంధు పథకం దేశానికి దిక్సూచిగా మారబోతున్నది. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబంలో ఈ పథకం వెలుగులు నింపుతుంది. ఈ పథకంతో దళితులు ధనికులు కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. పేదలకు అందిన తర్వాత ఉద్యోగులకు, రిటైర్డ్ అయిన వారికీ పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం హర్షణీయం. దళితబంధుతో కేసీఆర్ దేశంలోనే చరిత్ర సృష్టించబోతున్నారు.
అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్
దళితుల ఆర్థిక అభివృద్ధికి ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో సీఎం కేసీఆర్ దళితులకు అభినవ అంబేద్కర్ అయ్యారు. రైతుబంధు మాదిరిగా దళితబంధు పథకాన్ని కూడా దళిత ఉద్యోగులందరికీ వర్తింపజేయడం గొప్ప విషయం. ఈ పథకంతో సీఎం కేసీఆర్ దళితుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.