తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ ఓడీఎఫ్ ప్లస్‌గా మార్చాలని నిర్ణయించింది. ఓడీఎఫ్ ప్లస్ అంటే ఆయా గ్రామంలోని ప్రతి ఇంటి ఆవరణలో మరుగుదొడ్డితో పాటు ఇంకుడుగుంత ఉండాలి. గ్రామ పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం తదితర సంస్థల్లోనూ వీటిని నిర్మించాలి. డ్రెయిన్ నీరు గ్రామంలో నిల్వకుండా బయటకు వెళ్లేలా కమ్యూనిటీ ఇంకుడు గుంతలు కూడా ఉండాలి. గ్రామంలో అవసరమైన ప్రదేశంలో కమ్యూనిటీ శానిటరీ టాయిలెట్స్ నిర్మించాలి. ఇంటింటి నుంచి సేకరించే చెత్త నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి ఆయా గ్రామంలో నిర్మించిన డంపింగ్‌యార్డుకు తరలించాలి. తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ, పొడి చెత్తలోని ప్లాస్టిక్‌తో పాటు ఇతర వస్తువులను రీసైక్లింగ్ చేయడం ద్వారా స్థానిక జీపీకి ఆదాయం సమకూర్చాలి. ఇలా వంద శాతం పనులు జరిగిన గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్‌గా ప్రకటించాలని ఇటీవల ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు తొలి విడుత మండలానికో రెండు చొప్పున జిల్లాలో 22 గ్రామ పంచాయతీలను సెలెక్ట్ చేశారు. వచ్చే మార్చి నెలాఖరువరకు వీటిని ఓడీఎఫ్ ప్లస్‌గా ప్రకటించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.
22 పంచాయతీలు ఇవే..
ఇప్పటికే జిల్లాలో పారిశుధ్య నిర్వహణలో ప్రశంసలు పొం దుతున్న గ్రామాల్లో మొదట 22 జీపీలను మోడల్ విలేజీలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు నిర్ణయించారు. గీసుగొండ మండలంలోని మరియపురం, గంగదేవిపల్లి, నల్లబెల్లి మండలం కన్నారావుపేట, బుచ్చిరెడ్డిపల్లె, దుగ్గొండి మండలం బొబ్బరోనిపల్లి, శివాజీనగర్, రాయపర్తి మండలం రాగన్నగూడెం, పన్యానాయక్తండా, చెన్నారావుపేట మండలం కల్నాయక్తండా, తిమ్మరాయినిపహాడ్, ఖానాపురం మండలం రాగంపేట, కీర్యాతం డా, నెక్కొండ మండలం అప్పల్రావుపేట, అమీన్‌పేట, సంగెం మండలం గాంధీనగర్, కొత్తగూడెం, నర్సంపేట మండలం మాదన్నపేట, ముగ్ధుంపురం, పర్వతగిరి మండలం అనంతారం, నారాయణపురం, వర్ధన్నపేట మండలం కడారిగూడెం, నల్లబెల్లి గ్రామ పంచాయతీలు ఓడీఎఫ్ ప్లస్ కోసం అధికారులు ఎంపిక చేసిన పంచాయతీల్లో ఉన్నాయి. ఈ గ్రామాల్లో అధికారులు పంచాయతీ సిబ్బందితో కలిసి మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, కమ్యూనిటీ శానిటరీ టాయిలెట్స్, డంపింగ్‌యార్డుల వినియోగం, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, డంపింగ్‌యార్డుకు తరలింపు, తడి, పొడి చెత్తను వేరు చేయడం, వర్మీ కంపోస్టు తయారీ తదితర అంశాలపై సర్వే జరిపారు. ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇండ్లు, ప్రభుత్వ సంస్థల భవనాలు ఎన్ని?, వాటిలో ఎన్ని ఇండ్లు, ప్రభుత్వ సంస్థల్లో మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు ఉన్నాయి?, ఇంకా ఎన్ని ఇండ్లు, సంస్థల ఆవరణలో నిర్మించాలి?, కమ్యూనిటీ శానిటరీ టాయిలెట్స్ ఎక్కడ చేపట్టాలి? అనేది గుర్తించారు. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేశారు. 22 జీపీలను మూడు విడుతల్లో ఓడీఎఫ్ ప్లస్‌గా ప్రకటించేందుకు నిర్ణయించారు.
ఓడీఎఫ్ ప్లస్‌పై సమావేశాలు… ఎం సంపత్‌రావు, డీఆర్డీవో, వరంగల్ జిల్లా
మూడేళ్ల క్రితం ప్రభుత్వం జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించింది. ఇప్పుడు ఓడీఎఫ్ ప్లస్ కోసం మోడల్ విలేజీలుగా తయారు చేయడానికి జిల్లాలో 22 జీపీలను సెలెక్ట్ చేసింది. ఈ పంచాయతీల పరిధిలోని ఇండ్లలో ఇప్పటికే మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు ఉన్నాయి. లేని ఇండ్లతో పాటు ప్రభుత్వ సంస్థల్లోనూ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించాల్సి ఉంది. ఇతర గ్రామాల నుంచి జనం వచ్చి వెళ్లే గ్రామాల్లో కమ్యూనిటీ శానిటరీ టాయిలెట్స్ నిర్మించాలి. మురుగునీరు నిల్వ ఉండకుండా ఆయా గ్రామంలో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు కూడా నిర్మించాల్సి ఉంటుంది. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ, రీసైక్లింగ్‌తో పంచాయతీకి ఆదాయం సమకూర్చాలి. ఇందుకోసం సర్పంచ్ల సహకారం అవసరం. ఈ నేపథ్యంలో ఈ గ్రామాల సర్పంచ్‌లతో కలెక్టర్ బీ గోపి స్వయంగా మాట్లాడారు. ఈ గ్రామాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీల కార్యదర్శులతో రెండు మూడు రోజుల నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నాం.