వరంగల్, నవంబర్ 5(నమస్తేతెలంగాణ) : ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణలో ఓ గ్రామం వద్ద అక్రమాలు చోటుచేసుకున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సేకరించిన భూములకు అధికారులు స్థానికంగా ఉన్న భూముల ధరలకంటే ఎక్కువ ధర నిర్ణయించి చెల్లింపులు జరిపినట్లు సమాచారం అందింది. తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు భూసేకరణలో జరిగిన ఆక్రమాలపై తాజాగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఆక్రమాలు నిజమేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. వరంగల్‌లో ఖమ్మం రోడ్డులోని నాయుడు పెట్రోల్‌బంక్ నుంచి రంగశాయిపేట, ఖిలావరంగల్, గొర్రెకుంట మీదుగా ఎనుమాముల గ్రామం వరకు ఐఆర్ఆర్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నాయుడు పెట్రోల్ బంక్ నుంచి 200 అడుగుల వెడల్పుతో ఎనుమాముల వరకు సుమారు 13 కి.మీ. భూసేకరణ చేపట్టింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంటు అథారిటీ(కుడా) రిక్విజిషన్ ప్రకారం రెవె న్యూ శాఖ అధికారులు భూసేకరణ జరుపుతున్నారు. ఇప్పటికే కొన్ని భూములను సేకరించారు. వీటి యజమానులకు చెల్లింపులు కూడా జరిపారు.
సగటు ధర కంటే ఎక్కువ రేటు..
విశ్వసనీయ సమాచారం ప్రకారం భూ సేకరణలో వరంగల్ మండలంలోని ఓ గ్రామం వద్ద అక్రమాలు జరిగాయి. ఏడాదిన్నర క్రితం ఇక్కడ కొన్ని ఎకరాల భూములను ఐఆర్ఆర్ కోసం అధికారులు సేకరించా రు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేకరించే భూములకు రెవెన్యూ అధికారులు చుట్టుపక్కల ఉన్న భూము ల రిజిస్ట్రేషన్ ధరలను పరిగణలోకి తీసుకుని సగటు రేటు నిర్ణయిస్తారు. సదరు గ్రామం వద్ద ఒక చదరపు గజానికి సగటు ధర రూ.4 వేల నుంచి రూ.5 వేలలోపు ఉంది. రెవెన్యూ అధికారులు ఈ ధర పెంచేశారు. నిబంధనలకు పాతరేసి ఇక్కడ ఒక చదరపు గజానికి ధర రూ.7,750 నిర్ణయించారు. ఈ లెక్కన నాలుగు ఎకరాలకుపైగా భూమికి రూ.15 కోట్లకుపైగా డబ్బులు చెల్లించారు. ఈ భూముల యజమానులు పరిహారం తీసుకున్నారు. పదమూడు కిమీ ఐఆర్ఆర్ నిర్మాణం కోసం ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
తాజాగా తెరపైకి అక్రమాలు..
ఐఆర్ఆర్ కోసం ప్రభుత్వం ఇటీవల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో భూములు కోల్పోతున్న వారు ధరల నిర్ణయంపై పలు సందర్భాల్లో కలెక్టర్ బి గోపిని కలిశారు. భూముల యజమానులు, అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వరంగల్ మండలంలోని ఓ గ్రామం వద్ద భూసేకరణలో జరిగిన అక్రమాలు తెరపైకి వచ్చాయి. కొందరు ఈ అక్రమాలకు సంబంధించిన ఆధారాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. భూసేకరణ జరిగిన సమయంలో ఇక్కడ ఉన్న భూముల రిజిస్ట్రేషన్ ధరలు, రెవెన్యూ అధికారులు నిర్ణయించిన ధరలను ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవ ధరలపై గజానికి సుమారు రూ.3 వేల వరకు అదనంగా చెల్లింపులు జరిగినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులు ధరలు నిర్ణయించి చెల్లింపులు జరుపడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది.
విచారణకు ఆదేశాలు..
భూసేకరణలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం తాజాగా విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు అక్రమాలు జరిగిన గ్రామాన్ని కొద్దిరోజుల క్రితం సందర్శించారు. ఐఆర్ఆర్ కోసం సేకరించిన భూములను పరిశీలించారు. ఒక చదరపు గజానికి రూ.7,750 చొప్పున పరిహారం చెల్లించిన భూముల్లో కనీసం లే అవుట్ వంటివి కూడా లేవని, ధరను నిర్ణయించడంలో ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందినట్లు తెలిసింది.ప్రభుత్వం తాజాగా ఈ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని కూడా విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.