భీమదేవరపల్లి, ఆగస్టు 27: పీవీ స్వగ్రామం వంగరను ఏడాదిలోగా టూరిజం స్పాట్‌గా మారుస్తామని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. భీమదేవరపల్లి మండలం వంగరలో పీవీ స్మృతివనం నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ నరసింహారావు శతజయంత్యుత్సవ కమిటీ చైర్మన్ కే కేశవరావుతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. మొదట పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వంగర, లక్నేపల్లి రెండూ చరిత్ర కలిగిన గడ్డలేనని, మైనార్టీలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు ధైర్యంగా నడిపించిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. పేదలకు 800 ఎకరాల భూమిని ధారదత్తం చేసి భూసంస్కరణల చట్టం ప్రవేశపెట్టారని వివరించారు. పీవీ నడయాడిన ఈ ప్రాంత ప్రజలు ఎంతో అదృష్టవంతులని చెప్పారు. దేశ ప్రధానుల జ్ఞానవేదిక సమాధులు ఢిల్లీలో ఉంటే పీవీని మాత్రం అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశఖ్యాతిని ఇనుమడింపజేసిన పీవీ మరణాన్ని ప్రశ్నిస్తే అప్పటి పాలకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కరోనా కారణంగా వంగరలో చేపట్టిన పనుల్లో జాప్యం జరిగిందన్నారు. వంగరలో పీవీ జ్ఞానవేదిక, ఎగ్జిబిషన్, ఓపెన్ థియేటర్, స్వాగత తోరణం, డబుల్‌రోడ్డు, పీవీ ఇంటిని మ్యూజియంగా ఏర్పాటు చేసే పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. విద్యార్థులు సందర్శనకు వచ్చేలా తీర్చిదిద్దుతామని, బస్సుల్లో పిల్లలు వెళ్తుంటే పీవీ జీవిత విశేషాలు అన్ని వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో పీవీ విగ్రహం ఏర్పాటు చేసి పీవీ మార్గ్ అని నామకరణం చేసినట్లు తెలిపారు.
రాబోయే తరాలకు పీవీ దిక్సూచి : కెప్టెన్ లక్ష్మీకాంతారావు
రాబోయే తరాలకు పీవీ నరసింహారావు ఒక దిక్సూచి అని రాజ్యసభ సభ్యుడు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. పీవీ దేశానికి చేసిన సేవలను నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్వాక్రా సంఘాల గురించి బంగ్లాదేశ్‌లో తెలుసుకుని ఇక్కడ నెలకొల్పిన మహనీయుడు పీవీ అని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ ‘నేను ఎమ్మెల్సీ అయినా వంగర ముద్దు బిడ్డనే.. ఈ మట్టి వాసన మరువలేనిది..వంగరను పర్యాటక కేంద్రంగా చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని తెలిపారు. పీవీ శతజయంత్యుత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు మాట్లాడుతూ పీవీ ఇంటిని అన్ని హంగులతో మ్యూజియంగా తీర్చిదిద్దుతామన్నారు. వంగరను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు అభినందనలు తెలిపారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ మాట్లాడుతూ పీవీతో తనకు ఎనలేని బంధం ఉందని, తాతా అని పిలిచేవాడినని, పీవీ రామ్‌టెక్‌లో పోటీచేసిన సమయంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని గుర్తు చేశారు. వంగర గ్రామం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉండడం తన అదృష్టమన్నారు. అనంతరం ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు, కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్, టూరిజం శాఖ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ఆర్డీవో వాసుచంద్ర, టూరిజం ఎండీ మనోహర్‌రావు, డీఆర్డీవో శ్రీనివాస్ కుమార్, పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, పీవీ కశ్యప్, ఎంపీపీలు జక్కుల అనిత రమేశ్, మేకల స్వప్న, జడ్పీటీసీ వంగ రవి, సర్పంచ్ ఆలూరి రజిత, ఎంపీటీసీ నల్ల కౌసల్య, ఉపసర్పంచ్ నల్లగోని రాజు పాల్గొన్నారు.
పీవీకి గుర్తింపు తెచ్చింది సీఎం కేసీఆరే-మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
దేశానికి, ఉమ్మడి రాష్ర్టానికి గుర్తింపు తెచ్చిన పీవీ భౌతికంగా దూరమై ఇన్నేండ్లయినా ఎవరూ పట్టించుకోలేదని, పీవీకి అరుదైన గుర్తింపు తెచ్చింది సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. వంగరను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రూ. 13కోట్లు మంజూరు చేస్తున్న ట్లు ప్రకటించారు. వంగర నుంచి మంగళపల్లి, అమ్మగుర్తి, రత్నగిరి, కొప్పూరు గద్దల బండ వరకు రహదారి పనులు, రూ. 4కోట్లతో సీసీ రోడ్లు, రూ.50లక్షలతో బ్రిడ్జి పనుల కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని వెల్లడించారు. గ్రామాల్లో కారం, పసుపు వంటివి తయారు చేసి ఉపాధి పొందాలని, కిరాణం, కూరగాయల దుకాణం వంటివి పెట్టుకుని స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. పీవీ జ్ఞానవేదిక, స్మృతివనం తదితరాల కోసం ఇప్పటికే రూ.11కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.