వరంగల్, అక్టోబర్ 24(నమస్తేతెలంగాణ): ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి 5,092 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. సోమవారం నుంచి నవంబర్ 3వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. కరోనా నిబంధనలతో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. కరోనా దృష్ట్యా ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఐసొలేషన్ గదిని ఏర్పాటు చేశారు. జ్వరంతో బాధపడే విద్యార్థులు ఈ ఐసొలేషన్ గదిలో పరీక్ష రాస్తారు. ప్రతిరోజు ఆయా పరీక్ష కేంద్రంలో మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది శానిటైజేషన్ చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సెంటర్ల వద్ద విద్యార్థులకు థర్మా మీటర్‌తో ఉష్ణోగ్రతను పరీక్షిస్తారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు ధరించేలా, బెంచీకి ఒక విద్యార్థి మాత్రమే కూర్చునేలా, ఒక్కో హాల్లో 20 నుంచి 30 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీ గోపి ఎన్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఉదయం 8 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సులు నడుపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
నిమిషం ఆలస్యమైనా ఇంటికే..
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు అధికారులు ప్రకటించారు. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఉదయం 9 గంటల్లోగా పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్థులను ఏ కారణం చేతకూడా వెనక్కి పంపడం ఉండదన్నారు. హాల్‌టికెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని, డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ వెంట తీసుకొచ్చే విద్యార్థులను సెంటర్లోకి అనుమతిస్తామని మాధ్యమిక విద్య జిల్లా అధికారి కాక మాధవరావు చెప్పారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో ఒక జిల్లాస్థాయి ఎగ్జామినేషన్ కమిటీ పని చేస్తుంది. మాధవరావు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో సీనియర్ ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీతో పరీక్షల కోసం ప్రత్యేకంగా రెండు సిటింగ్ స్కాడ్లు, ఒక ైఫ్లయింగ్ స్కాడ్ ఏర్పడింది. ైఫ్లయింగ్ స్కాడ్‌లో ఒక ఎస్సై, డిప్యూటీ తాసిల్దార్ ఉన్నారు. ఈ స్కాడ్స్లోని అధికారులు ఆదివారం పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి, ఏర్పాట్లను పరిశీలించారు.
కరోనా నిబంధనలతో ఏర్పాట్లు
ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో నర్సంపేట, నెక్కొండ, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, గీసుగొండ, ఖానాపురం తదితర మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో 25 సెంటర్లను ఏర్పాటు చేశాం. యాప్ డౌన్లోడ్ చేసుకుని జియో ట్యాగింగ్ ద్వారా విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి చేరుకోవచ్చు. కరోనా నిబంధనలపై ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు విధిగా మాస్కులు ధరించి శానిటైజర్ వెంట తెచ్చుకోవాలి.